సబ్ ఫీచర్

పిల్లల చదువులో పెద్దల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదో తరగతి పరీక్షలు ముందున్నాయి. పిల్లలంతా పుస్తకాలు ముందేసుకుని తెగ కష్టపడుతున్నారు. అయినా బుర్రకెక్కదు. కారణం ఒత్తిడి. పరీక్షల ఒత్తిడి. ఈ సమయంలో పెద్దలు చొరవ తీసుకుని పిల్లలకు తోడుగా ఉండాలి. గతంతో పోలిస్తే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. కానీ సామాజిక మార్పులు, ఆలోచనావిధానం వంటి పలు మార్పుల కారణంగా ఇప్పటి తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో సమయంతో బాటు తగినంత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా నేటి పెద్దలూ మారాల్సిన సందర్భమిది. ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లల కంటే తల్లిదండ్రులు మరింత ఓర్పుగా, సహనంగా ఉండాలి.
గుర్తించాల్సినవి..
* పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించాలి. వారిపై ఇదే చదవాలి అనే ఒత్తిడి తేకూడదు.
* పరీక్షల సమయంలో చదువుకునేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. చేతివేళ్లలా ఏ ఇద్దరు పిల్లల గ్రహణ శక్తులూ ఒకేలా ఉండవనీ పెద్దలు గుర్తించి అనుసరించాలి.
* కష్టమైన సబ్జెక్టు పరీక్షలో తగినంత సాయం పెద్దలు చేయాల్సిందే.. అయితే అన్నింటా జోక్యం చేసుకోరాదు. దీనివల్ల పిల్లలు పెద్దలపై అతిగా ఆధారపడి వారు లేకుండా ఏ పనీ చేయలేకపోతారు.
* పిల్లలో వైఫల్యాలను ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్పిస్తూ ఉండాలి. ఓటమి అనేది విజయానికి ఒక మెట్టులాగా, విజయాన్ని సాధించడానికి కావాల్సిన సంకల్పబలం అందిస్తూ ప్రోత్సహించాలి.
* పరీక్షలు ముగిసన సమయం కూడా మరో పరీక్షకు ప్రారంభ సమయమని గుర్తించాలి. పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే విహారయాత్రకుగాని, లేదా పిల్లల కృషికి అభినందనీయంగా బహుమతులు అందించాలి. పరీక్షలలో పొందే మార్కులతో కాకుండా పిల్లలను పిల్లలుగానే గుర్తించాలి. పిల్లలపట్ల స్నేహపూర్వకంగా మెదులుతూ ఉండాలి.
* పిల్లలు చదువుకోవడానికి సౌకర్యవంతమైన తగు వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి. టీవీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ మొదలైన అంతరాయాలకు దూరంగా ఉండేవిధంగా చూసుకోవాలి. పిల్లలు సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు సరిగా లేకపోతే, పిల్లలకు మెడనొప్పి, తలనొప్పి లేదా వెనె్నముకనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూర్చుని చదువుకొనే స్టడీ ఛైర్ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేయాలి. సోఫా లేదా మంచాలపై చదవడానికి ప్రోత్సహించవద్దు. ఇలా చేస్తే కండరాలపై ఒత్తిడి కలిగి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది.
* పిల్లల చదువు విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను తల్లిదండ్రులు ఆశించక వాస్తవిక దృష్టితో వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల కోణం నుంచి ఆలోచించే ప్రయత్నం చేయాలి.
* పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోకజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయటం, కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లటం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది.
* తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను కలిసి పిల్లలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా పిల్లల విషయంలో వీరికున్న అపోహలు తొలగిపోతాయి.
* పిల్లలు చదువులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే తమ శక్తి సామర్థ్యాలపై పిల్లలకు మరింత గురి కుదురుతుంది. చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి కించబరచకూడదు. దీనికి బదులు సానుకూలమైన సలహాలివ్వటం, ప్రోత్సహించడం అవసరం.
* పరీక్షల సమయంలో కూడా పూర్తి సమయాన్ని చదువుకే కేటాయించాలనేం లేదు. కొంత సమయాన్ని ఆటలకో, రిలాక్సేషన్‌కో కేటాయించాలి. చదువుతో పాటు ఆటపాటలుంటేనే వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు కనుక పిల్లలు రోజూ కొంత సమయాన్ని ఆటలు, వ్యాయామం వంటివాటికి కేటాయించేలా చూడాలి.
* కంటిచూపు లోపాలు, బుద్ధిమాంద్యం వంటి జన్మతః వచ్చే కొన్ని సమస్యల కారణంగా పిల్లలు చదువులో వెనుకబడొచ్చు. ఇలాంటి సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయించాలి.
* పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్థమయ్యే భాషలో వివరించి వారిని సంతృప్తిపరచాలి తప్ప వారిని విసుక్కోరాదు. దీనివల్ల పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి.
* పిల్లలు ఒక సబ్జెక్టులో వెనుకబడటానికి కారణాలు అవగాహన చేసుకుని, ఇంట్లో బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా పెద్దలు శిక్షణనివ్వాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారు.