సబ్ ఫీచర్

గొల్ల రామవ్వ కథలో పి.వి(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గామీణ జీవన నేపథ్యంలో జన్మించి స్వయంకృషితో నీతి, నిజాయితీ, నిబద్ధతలే ఆలంబనగా, చరిత్రలో భారత ప్రధానిగా తనదైన విశిష్ట ముద్రను వేసుకున్న మహోన్నత వ్యక్తి పి.వి.నరసింహారావు. తన అసాధారణ మేధస్సుతోనూ, రాజనీతిజ్ఞతతోనూ ప్రపంచ దేశాల సేవలను నివ్వెరపరచిన పి.వి. అత్యున్నతమైన రాజకీయ జీవితమే కాకుండా ఉత్కృష్టమైన సాహితీ జీవనాన్ని మనసుతీర ఆరాధించి దప్పితీర ఆస్వాదించిన పుంభావ సరస్వతీపుత్రుడు, బహుభాషా కోవిదుడు, పండితుడు, రచయిత - వెరసి సారస్వత, సాంస్కృతీ సంపదల ప్రోవు - పి.వి.
ప్రపంచ సాహిత్య వినువీధులలో విహరించిన పి.వి. అంతటితో ఆగలేదు. నిరంతర కృషితో తనదైన మూర్తిని మలుచుకొన్నారు. ‘సహస్రఫణ్’ (విశ్వనాథ వారి ‘వేయి పడగలు’కు హిందీ అనువాదం), అబల జీవితం (హరినారాయణ ఆప్టే ‘్ఫణ్ లక్షతాకోన్ ఘే తో’ (మరాఠీ నవలకు తెలుగు అనువాదం), థామస్ గ్రే ఎలిజీకు తెలుగు అనువాదం, భారత సంవిధానం (రాజ్యాంగానికి తెలుగు అనువాదం) పి.వి. భారతీయ భాషా రచనలు.
‘ద బ్లూ సిల్క్ శారీ’ (నాటిక), ‘ద ఇన్‌సైడర్’ (రాజకీయ నవల), ‘ద రిషడ్రల్ (నాటిక) ఆయన కలం నుండి జాలువారిన ఆంగ్ల రచనలు. ఇవేకాక దేశ, విదేశ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై ఎత్తిన కలం దించకుండా ఆంగ్లంలోనూ, ఇతర భాషలలోనూ పి.వి. వ్రాసిన వ్యాసాలు ఆయన భావ, భాషా పటిమలకు నిలువుటద్దాలు. 1948-1955ల మధ్య కాలంలో పి.వి., పాములపర్తి సదాశివరావుతో కలసి తెలుగులో ఒక వారపత్రిక నడిపారు. ఓరుగల్లు నుండి వచ్చిన ఈ పత్రికే ‘కాకతీయ’. ఈ పత్రికలో పి.వి. ‘విజయ’ అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశారు. కాకతీయ పత్రిక ఆరంభించిన నాటికి పి.వి. 27 సంవత్సరాల యువకుడు. నిర్దిష్ట, ప్రగతిశీల రాజకీయ భావాలు ప్రతిబింబిస్తున్న కార్యశీలి. రామానందతీర్థ అనుయాయి, ప్రియశిష్యుడు. నిజాం వ్యతిరేక పోరాట యోధునిగా రూపుదిద్దుకున్నాడు.
గొల్ల రామవ్వ కథ
పి.వి. రచనలలో ‘గొల్ల రామవ్వ’ కథ ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. ‘విజయ’ కలం పేరుతో ఈ కథను 1949 ఆగస్టు 5న కాకతీయ పత్రికలో వ్రాసారు. ‘‘్ఢం.. ఢీం.. ఢీం..’’ బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైంది’’ అన్న వాక్య ఎత్తుగడలో కథను ప్రారంభించారు. పి.వి, కథాకాలం నాటి తెలంగాణ రాజకీయ, సామాజిక ఛిద్ర వ్యవస్థను సూచిస్తూ రెండు నిమిషాల్లో చెలరేగిన
ఆ అలజడిని రచయిత ‘ఏదో మహా భయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా ఊరివారందరూ నిద్ర నుండి త్రుళ్లి పడిలేచినట్లు, అదొక విచిత్ర ప్రళయం, మృత్యు తాండవం’ అని ఆ భయానక పరిస్థితులను వివరిస్తూ కథాగమనంలోకి సాగారు. కథనాయిక గొల్ల రామవ్వ. తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె డెబ్బయి ఏళ్ల పైబడిన ముదుసలి. ఆమెతోపాటు ఆమె మనుమరాలు మల్లి. పదిహేనేండ్ల బాలిక. హఠాత్తుగా ఆ గుడిసె కిటికీ అనబడే రంధ్రం నుండి ఒక వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. మల్లి భయకంపితమైంది. మల్లికి మానభంగం తప్పదేమోనని అవ్వ కన్నీరు నింపుతూ నిలిచిపోయింది. ఇంతలో ఆ వ్యక్తి ముసలవ్వ చెవిలో.. ‘‘చప్పుడు చేయకు. నేను దొంగను కాను. రజాకార్ను కాను. పోలీసును కాను. మిమ్మల్నేమీ అనను. లొల్లి మాత్రం చేయకండి’’ అని గుసగుసలాడాడు.
ప్రాణ, మాన భీతితో ఆ వ్యక్తి కాళ్లు పట్టుకున్న రామవ్వ మెలమెల్లగా లేస్తూ అతని శరీరాన్ని తడిమింది. అంతే. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంది. గాయాలతోనూ, రక్తంతోనూ కూడిన శరీరంతో, నిస్సహాయ
స్థితిలో వున్న ఆ యువకుడి ప్రాణరక్షణ తన కర్తవ్యంగా భావించింది. ఆమెలో నిబిడీకృతమైన మాతృప్రేమ పెల్లుబికింది. మృత్యువుతో పోరాడుతున్న ఆ యువకునికి శుశ్రూష చేయించి, సేదతీర్చి, సల్ల తాగించి బ్రతికించింది.
ప్రేమతో ఆ యువకుడి దేహాన్ని నిమురుతున్న అవ్వకు రివాల్వర్ తగిలింది. ‘‘ఎందుక్కొడుకో తూపాకీ! మమ్మల్ని గిట్ల చంపుదామనుకొన్నావా యేంది?’’ అన్న ప్రశ్నకు యువకుని సమాధానం - ‘‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్లను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసుల్నే...’’
అవ్వ మొహంలో ఉత్సాహం ఆమె పెదవులు కదిల్చింది. ‘‘ఇద్దరా?? కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా? సగం పనే చేసినావు’’ ఆమె హృదయ సీమనుండి వెలువడిన ఈ మాటలు యువకునిలో ఉద్వేగం కలిగించాయి. రివాల్వర్ కొరకు చేయి చాస్తూ ‘‘తక్కిన వాళ్లను కూడా చూచుకొస్తాలే అవ్వా’’ అని పలికిన ఆ యువకుడిని సున్నితంగా, ప్రేమతో నిర్దపట్టితే బతుకుతావని మందలించింది, ఆజ్ఞాపించింది. తాను, మల్లి కాపలాకాస్తుంటే ఆ యువకుడు సుఖనిద్ర పోయాడు.
పాలు పిండే వేళ పోలీసుల దమనకాండ. ఆ రాక్షసులను ఎదిరించేందుకు సిద్ధమైన ఆ వీర యువకుడిని చేయిపట్టుకొని వెనక్కులాగింది. యువకుడిని ముందుకు పోనివ్వలేదు. ఇల్లు సోదాకు భయపడలేదు. అపాయానికి వెరవలేదు. తన మనవరాలిని ఆ యువకుడి పక్కన పడుకోబెట్టింది. పోలీసులను తన అమాయక మాటలు చేతనూ, చేతల చేతనూ నమ్మించింది. జమాదారుని బయటకు పంపించింది. యువకుడి ప్రాణాలను రక్షించింది.
‘‘అవ్వా! నీవు సామాన్యురాలివి గావు. సాక్షాత్ భరతమాతవే!’’ అన్న యువకుడి మాటలకు పొంగిపోకుండా, నిగర్వంతో ‘‘తొడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావు?... నా పేరు గొల్మ రామి! గంతే.. ఇగ నువ్వెల్లు..’’ అని అతడిని ఆజ్ఞాపించింది. క్లుప్తంగా ఇది రామవ్వ కథ.
కథానాయిక గొల్ల రావమ్మను పి.వి. చిత్రీకరించిన శైలి అద్భుతం. ఒక పక్క అమాయకత్వం, మరొకపక్క గడుసరితనం, ఈ రెండు గుణాలను సమయస్ఫూర్తితోనూ, చాకచక్యంతోనూ ప్రదర్శిస్తూ నాటకీయంగా విషమ పరిస్థితులను అధిగమించిన నేర్పరిగానూ, సహజమైన ప్రేమ, ఆప్యాయతలు హృదయమంతా నింపుకున్న భారతీయ స్ర్తిగాను, అవసరం వస్తే తెగువరితనం చూపించగల ధీరవనితగానూ గొల్ల రావమ్మను తీర్చిదిద్దారు పి.వి. అదే పోతలో నైజాం దురంతాలను ఎదుర్కొనడానికి, తన ప్రాణాలనే పణంగా పెట్టిన పేరు పెట్టని ఆ యువసాహసి, నూనూగు మీసాల ‘కొంటె పోరడిని’ - అవ్వభాషలో రచయిత ధీర చిత్తునిగా తీర్చిదిద్దారు. ఇక మల్లి.. కథలో మూడవ పాత్ర. భయాందోళనలతో, కల్లోలిత మనస్కురాలైన ఆ బాలిక అవ్వ చెప్పినట్లు ఆ ఆగంతక యువకునికి శుశ్రూష చేసి తన కర్తవ్యాన్ని నిర్వహించింది.
రాజకీయ, సామాజిక సంక్షోభంలో అతలాకుతలమైన ఆనాటి తెలంగాణ, భూమికగా పి.వి. ఈ కథను రచించారు. అర్ధరాత్రి నుంచి ప్రొద్దెక్కు కాలం వరకు - దాదాపు రెండు జాముల కాలంలో కథను ఉత్కంఠ భరితంగా, కన్నులకు కట్టినట్లు తీర్చిదిద్దిన తీరు అనిర్వచనీయం. రావమ్మ నోటినుండి వచ్చిన పదంలోనూ తెలంగాణ మాండలిక పటుత్వం ద్యోతకమవుతోంది. పాత్ర నిర్మాణంలో పి.వి. తనదైన ఒరవడి చూపారు. కథాగమనాన్ని కదం తొక్కించిన తీరు పి.వి.కే చెల్లింది. గొల్ల రామవ్వ కథ పి.వి. రచనా పాటవానికి మచ్చు తునక.

- యర్రమిల్లి ప్రభాకరరావు, 9985291014