సబ్ ఫీచర్

పేరులోనే ఉన్నది పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు పేర్లు పెట్టడంలో చాలామంది ప్రత్యేకతను కనబరుస్తారు. కొన్ని ఇళ్లలో పిల్లల పేర్లు చాలా వైవిధ్యంతో ముచ్చటగా ఉంటాయి. కళాత్మక దృష్టి, మంచి అభిరుచి గల తల్లిదండ్రులు పిల్లలకు పేర్లను ఎంతో అందంగా అర్ధవంతంగా ఎంపిక చేస్తారు. పూర్వకాలంనుంచి వస్తున్న ఆచారం కుటుంబంలో తాతగారి పేరో, నాయనమ్మ పేరో పిల్లలకు పెట్టడం ఆధునిక కాలంలో తాతయ్యల, నాయనమ్మల పేర్లు పెట్టే ఆచారం చాలా చోట్ల లేదు. దానికి కారణం తాతయ్యల, నాయనమ్మల పేర్లు ప్రస్తుత సమాజంలో వున్న విద్యావంతులైన తల్లిదండ్రులకు నాగరికంగా అనిపించడంలేదు. బారసాల (నామకరణం) చేసే సమయంలో కుటుంబ సభ్యుల వత్తిడి, పట్టుదల కారణంగా తాతయ్యల, నాయనమ్మల పేర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలకు పెడుతున్నప్పటికీ వాళ్లకి నచ్చిన ఒక ఆధునిక, వ్యవహారిక నామం వాళ్లకి నచ్చేవిధంగా పిల్లల్ని పిలుచుకోవడానికి పెట్టుకుంటున్నారు.
కొన్ని ఇళ్లలో పిల్లలు పుట్టగానే పేర్లు నిర్ణయించడానికి చాలా పెద్ద చర్చలే చేస్తారు. బంధువులతో, స్నేహితులతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత పేర్లు నిర్ణయించడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కొందరైతే నెలల తరబడి అరుదైన అందమైన పేరు పిల్లలకు నిర్ణయించడం కోసం ఆలోచిస్తారు. మిత్రుల్ని, బంధువుల్ని మంచి పేర్లు సూచించమని అడుగుతుంటారు. చాలా ఇళ్లలో దేవుళ్ల పేర్లు పిల్లలకు వుండాలని నమ్మకం కలిగి ఉంటారు. కొందరు వాళ్లు కొలిచే ఇష్టదైవం పేరు తప్పనిసరిగా పిల్లలకు వుండాలని భావిస్తారు. కొందరైతే పిల్ల లు పుట్టకముందే పేర్లను నిర్ణయించేసుకుంటారు. అందుకే ‘ఆలూ సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అనే సామెత నానుడిలోకి వచ్చింది. పిల్లలకు దేవుడు పేర్లు పెట్టడం వలన పిల్లల్ని పిలిచేటప్పుడు దేవుని మాట పదిసార్లు పలికే వీలుంటుందని ఇళ్లలో పెద్దలు భావిస్తుంటారు. ‘కృష్ణ, శివ, లక్ష్మి, సరస్వతి..ఇలాంటి పేర్లతో పిల్లల్ని పిలుచుకుంటుంటే దేవుడ్ని తలచుకుంటున్నట్టుగా వుంటుందని చాలామంది భావిస్తుంటారు.
పిల్లల పేర్ల నిర్ణయం వెనుక ఎటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఇంట్లో తల్లిదండ్రులకు పెద్దలకు వున్నప్పటికీ పసిప్రాయంలో నామకరణం చేసేటప్పుడు పేర్లు అర్ధవంతంగా వుండేట్టు చూసుకోవాలి. ఏపేరు నిర్ణయించినా ఆ పేరుకి వుండే అర్ధాన్ని ముందుగా తెలుసుకోవాలి. ప్రత్యేకత కోసం ఈమద్య కొందరు ఎవరూ పెట్టకూడని పేరు తమ పిల్లలకు ఉండాలనే తాపత్రయం తో అర్ధంపర్ధం లేని పేర్లను పెట్టడం గమనిస్తున్నాం. శోణిత, క్లేశ, నిషా, అసుర్, మోహిత్, విరూప్, నిరక్ష...లాంటి పేర్లు వాటి అర్ధాలు తెలుసుకోకుండా పెడుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందూ మత ఆచారంగా నామకరణ మహోత్సవం (బారసాల) శిశు వు జనన తేదీకి 11వ దినమున గానీ, 21వ దినమునగానీ మూడవ, ఐదవ మాసములలో గానీ జరిపిస్తారు. ఏ నక్షత్రములో శిశు జననమైనదో ఆ నక్షత్రానికి వున్న నాలుగు పాదాలకు అన్వయించే అక్షరాల ప్రారంభంతో వచ్చే పేరుని పిల్లలకు పెట్టడాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారందరు చేస్తారు. పురోహితుని ద్వారా నక్షత్ర పాదాలకు నిర్ణయించబడిన అక్షరాలను తెలుసుకుని ఆ అక్షరంతో పేర్లను ఎంపిక చేసుకుంటారు. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అన్వయించబడతాయో పంచాంగంలో వివరంగా ఉంటుంది. నక్షత్రం ప్రకారం పేరు నిర్ణయించడమే కాక సంఖ్యాపరంగా కూడా అక్షర నియమాన్ని పాటించే పద్ధతి ఉన్నదని కొందరి జ్యోతిషవేత్తల మతం. తెలుగు భాష శబ్ద మాధుర్యానికి పెట్టింది పేరు. తెలుగులో ఏ మంచి పేరు ఎంపిక చేసుకున్నా అది ఎంతో మాధుర్యంగా ఉంటుంది.
మన ప్రాచీన కావ్యాల్లో పురాణ పాత్రలకు వుండే పేర్లు ఎంతోఅద్భుతంగా వుంటాయి. ఇతిహాసంగా కొనియాడబడే ఆది కావ్యమైన రామాయణంలో పురాణ పురుషుల పేర్లు, స్ర్తిలపేర్లు ఎంతో రమణీయంగా ఉంటాయి. భరత్, విభీషణ్, గౌతమ్, భరద్వాజ్, వేదవ్యాస్ లాంటి పేర్లు ఎప్పటికీ నిత్య నూతనం. కౌసల్య, సుమిత్ర, అహల్య, ఊర్మిళ, శృతకీర్తి లాంటి పేర్లు ఎంత అద్భుతంగా హృద్యంగా వుంటాయో చెప్పలేం. ఇటువంటి శ్రావ్యమైన పేర్లు పిల్లలకు పెడితే పిలుచుకోవడానికి ఆహ్లాదంగా వుండడమే కాక పురాణ పురుషులను గుర్తు చేసుకున్నట్టు వుంటుంది.తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా పిల్లలకు మంచి పేర్లను నిర్ణయించడం వల్ల వాళ్ల జీవితాల్లో మంచి జరిగే అవకాశం తప్పక ఉంటుంది.

‘పేరులోనే ఉన్నది పెన్నిధి’ అన్న నానుడిని బట్టి పేరు బలాన్ని బట్టి జీవితం సాగుతుందని విశ్వసించేవారి సంఖ్య అధికం. పెన్నిధి అంటే ఆదుకునే దైవం అని అర్ధం. అందుకే పిల్లలకు పేర్లు పెట్టడానికి హిందూ ఆచారంలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు అందరి ఆశీస్సులు వుండాలని నామకరణ మహోత్సవానికి ఆప్తుల్ని, బంధువుల్ని పిలిచి వారి సమక్షంలో వేద మంత్రాల ఆశీర్వాదంతో పిల్లలకు పేర్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం పిల్లలకు మంచి పేర్లు ఎంపిక చేసుకోడానికి ‘ముద్దులొలికే పిల్లలకు ముచ్చటైన పేర్లు’, ‘నక్షత్ర రీత్యా చుక్కల్లాంటి పిల్లలకు చక్కని పేర్లు’ లాంటి పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

- రాజ్‌కుమార్