తెలంగాణ

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈసారి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముందన్న సమాచారంతో అధికారులు ప్రజల సౌకర్యార్దం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కాస్త ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించారు. ఆ తర్వాత ఏర్పాట్లపై బత్తిని హరినాథ్‌గౌడ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే ఆస్తమా రోగులకు ప్రకృతి పరంగా లభించే పదార్థాలతో తయారు చేసిన ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బత్తిని కుటుంబీకులు ఐదు తరాలుగా 173 సంవత్సరాల నుంచి ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రసాదం తీసుకునేందుకు వచ్చిన వారికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి కూడా చేప ప్రసాదానికి లక్షలాది మంది తరలివస్తున్నట్టు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రసాదం పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. ప్రసాదం పంపిణీకి ఈ నెల 8వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ సందర్శనలో జిహచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ భారతీ హోళీకేరి, జేసీ శ్రీ వత్సకోట, బత్తిని హరినాథ్‌గౌడ్, వివిధ శాఖల అధికారులున్నారు.
ఏర్పాట్లు ఇవి
చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కూపన్ల పంపిణీకి 34 కౌంటర్లను ఏర్పాటు చేయగా, ప్రసాదం పంపిణీకి మరో 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవేగాక, 2 మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదం పంపిణీలో మత్స్య శాఖ నుంచి 360 మంది సిబ్బంది విధులు నిర్వర్తించి, లక్షా 30వేల కొర్రమీను చేప పిల్లలను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఆర్టీసి బస్ స్టేషన్లు, అన్ని రైల్వేస్టేషన్ల, ప్రధాన కూడళ్లు, విమానాశ్రయం నుంచి కూడా చేప ప్రసాదం కోసం వచ్చే వారిని తీసుకువచ్చేందుకు 133 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజల సౌకర్యార్థం 3 వైద్య ఆరోగ్యశిబిరాలు, మరో 3 మొబైల్ మెడికల్ క్యాంప్‌లతో పాటు 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. పంపిణీ సక్రమంగా జరిగేందుకు వీలుగా 1500 మంది పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించనున్నట్లు, ఈ బందోబస్తును ఇద్దరు డీసీపీలు, ఎనిమిది ఏసీపీలు, 22 మంది ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికపుడు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మరో 150 మంది పోలీసులను నియమించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పార్కింగ్ ప్రదేశాలతో కలిపి గ్రౌండ్స్‌లో ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో జనం హాజరువుతున్నందున మెరుగైన శానిటేషన్ కోసం 1230 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. గ్రౌండ్స్ ఆవరణలో శాశ్వతంగా ఉన్న వంద మరుగుదొడ్లతో పాటు అదనంగా మరో మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నారు. ప్రజలకు సహకరించేందుకు 800 మంది వాలంటీర్లను వివిధ సంస్థలు నియమించనున్నాయి. నాలుగు ఫైర్ ఇంజన్లు, 4 మొబైల్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచనున్నారు. జలమండలి ఆధ్వర్యంలో 3లక్షల మంచినీటి ప్యాకెట్లను 75 మంది సిబ్బందితో ఉచితంగా పంపిణీ చేయించనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే గాక, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే వారి సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ ఈ నెల 7,8 తేదీల్లో రెండురోజుల పాటు రూ.5 భోజనాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అందుబాటులో ఉంచనుంది. సాధారణంగా కేవలం మధ్యాహ్నం మాత్రమే అందుబాటులో ఉంచే ఈ భోజనాన్ని చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం రెండురోజుల్లో రాత్రిపూట అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.