ఆంధ్రప్రదేశ్‌

చట్టాలే మహిళలకు ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: నేటి సమాజంలో చట్టాలే మహిళలకు ఆయుధాలని, వాటిని సక్రమ రీతిలో ఉపయోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి పిలుపునిచ్చారు. సాక్షులకు రక్షణ లేకపోవడంవల్ల చాలా కేసుల్లో కోర్టువరకు వచ్చేసరికి విఫలమవుతున్నాయన్నారు. అందువల్ల సాక్షులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించడానికి కృషిచేయాలని, సాక్ష్యాధారాలకు స్వేచ్ఛ కల్పించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మహా సభల్లో భాగంగా రెండో రోజు ‘మహిళలపై పెరుగుతున్న హింస నివారణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో జస్టిస్ రోహిణి ప్రసంగించారు.
ఫోర్నోగ్రఫీ, మద్యం కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఫోర్నోగ్రఫీని పూర్తిగా నిరోధించాలన్నారు. సమాజంలో మహిళలను బలహీనులుగా చూస్తున్నారని, శారీరకంగా బలహీనం కావచ్చేమో కానీ, పురుషుల కంటే అన్ని విషయాల్లోనూ మహిళలు బలవంతులేనన్నారు. చాలా సందర్భాల్లో 498 ఏ సెక్షన్ దుర్వినియోగమవుతోందన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగా ఈ చట్టాన్ని దుర్వినియోగపరిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరగొచ్చన్నారు. నిర్భయ చట్టంలో కూడా చాలా సవరణలు వచ్చాయని, శిక్షలు కఠినతరంగా మారాయని, అవగాహన కలిగి సక్రమ రీతిలో ఉపయోగించుకోవాలన్నారు. సైబర్ నేరాల్లో కూడా సవరణలు తీసుకొచ్చారని, చైల్డ్ ఫొర్నోగ్రఫీ నేరంగా పరిగణిస్తున్నారన్నారు. అత్యాచారానికి గురైన మహిళ అంతటితో జీవితం అయిపోయినట్టు మానసికంగా కృంగిపోకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మహిళా చట్టాల సక్రమ వినియోగానికి ఐద్వా సంఘటిత శక్తితో పని చేయాలన్నారు.
తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్-్ఛన్సలర్ సి మృణాళిని మాట్లాడుతూ అన్ని రంగాల్లో పురుషుడి కంటే ఉన్నత స్థాయికి మహిళలు చేరుకోవడంతో పురుషుడిలో ఏర్పడిన అభద్రతాభావం అసూయగా మారి మహిళలపై అకృత్యాలకు పాల్పడే స్థాయికి దారితీస్తోందన్నారు. ఒక మనిషి పుట్టుకకు జన్మనిచ్చే స్ర్తి పురుషుడి కంటే బలహీనురాలు కాదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. మద్యం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని 1928లో స్వాతంత్రోద్యంలో కనుమర్తి వరలక్ష్మమ్మ చెప్పారని గుర్తుచేస్తూ మద్యపాన నిరోధానికి మహిళే నడుంబిగించాలన్నారు.
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ తమ సంఘం ముందు ఎన్నో సవాళ్లున్నాయని, రానున్న కాలంలో ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సివుందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషను బిల్లు పురుషాధిక్య సమాజం వల్ల రెండు దశాబ్దాలుగా ఆమోదం పొందలేకపోయిందని, వామపక్షాలే నేటికీ ఆ బిల్లు కోసం కృషి చేస్తున్నాయన్నారు. మహిళ అత్యాచారాల కేసుల్లో కేవలం 25 శాతమే శిక్షలు పడుతున్నాయన్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు తప్పించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో ఎపుడూ చూడని పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రానున్న కాలంలో ఐద్వా సభ్యత్వం రెట్టింపు స్థాయికి పెరగాలని సూచించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జి ప్రభావతి అధ్యక్షవర్గంగా సాగిన ఈ సదస్సుకు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షురాలు తులసి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి