తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, నవంబర్ 15: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎన్నో లేఖలు రాశారని, ఆ లేఖలను బహిర్గతం చేశానని, వాటిని వెనక్కి తీసుకొనే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం సిరిసిల్ల రాజన్న జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, అలాంటి నాయకునితో కాంగ్రెస్ నాయకులు మహాకూటమిగా జతకట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిందని, నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను, రైతులకు 24 గంటల విద్యుత్, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతుబీమా చేపట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చేతకాక ఆంధ్రాపార్టీ తెలుగుదేశంతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి మహాకూటమిగా ఏర్పడి కౌరవులుగా వస్తున్నారని, టీఆర్‌ఎస్ సింగిల్‌గా వచ్చి పాండవులుగా యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న పోరాటమని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా బిల్లు, కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, ప్రభుత్వ దవాఖానాలో నాణ్యమైన వైద్యం, కేసీఆర్ కిట్, ప్రతి నెల పెన్షన్ల చెల్లింపు కార్యక్రమాన్ని చేపడుతున్న టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏం చేశారని? జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులను నిర్మించి 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా రమేష్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే, రుద్రంగి మండలం కలికోట సూరమ్మ చెరువులో గోదావరి జలాలకు పూజలు చేసి రుద్రంగి రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రమేష్ బాబును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో మంత్రి హరీష్ రావుకు స్వాగతం పలికారు. ఎంపీ వినోద్ కుమార్, టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, జడ్పీటీసీ అంబటి గంగాధర్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ నామాల ఉమ తదితరులు పాల్గొన్నారు.