సబ్ ఫీచర్

అమ్మా! ముందస్తుగా రామ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా! తల్లీ! మా అమ్మోరూ..
మీనాక్షివైన నీ కళ్ళకు కన్పిస్తున్నాయా
నేడు నిత్యం జరిగే నేరాలు, ఘోరాలు, దారుణాలు, దౌర్జన్యాలు,
దురాగతాలు, దుష్టుల దురంతాలు, దగాలు, దురాలోచనలు,
దుశ్చర్యలు, దుష్కృతాలు,
మెసాలు, నమ్మకద్రోహాలు, పంచమహాపాతకాలు,
కొందరు స్వార్థపరుల పన్నాగాలు, దుర్బుద్ధులూ,
అఘాయిత్యాలు, అత్యాచారాలూ..
చూస్తున్నావా? చూసి మిన్నకుంటున్నావా?
చూసీ చూడనట్లుంటున్నావా? పట్టీపట్టనట్లుంటున్నావా?
ఆంటీ అంటనట్లుంటున్నావా? ఆ! నాకెందుకనుకుంటున్నావా?
ధరిత్రిలా నువ్వూ అన్నీ సహిస్తున్నావా?
మంచివారు, సాధుసంతుల,
హత్యలను, భ్రూణహత్యలనూ, అతివలు, అనాథల ఆక్రందనలను,
అన్నీ చూస్తూ మమ్మల్నీ నీలా నిశ్శబ్దంగా ఉండమంటున్నావా?
ఎనే్నళ్ళైనా చేతకాని వారిలా, శక్తిహీనుల్లా
మమ్మల్నీ సహించమంటున్నావా? భరించమంటున్నావా?
నీకిది లవలేశమైనా తగునా? సబబా?
భావ్యమా? న్యాయమా? ధర్మమా?
అప్పుడెప్పుడో కృత, త్రేత, ద్వాపరయుగాల్లో
దైత్యులు, దనువులు, అసురులపై నీవు కనె్నర్ర చేసి
వారిని ఓ చూపు చూసి, నీ సత్తా చూపావుట.
ఒక చేయి చాలదని పది చేతులు,
ఒక ఆయుధం చాలదని పదింటిని
చండి, చాముండి, కాళి, మహంకాళి,
రుద్రకాళి, భద్రకాళి వంటి ఒక్కరూపం
చాలదని నవదుర్గలయ్యావు
అవీ చాలవని సహస్ర రూపాలతో వారి అంతం చూసి
అమాంతంగా అంతం చేశావుట..
శాంతిభద్రతలు, సుఖసౌఖ్యాలు పిపీలికాది
ఎనభై నాలుగు లక్షల్లోని సకల జీవరాశులకూ స్వయంగా
పునఃప్రసాదించావుట
చతుర్వేదాలు, అష్టాదశపురాణాలు, నీ సహస్రనామాలు
ముందు తరాలకు రాసి, నీ ఘనతను చాటి చెప్పిన మగవారైన
వ్యాసుడు, హయగ్రీవుడు, త్రిమూర్తులు, ఇంద్రాదిదేవతలు,
సత్పురుషులు, సప్తర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులకు సైతం
నీ గురించి పూర్తి అవగాహన లేదుట
ఎక్కడో మణిద్వీపాన వాణీ, రమాసైతంగా కొలువైన
నీ తత్త్వం సంపూర్ణంగా, సమగ్రంగా వారు గ్రహించలేకపోయారుట
ఏమో! నాకేం తెలుసు? నావంటి అల్పబుద్ధి జీవులు చూళ్ళేదు కదా!
మరి, ఈ కలియుగాన నీలోని రోషం, పౌరుషం,
ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం,
ఆత్మబలం, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం
ఏమయ్యాయి? ఏమైపోయాయి? ఎందుకు వెనక్కు తగ్గాయి?
రాను రాను ఎందుకు? ఎందుకు మరింత కనుమరుగౌతున్నాయి?
ఎన్నాళ్ళు, ఎనే్నళ్ళు, మరెన్ని దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, కల్పాలు
మమ్మల్ని ఓర్చుకోమంటావు? ఇవన్నీ భరించమంటావు? చూడమంటావు?
మాలో కొందరికి క్షమ, ఓర్పు, దయ, కరుణ కృశిస్తూ, నశిస్తూ
మంటగలుస్తున్నాయమ్మా! అమ్మా! మా తల్లీ! మా అమ్మోరు!
నీ శక్తి సామర్థ్యాలు నీకు బహుశా గుర్తురావట్లేదేమో! మరిచావేమో!
అదీ ఈ యుగ ప్రభావమేనంటావా? నిన్ను నమ్ముకున్న ఫలితమంటావా?
లేక ఇవన్నీ నీ లీలలు, మహిమలు, మహత్యాలలో భాగమంటావా?
నేడూ, ఈనాడూ, నరరూప రాక్షసులుగా దుర్గములు,
రక్తబీజులు, మహిషులు,
శుంభ-నిశుంభులు, చండ-ముండ-్భండాసురులు, వేయితలల రావణులు
దుర్యోధన, దుశ్శాసనులు, కీచకులు ఈ యుగానా
ప్రతిచోట, ప్రతి ప్రాంతానా, ప్రతి దేశానా, ప్రతి ఖండాన
మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ పుట్టి పెరిగి
విచ్చలవిడి, విశృంఖల దారుణాలకు, దానవకాండలకు
దారుణ మారణ హోమాలకు, ఒడిగడుతుంటే,
అన్యాయాలు, అధర్మాలు-అక్రమాలు, అవినీతి
ప్రతిదినము అంతకంతకూ పెచ్చు పెరుగుతుంటే
మమ్మల్ని- మాపాలితుల్ని, సద్ధర్మ - సదాచార పరాయణులను,
శిష్ట-శ్రేష్ట జనులలో కొందరిని అసమర్థులుగా చేసి,
నీవు తైతక్కలాడించడం మేమింకా చూడలేము
వేగలేము భరించలేము సహించలేము ఓర్చుకోలేము
మా ఇలవేల్పుగా, మా పేరంటాళ్ళుగా, మా కులదేవతలుగా
నూరు గ్రామదేవతలుగా నీవున్నా, సహస్ర రూపాల్లో కొలువు తీరినా,
అష్టాదశ శక్తిపీఠాల్లో అలంకృతవైనా, పంచభూతాల్లో ఉన్నా
కళ్ళారా నీ వైభవం నీ ఉపాసకులతోపాటుగా
చూసి ఆనందించటానికే ప్రస్తుతం మేము పరిమితమయ్యాము
కానీ నీవు మాత్రం పసుపు-కుంకుమలు
గాజులు, కడియాలు, మెట్టెలు ఇత్యాది ఏడువారాల నగలు
నిత్యకుంకుమార్చనలు, వాయనాలు
ఉద్యాపనలూ నోములూ వ్రతాలూ ఉపవాసాలూ
షోడశోపచారపూజాది పునస్కారాలూ హోమాలూ
యజ్ఞయాగాదులు, ప్రతినిత్యం ముప్పూటలా
బాలభోగ, అవసర, మహానైవేద్యాలు
సుష్టుగా స్వీకరిస్తున్నావు.
ఠంచనుగా పొందుతూ, తృప్తి పడుతున్నావు.
కొన్ని రూపాల్లో మద్య - మాంసాదులూ విందుగా ఆరగిస్తున్నావు.
‘పరమాత్మ బావుంటేనే జీవాత్మ బావుంటుందని’ అంటున్నావు.
మరికొన్ని రూపాల్లో నీ బిడ్డలైన పశు-పక్ష్యాదుల్ని
నేటికీ బలిగొంటున్నావు. వాటి రక్తం కళ్ళ చూస్తున్నావు.
ప్రాణాలు తీసేయిస్తున్నావు.
మాకు ఏదో ఒకటి సర్ది చెప్తున్నావు. సమాధాన పరుస్తున్నావు.
నోరెత్తకుండా, మమ్మల్ని ఊరుకోమంటున్నావు
మేళ, తాళాలతో ఆడి, పాడుతున్న
నీ ‘్భజనబృందాల’ కీర్తనలు, సంకీర్తనలు, మంగళహారతులతో
ఉల్లాసంగా, ఉత్సాహంగా, పొంగిపోతూ, ఊరంతా ఊరేగుతున్నావు.
అదీ అయ్యవార్లతో సమానంగా, నీకేమీ తక్కువ కాదంటూ..
ఉత్సవాలు, జాతరలు, సంబరాలు, వగైరాలు సమయానికి పొందుతూ,
జరిగే అకృత్యాలు చోద్యంగా చూస్తూ, మాలో కొందరిలా నువ్వూ
వినోదిస్తున్నావు. చిద్విలాసంగా విహరిస్తున్నావు. ఏమైనా..
నీవు అన్నీ చూస్తూ, అంతా చూస్తూ ‘నాకెందుకులే’ అని
మాలో కొందరిలా నీవూ ఊరుకోవడం..
నీకన్నీ చేతనైయుండి కూడా ‘్భష్ముని’లా మిన్నకుండటం,
నా దృష్టిలో అధర్మం, అన్యాయం, నేరం, ఘోరం.
అమ్మా! తల్లీ! మా అమ్మోరూ
ఈ కలియుగ ప్రథమ పాదానే ఈ ఘోరకలిని
మా కళ్ళెదుట నిత్యం జరుగుతున్న
జరగరాని- జరగకూడని అకృత్యాలను వెనువెంటనే
ఆపేందుకు ఒక్కసారి, ఒకే ఒక్కసారి
మరలా- మావంటి దీన, హీన, పాప, పతితులు, అనాథజనుల కోసం
నీ భక్తపరమాణువు కోసం, అల్పులు, అజ్ఞానుల కోసం,
మేమూ మా తరమూ ఓసారి నీ శక్తియుక్తులను
ఓ క్షణం పాటు కాదు, కాదు..
ఓ నిముషం పాటైనా తనివితీరా చూసి
జన్మసార్థకం చేసుకోవడానికైనా
భూకంపంలాగానో, ప్రకృతి విలయంగానో కాకుండా
ఓ అనూహ్య, అపురూప, అనితర సాధ్య, అమోఘ,
ఎవరికీ- ఏ మగాడికీ అలివికాని రూపాన ముందస్తుగా వస్తూంటే,
గుర్తించాలి, గుర్తెరగాలి..
‘ ఆ వచ్చినది నీవేనని’ మేము గ్రహించే రూపాన
నీవు ముందస్తుగా తప్పక వచ్చి తీరాలి
మేము చూడాలి నీ ‘దేవీభాగవతం’
నీ నవవిధ భక్త్భివాలు
నీ నామజపతప హోమాదులు
అసత్యం కావని మరోసారి నీవే నిరూపించాలి.
ఇది నీ ధర్మంగా భావించి నీవు ధర్మాన్ని కాపాడటం మేము కళ్ళారా
ఓసారి చూడాలి రామ్మా. నీ రాక ఇక ‘ముందస్తు’గా తప్పనిసరి.
అగమ్యగోచర, అయోమయ, అమాయక స్థితుల్లో ఉన్న
మమ్ము నీవు రక్షించడానికైనా ‘ముందస్తు’గా రావాలి
అమ్మా! తప్పదు మరి..
నీ కథలు, రూపాలు, నామాలు అబద్ధాలు కానేకావని,
పుక్కిటి పురాణాలు అసలే కావని,
మా సమకాలీన ప్రపంచానికి చాటి చెప్పడానికైనా ఒక్కసారి రామ్మా!
సకల జీవరాశులకు, సమస్త సృష్టికి, కనీస ప్రాణ భిక్ష పెట్టమ్మా..
ఎందుకంటే, నేడది అసలే కరువౌతోంది కనుక,
ఇది మా అభ్యర్థన, వేడుకోలు, విజ్ఞాపన, ప్రార్థన..
కోటానుకోట్ల సాష్టాంగ దండప్రణామ సహితంగా
నిన్ను బ్రతిమాలుతూ రమ్మని కోరుతున్న దుర్భరస్థితి, దుస్సహస్థితి
మా, మా విద్యుక్త ధర్మాలను
నిర్విఘ్నంగా, నిరాటంకంగా మేము చక్కగా నిర్వర్తించేలా
సత్య, ధర్మ, నాయ్య, దీక్షా దక్షతలను మరోసారి పునఃప్రతిష్టించటానికైనా
నీ ఆగమనం తప్పదు. నీ రాక ‘ముందస్తు’గా తప్పదు.
నీ రూపాలను, నీ దివ్యమంగళ సర్వాలంకార శోభిత
ఎంతో నిగ్రహంతో కూడిన నీ మూర్తిని,
చాలా కొద్దిసేపే ఆ యుగాల్లో చూసిన మాకు,
నేటి మా సమకాలీన ప్రపంచానికి అభయమిచ్చావుట..
మరోసారి నీవున్నావని..
‘అవసరమైతే మళ్ళీ వస్తాననీ’ అప్పట్లో చెప్పావుట.
ఇప్పుడూ.. కనీసం ఈ దసరా నవరాత్రుల్లోనైనా..
కొద్దిపాటి తీరిక చేసుకుని బహు చక్కని కనుముక్కు తీరున్న మా అమ్మా..
ఓసారి ‘ముందస్తు’గా రామ్మా.. అప్పుడు నీవు ‘సద్ధర్మస్థాపనలో మేటివని’
మా నోళ్ళతో మేమూ నిన్ను కీర్తిస్తాము
స్తుతిస్తాము, సన్నుతిస్తాము..
ప్రతిరోజూ దసరా, సరదాగా, సంబరంగా చేసుకుని,
జాతరలు, బోనాలు, హోమాలు,
నిత్య కుంకుమార్చనలు, యజ్ఞయాగాదులు మరీ మరీ చేస్తాము.
నిన్ను తృప్తిపరిచేందుకు భగీరథ ప్రయత్నం చేస్తాము.
మరి మా మొర, మా వినతి, మా గోస, మా గోడు,
మా బాధ, మా క్షోభ ఓసారి చెవులారా వింటావు కదూ! చెప్పమ్మా!
ఒక్కసారి, మరొక్కసారి వస్తావు కదూ! చెప్పమ్మా!
నీవు నిశ్చల నిర్గుణ నిరాకార రూపానివి కానే కావని
ఈ లోకానికి మరోసారి చాటి చెప్పమ్మా!
‘ఓసారి బైటికి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగొస్తామనే’
నమ్మకం వమ్ము అయిపోతున్న ఈ దినాల్లో,
నీ ఈ పసిబిడ్డలను, దీన జనులను
‘చిరాయువై’ బతికి బట్టకట్టేలా చేయమ్మా
మా అమ్మా! మా తల్లీ! మా అమ్మోరు..
ఎంత వద్దనుకున్నా, ఎంత నిగ్రహించుకున్నా
మాలో పదే పదే ప్రజ్వరిల్లే
కామ, క్రోధాది అరిషడ్వర్గ వికృత రూపాలను
మరోసారి అదుపు చేయమ్మా..
నిక్కచ్చిగా నియంత్రించమ్మా..
జగన్నాయకీ, జగత్కారిణీ, దేవీ, శ్రీదేవీ..
శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ ఇక నీ ఇష్టం, మా ప్రాప్తం.
ఇది మా వంటి కవి కులం పక్షాన
సమాజ జాగృతానికి
కలం బలం ఏమాత్రమూ చాలకచేసే
సవినయ, సవిధేయ విజ్ఞాపన, అభ్యర్థన, ప్రార్థన..
ఎప్పుడో ఈ యుగాంతానికి కాదు.
మానవత్వం మరింత మంట గలవకముందే..
మాలో జవసత్త్వాలు, జీవకారుణాలు
పూర్తిగా బిక్కచచ్చిపోకముందే,
మా ప్రాణదీపాలు మరింత కొడి గట్టకముందే
నీవు ముందస్తుగా వచ్చి కాపాడు.
బుద్ధి జ్ఞానాలు, సిగ్గు శరాలు, దయ
జాలి, కరుణ, మానవత్వం అమితంగా ఉన్న నన్ను మాత్రం
మనిషి జన్మించనీయకు
కదంబమాల గానో, నీ కాలిమెట్టెగానో,
మరువంగానో, దవనంగానో
నిత్యం పూసే చందనంగానో
నీ మణిద్దీపానే నాకు రవ్వంత చోటివ్వు.
ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునే మరో సవినయ, సవిదేయ విజ్ఞాపన.
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకరప్రాణవల్లభే,
నీ మణిద్వీపంలో స్థాన ప్రాప్తర్థ్యం భిక్షాం దేహిచ పార్వతి.

-- దేశిరాజు లక్ష్మీనరసింహారావు 99858 44558