సబ్ ఫీచర్

అనాథ పిల్లలకు అమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యం భారమైపోతుందని భావిస్తున్న ఈ తరుణంలో అనాథ పిల్లలకు అమ్మ అయంది. చిన్నప్పుడు తండ్రి చెప్పిన జీవిత పాఠాలను సోపానాలుగా చేసుకుని సేవా మార్గంలోకి అడుగుపెట్టంది. ఆమే హర్షవల్లి.
విశాఖపట్నంలోని కొండుగారి హర్షవల్లి. కనీస సౌకర్యాలకు నోచుకోని విజయనగరం జిల్లా, బాడంగి మండలం పాల్తేరు అనే పల్లెలో జన్మించారు. ఆ గ్రామంలో ఉపాధ్యాయుడిగా ఉన్న ఈమె తండ్రి కొత్తకోట హనుమోజీరావు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. తెలుగుభాషపై ఆయనకు ఎంతో మమకారం. తల్లి కృష్ణవేణికి కూడా సంగీత, సాహిత్యాభిలాష ఉన్నది. ఇరువురి మార్గాలైన సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, సేవల వైపు తన దృష్టి మళ్ళించింది.
నిజానికి ఈమె కళాకారిణి. పాటలు పాడుతుంది. రచయిత కూడా. శ్రీశ్రీ సాయి సరిగమప అనే భక్తి, లలిత, జానపద, సినీ, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థకు స్థాపకురాలు. గృహిణిగా ఇద్దరి పిల్లల బాగుగోలు చూస్తునే సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపన ఆమెలో నిండివుంది. అందమైన, ఆనందాన్నిచ్చే తీగ వలే తన సేవా పయనానికి గమ్యం లేదంటోందామె. హర్షవల్లి అనాథ పిల్లలనే కాదు... నిత్యం పుస్తకాలు, సెల్‌ఫోన్‌లతో కాలాన్ని గడుపుతున్న బాలలను పండగ సెలవుల్లో ఒకచోటకు చేర్చి, భారతీయ కళలను పరిచయం చేస్తుంది. అంతేకాదండోయ్.. ‘చూడండి.. చెయ్యండి’ అని పిలుపునిచ్చి ఉచిత హస్తకళా శిక్షణలను కూడా ఏర్పాటు చేస్తుంది. డ్రాయింగ్స్, పెయింటిగ్స్, దేశభక్తి గీతాలు, కథలు నేర్పి, వారిలో నిబిడీకృతమైన నైపుణ్యాలను వెలికితీస్తూ వారి తల్లిదండ్రులచేత శభాష్ అనిపించుకుంటోంది. మరుగున పడిపోతున్న ప్రతిభావంతులను గుర్తించి, ప్రోత్సహిస్తుంది ఈ కళా సంస్థ. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ‘స్వచ్ఛతే సేవ’ వంటివాటిల్లో భాగంగా వ్యర్థాలతో ఉన్న దేవాలయాల పరిసరాలను పరిశుభ్రం చేయడం, మత సామరస్యాలను పెంపొందించేందుకు తరచూ అన్నదానాలు, వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం, భక్తి పెంచే నిమిత్తం ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని అడ్డుకునే నిమిత్తం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోంది. అనాథలు, నిరాదరణకు గురైన దివ్యాంగులు, వృద్ధులను చేరదీసి, తన అమృతస్పర్శతో కొత్త జీవితాన్ని అందిస్తోందామె. పాఠశాలల పిల్లల బాగోగుల కోసం నక్కవానిపాలెం, మధురానగర్ జివిఎంసి పాథమిక పాఠశాలలను హర్షవల్లి దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. హుద్‌హుద్ వంటి ప్రకృతి బీభత్సాలు సంభవించినప్పుడు తన వంతుగా కళాసంస్థ సభ్యులతో కలిసి ప్రజలకు సాయం అందిస్తున్నారు. ‘సేవ అనేది అనంతమైనది. సంకల్ప బలం ఉండాలే గానీ, ఆయుష్షు ఉన్నంత వరకు సేవ చేయొచ్చు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, భావిభారత పౌరులైన పిల్లలను ఉత్తమ అభిరుచుల వైపు నడిపించాలి. అప్పుడే వారి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. దేశం లోకానికి ఆదర్శంగా రూపొందుతుంది’ అంటుందామె. మద్య, ధూమపానం వంటి మహమ్మారిలపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసినట్టు హర్షవల్లి తెలిపారు. అలాగే, పర్యావరణానికి హాని తలపెట్టే ప్లాస్టిక్ వినియోగం, దోమల నివారణకు ఇంట్లో, పరిసరాల్లో పరిశుభ్రతపై, బాలబాలికల మానసిక పరివర్తనపై మున్ముందు మేధావులతో ఆయా విద్యాలయాల్లో ప్రసంగాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారామె. ఆమె సేవా కార్యక్రమాలు కలకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుందాం!

చిత్రం..హర్షవల్లి

- గున్న కృష్ణమూర్తి