తెలంగాణ

కాంగ్రెస్ నేతలవి పగటి వేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఏప్రిల్ 4: అధికారంలో ఉండగా ప్రజల ఆకాంక్షల గురించి, అవసరాల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంక్రాంతి పోయాక వచ్చిన గంగిరెద్దుల వేషగాళ్ల మాదిరిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మానుకోట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం పోరాడుతుంటే వలసవాదుల పంచన చేరిన నాయకులు తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు రైతుల గురించిగాని, రాష్ట్రం గురించిగాని పట్టించుకోని కొందరు కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నాలుగురకాల కండువాలు మెడలో వేసుకొని రాష్టయ్రాత్రకు బయలుదేరారని ఎద్దేవా చేశారు.
రైతులకు సరైన విద్యుత్ ఇవ్వలేక, విత్తనాలు, ఎరువులు అందించలేక లైన్‌లలో నిలబెట్టి పోలీస్‌స్టేషన్‌లో పంపిణీ చేసిన రోజులు మరిచిపోయిన ఆ మహానుభావులు ఇప్పుడు రైతులపై కపటప్రేమ ఒలకబోస్తుంటే వీరి పగటి వేషాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 24గంటల విద్యుత్ వ్యవసాయానికి అందిస్తున్నది మీ కళ్లకు కనబడడం లేదా? అన్ని కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి సమయానుకూలంగా ఏమాత్రం కొరత లేకుండా నాణ్యమైన విత్తనాలు, కావాల్సినంత ఎరువులు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అంతేగాక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి ఎకరాకు రూ.8వేల చొప్పున రైతుబంధు పేరిట సాయం అందించబోయే కొత్త చరిత్ర గురించి రైతులందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఈ కాంగ్రెస్ నేతలకు వినిపించడంలేదా అని అన్నారు. పాలేరుకు పోయి రైతులను ఓదార్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ నాయకులను చూసి రైతులు కంగారుపడుతున్నారని, కాంగ్రెస్ నాయకులు బైరూపుల వేషాలు కల్లబొల్లి కన్నీళ్లు నమ్మిమోసపోవడానికి తెలంగాణ రైతులు అమాయకులు కాదని కాంగ్రెస్ పెద్దలు గుర్తించాలని కేటీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సారథే ముఖ్యమంత్రిగా మారడంతో సరికొత్త చరిత్రకు తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని అత్యంత బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. రూ.17వేల కోట్ల రూపాయల రైతురుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని అన్నారు. 70సంవత్సరాల్లో జరగని అభివృద్ధి నాలుగు సంవత్సరాల్లోనే చేసి చూపిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునే దిశగా అభివృద్ధి చేసుకునే వైపుగా రాష్ట్రప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కేటీఆర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందులాల్, మానుకోట ఎంపి సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డిఎస్ రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నూకల నరేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, సత్యవతి రాథోడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జిల్లాపరిషత్ చైర్మన్ గద్దల పద్మ, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.