సబ్ ఫీచర్

కుట్టు కళతో కనికట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన శయన భంగిమలో దుష్యంతునికి ప్రేమలేఖ రాస్తున్న సోయగాల శకుంతల.. కృష్ణుడి బాహువుల్లో వయ్యారంగా ఒదిగిపోతున్న రాధమ్మ.. ఉమర్‌ఖయాం ఒడిలో పరవశించిపోతున్న ప్రియసఖి సాఖి.. శంఖం పూరిస్తున్న శివుని చెంత సగభాగమై నిలిచిన చక్కదనాల సతి.. అందమైన పూలచెట్లపై తన తోడుని చూస్తూ పురివిప్పిన మయూరం.. సిగ్గుల మొగ్గగా పెళ్లి పల్లకిలో ఊరేగుతున్న రాజకుమారి.. రాజు వెడలె రవితేజము లలరగ అన్నట్లు రాజసంగా పురవీధుల్లో సాగిపోతున్న ఏనుగు అంబారీ.. రెక్కలు బారచాచి చెట్టుకొమ్మపై అలవోకగా వాలుతున్న భారీ విహంగం.. ఇవన్నీ ఏమిటంటారా? ఆరుపదులు పైబడిన వయసులో ఓ కళాకారుని చేతిలో అందంగా రూపుదిద్దుకున్న కళాచిత్రాలు. మరుగున పడిన చిన్ననాటి అభిరుచిని మలి వయసులో మననం చేసుకుని కుట్టుకళతో కనికట్టుచేసి ఆకట్టుకునేలా చేసిన ఘనత ఆయనది. ఆ ప్రత్యేకతను గురించి చెప్పకోవాలంటే...
ఆకారం, ఆహార్యంలోనే కాదు కొన్ని పనులు, కొన్ని కళలు కూడా ఇవి మగవి, ఇవి ఆడవి అనే భావనలను మన మనసుల్లో గుడుకట్టుకుపోయాయి. ఇందుకు భిన్నంగా కనబడినప్పుడు మనకు కొంత ఆశ్చర్యం కలగడం సహజం. అలాంటి అనుభూతే ఎనిమిది పదులు దాటిన కన్నారావును చూస్తే కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఈయన చేతితో కుట్టిన బొమ్మలు ప్రతి ఒక్కర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న శకుంతల చిత్రపటం గోడకు వేళాడుతుంటే పెయింటింగ్‌లా కనబడుతోంది. చేతికుట్టుతో అల్లిన బొమ్మలా అనిపించదు. అంతలా ఆకట్టుకుంటుంది. వాస్తవానికి చేతికుట్లు, అల్లికలతో చేసిన బొమ్మలు గానీ, చిత్రాలు గానీ ఎవరి ఇంట్లో కనబడినా అవి ఆ ఇంటి ఆడవాళ్లలో ఎవరో ఒకరు చేసి వుంటారని అనుకుంటాం. చాలావరకు అది నిజం కూడా! చేతికుట్టు అంటే చాలా ఓపికగా ఇంటిపట్టున ఉండి చేసే పని కావడంతో ఆడవాళ్లే చేయడం చూస్తాం. అలాంటిది ఓ వృద్ధుడు చేతికుట్టుతో ఎన్నో కళారూపాలను అందంగా తీర్చిదిద్దుతున్నారంటే ఆయనలో దాగివున్న కళానైపుణ్యం అబ్బురపరుస్తోంది. ‘అతివలకే పరిమితం అనుకున్న ఆ కళలో ఆయనకు అభిరుచి చిన్నతనంలో కలిగింది. ఆయన అక్కయ్యలు కుడుతుండగా చూసి నేర్చుకున్నారట.
ఈ చిత్రాలన్నింటినీ కాడ, గొలుసు కుట్టుతో కుట్టినవే. దాదాపు 30 ఏళ్లపాటు కుటుంబ బాధ్యతలతో తలమునకలైన ఆయన ఈ కళ పట్ల ఉండే తృష్ణను చంపుకోలేకపోయారు. 60 ఏళ్లు దాటి పిల్లలకు బాధ్యతలు అప్పగించాక మళ్లీ తనలోని కళకు పదును పెట్టానని, ఆ తర్వాత వరసగా అనేక చిత్రాలను కుట్టి ఎందరికో బహుమతిగా కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఎంతో ఆకర్షణీయంగా వున్న ఆ కళారూపాలను చూసి అనేకమంది వాటితో ఓ ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చు కదా! అని సలహా కూడా ఇచ్చారట. కానీ అలా చేయలేకపోయానన్నారు. వాటి అల్లికకు ఆయన ఎంచుకున్న దారాల రంగుల ఎంపిక కూడా వాటికి అదనపు అందాన్ని తెచ్చింది. ముదిమి వయసులో అలా ఆయన ఇంట్లో కుట్లు, అల్లికల్లో నిమగ్నమైనా.. కుటుంబ సభ్యులు విసుక్కోకుండా సహకరించేవారని, ప్రోత్సహించేవారని మురిపెంగా చెబుతారు. ఏదిఏమైనా కళాభిరుచి వుండాలే గానీ దానికి లింగభేదం గానీ, వయోభారం గానీ అడ్డంకులు కాబోవని భేషుగ్గా నిరూపించారు కన్నారావు.

- డి. స్వాతి