సబ్ ఫీచర్

బొమ్మలు చెప్పిన సాంస్కృతిక చరిత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తొణికిసలాడిన హస్తకళా నైపుణ్యం శ్రీ గాయత్రి సేవా హృదయం వృద్ధాశ్రమ సేవానిరతి

గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటైన ‘లక్ష బొమ్మల కొలువు’ సంక్రాంతి సంప్రదాయానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించిన కళావేదిక. పక్షం రోజుల పాటు పద్మావతీ కల్యాణ మండపంలో కొలువుదీరిన ఈ బొమ్మలు మన సాంస్కృతిక చరిత్రకు అద్దంపట్టాయి. అడుగడుక్కీ వైవిధ్యం.. గతంలోకి జారిపోయిన చరిత్ర జ్ఞాపకాలు ఒక్కొక్కటీ వెలికితీసి అపురూపంగా అమర్చుతూపోతే ఆవిష్కృతమయ్యే ఒక అద్భుతమైన మానవ జీవన దృశ్యం! ‘ఎందెందు వెదికిచూసిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు’ అంటూ ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి విష్ణు మాయారూపాలన్నీ చెప్పినట్లుగా దేవదేవుని అవతారాలన్నీ అక్కడ ఏర్చికూర్చారు. దేవదేవుళ్లను స్మరిస్తూ నడిస్తే అది ఆధ్యాత్మిక ప్రదేశం. మానవ జీవిత కోణాల్ని స్పృశిస్తూ తిలకిస్తే అది కాలచరిత్రకు సంకేతం. మానవుని సృజనాత్మక శక్తిని అవలోకిస్తూ విహరిస్తే అది హద్దులు లేని కళారంగ వైభవం. ఒక తరానికి చెందిన మనుషులు జీవించిన వైభవానికి తీపి గురుతులు. అడుగడుగునా అందమైన ఆ బొమ్మల్లో అణువణువునా తొణికిసలాడిన హస్తకళా నైపుణ్యం.. కళాకారుల చేయి తిరిగిన పనితనపు సోయగం. అది కేవలం బొమ్మల కొలువు మాత్రమే కాదు నేటి కాంక్రీట్ జంగిల్‌లో మనం పోగొట్టుకున్న పల్లెపట్టుల జీవన శ్రమైక సౌందర్యం. ఇదిగో.. రండి! మీ గతకాలపు జీవన సహజత్వాన్ని తెలుసుకోండి.. అంటూ కళాకారులు ప్రాణం పోసిన ఆ బొమ్మలు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తాయి.
మంత్రముగ్ధుల్ని చేసిన లక్ష బొమ్మల కొలువు
బొమ్మల కొలువు గురించి రేఖామాత్రంగా తెలుసుకోవడం సందర్భోచితం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ సంస్కృతిని ప్రతిబింబించే విభిన్న రీతుల కళారూపాలు ఈ లక్ష బొమ్మల కొలువులో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వాటి అమరికలోనూ ఓ క్రమపద్ధతి పాటించడం మనల్ని ఆకట్టుకుంటుంది. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కథక్, థింసా, జాజిరి వంటి మన దేశంలోని విభిన్న శాస్ర్తియ, జానపద నృత్య రీతులు; ఆయా కాలాల్లో ఈ నేలపై నడయాడిన శంకరాచార్య, గౌతమబుద్ధ, వివేకానంద, గురునానక్ తదితర మత గురువులు, ప్రబోధకులు; జట్కా బళ్లు, ఎడ్ల బళ్లు, తోపుడు బళ్లు, మేనాలు వంటి అలనాటి ప్రయాణ సాధనాలు; వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, ఒప్పులగుప్పా లాంటి సంప్రదాయ ఆటలు; రకరకాల గంగాళాలు, రాతిచిప్పలు, గుండిగలు, జంతికల యంత్రం వంటి వంటింటి సామగ్రి; విత్తనాలు నాటే ‘జడ్డిగం’ యంత్రంతో పాటు పలు రకాల పురాతన వ్యవసాయ పనిముట్లు; అక్షయ పాత్ర, ఆకాశ దీపం, భోషాణం, మునసబు పెట్టె, సాన, సనె్నకల్లు వంటి అలనాటి వస్తువులు, గిద్దె, సోల, కుంచం, అడ్డిగ, మానిక వంటి కొలతలు, వివిధ రాష్ట్రాల్లో వధూవరుల అలంకరణల తీరుతెన్నులు.. ఇలా అనేక అంశాలకు సంబంధించిన బొమ్మలను ఈ తరానికి తెలిసేలా ప్రశంసనీయంగా ప్రదర్శించారు. ముఖ్యంగా మన ఆంధ్రుల పెళ్లి తంతులో ముఖ్య ఘట్టాల్ని ‘రమణీ’యమైన బొమ్మలతో వరుస క్రమంలో అమర్చిన తీరు కళాభిమానులను కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది.
మట్టి, కొయ్య, లోహం, వెదురు, కొమ్ము, పింగాణి, కాగితం, తోలు, తదితర ముడి పదార్థాలతో తయారైన వివిధ రకాల బొమ్మలు వేటికవే తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో బొమ్మల కొలువులు పెట్టడం, పేరంటాలు చేయడం మన సంస్కృతిలో భాగంగా మనకు తెలుసు. అయితే ఆ సంస్కృతిని ఓ ఈవెంట్‌గా తీసుకుని లక్ష బొమ్మలతో ఓ కొలువును ప్రదర్శించడం ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. దీనివెనుక నిర్వాహకుల ప్రణాళిక, కృషి అనన్య సామాన్యం! ఈ బృహత్తర కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ గాయత్రి సేవా హృదయం వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆరేమండ రవి కల్యాణచక్రవర్తి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు.
‘మన దేశంలో విభిన్న కాలాల్లో, విభిన్న ప్రాంతాల్లో విలసిల్లిన సాంస్కృతిక కళా వారసత్వాన్ని నేటి తరానికి అందించాలనే సదాశయంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం’ అని చెప్పారాయన. దాదాపు రెండు దశాబ్దాలుగా వృద్ధాశ్రమం ద్వారా సామాజిక సేవ చేస్తున్న వీరు ఇప్పుడు పెద్దఎత్తున ఈ కళాసేవ చేయడం వెనుక వారి లక్ష్యం ఏమైనప్పటికీ సలక్షణంగా ‘లక్ష బొమ్మల కొలువు’ పెట్టడం ముదావహం. ఇకముందు కూడా ఈ పరంపర కొనసాగించాలనుకోవడం అభిలషణీయం, ఆహ్వానించదగిన విషయం.

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- సీఎస్, డీఎస్,