తెలంగాణ

తెలంగాణ సరిహద్దుల్లో అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్న కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దులో ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు సరిహద్దు ఆవల ఉన్న రాష్ట్రంలోని మండలాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై సహకరించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్, రవాణా శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఆ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమార్కులు చొరబడకుండా చూడటం, మద్యం రాకుండా చర్యలు తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని అడ్డుకోవడం, అక్రమ వాహనాలు, అక్రమ రవాణా, రౌడీషీట్ ఉన్నవారు రాకుండా చూడటంపై చర్చించి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి అధికారి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ సమావేశంలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మండల, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సరిహద్దు దాటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వారు జిల్లాలోకి అడుగు పెట్టకుండా చూడటంతో పాటు మద్యం, నగదు జిల్లాలోకి రాకుండా చూసేందుకు ప్రతి చెక్‌పోస్టు వద్ద ఒక మండల స్థాయి అధికారి పోలీసులతో కలిసి ఉండనున్నారు. ప్రతి వాహనాన్ని పరిశీలించడంతో పాటు ఆ సమయంలో వీడియో కూడా తీసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సరిహద్దు ఆవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు కూడా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. అదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో నేరచరిత్ర కలిగిన వారందరిపై బైండోవర్ కేసులు పెట్టి వారు ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టేలా ఆదేశాలు జారీచేశారు. ఇదే క్రమంలో నియోజకవర్గాల్లో అనుమతి లేకుండా తిరిగే వాహనాలను కూడా అడ్డుకునేందు కోసం అభ్యర్థుల వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఒకే అనుమతితో ఎక్కువ వాహనాలు తిరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులతో ప్రత్యేక టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. వీరు నిత్యం తమకు కేటాయించిన ప్రాంతాల్లో తిరుగుతూ వాహనాలను పరిశీలిస్తున్నారు.