తెలంగాణ

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 27: ఎప్పుడు ఎన్నికలొచ్చినా సంస్థాగతంగా, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయక, ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత దృష్ట్యా ఓటమి భయంతో మళ్లీ అబద్ధాల మాటలతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు పూర్తి కాలం పనిచేయాలని అధికారం అప్పగిస్తే, ఆర్నెళ్ల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమిటీని ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్‌లోని అర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహించిన రాహుల్ పర్యటనతో టీఆర్‌ఎస్ నేతలకు భయం పట్టుకుందని, కాంగ్రెస్ హామీలను చూసి బెంబేలెత్తిపోయి ముందస్తు ఎన్నికలకు వెళ్తూ, మళ్లీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఆరు నెలల ముందే మీ మొఖాలు చూసే భాగ్యం పోతున్నందుకు ప్రజలకు సంతోషంగా ఉందని, కానీ సాంకేతికంగా ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమిస్తారని అన్నారు. చత్తీస్‌గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలు మినహా ఎన్నికలకు సంబంధించి 2018 మే 7న కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల సవరణకు నమోదు కార్యక్రమానికి ఒక ప్రకటన జారీచేసిందని, ఆ ప్రకటన ప్రకారం 2019 జనవరి 4న వరకు ఓటర్ల సవరణకు గడువు విధించినట్లు ఉందని, మరి డిసెంబర్‌లోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనికితోడు జమిలి ఎన్నికలపై ఆసక్తి ఉన్న ప్రధాని మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, అభిప్రాయాలను సేకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఏలా సహకరిస్తారని నిలదీసారు. కేసీఆర్, మోదీల రహస్య ఒప్పంద మేరకే ముందస్తు ఎన్నికలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికలు జరిగిన మూడ్నాలుగు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని, రెండుసార్లు ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని అన్నారు. దీనిపై మోదీ, బీజేపీ నేతలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరముందని తెలిపారు. ఇకపోతే ప్రగతి నివేదన సభ 25లక్షల మందితో నిర్వహిస్తామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2.50లక్షల మందిని తరలిస్తామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, ఇంతమందిని తరలించాలంటే 25వేల వాహనాలు అవసరముంటాయని, ఇన్నీ వాహనాలు ఉన్నాయా ? ఎందుకు ప్రజలను మభ్యపెడతారంటూ ? ప్రభాకర్ ఏద్దేవా చేశారు.