సబ్ ఫీచర్

ఆరోగ్యమే మహాభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమంతా అమితంగా ఇష్టపడే అష్టయశ్వరాలలో- అన్నిటికన్నా అమూల్యమైనది ‘ఆరోగ్య భాగ్య’మనే ఐశ్వర్యమంటే అతిశయోక్తి కాదేమో! అదే నిజం కూడా! కానీ మానవుల ‘జిహ్వ’ చాపల్యం అటువంటి అమూల్యమైన ఐశ్వర్యాన్ని మనకి అందకుండా చేస్తుంది. ఆరోగ్యంగా వుండడానికి ‘ఆహారం’ ఎంత ముఖ్యమో- అదే ‘ఆరోగ్యం’ పాడయిపోవడానికి దోహదపడేది కూడా అసంతులిత ఆహారమే! మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు- తదితర పోషకాల గురించి సరి అయిన అవగాహనతో ఆహార పదార్థాల సేవనం సమతౌల్యంగా అందించ గలిగితే ఆరోగ్య మహాభాగ్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదు.
‘మితాహారం-అతి సంతోషం’ అనే విషయం మనందరికీ సువిదితము- సుపరిచితమూ అయినా- అమితమైన ఆహారాన్ని స్వీకరించడం ఓ అలవాటు లాంటి హాబీగా మార్చుకుంటున్న మనం- ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండగలం? అలా అమితంగా భుజిస్తున్న ఆహారమంతా మన స్థూల కాయానికి మూల కారణమవుతున్నదన్న మాట సత్యదూరం కాదు! కనుక వేళా-పాళా లేని ఆహారపు అలవాట్లు, నియమ-నియంత్రణ ఎరుగని అనాలోచిత ఆహార పొరపాట్లు- వెరసి మన ఆరోగ్యం మన చేతుల్లోనూ, చేతల్లోనూ లేక చేదాటిపోతోంది.
ఇక ఆహారపదార్థాల ‘ఎంపిక’ అతి ముఖ్యమైన అంశం. ఆహారంతో ఆరోగ్యం పొందామనుకుంటే ఏదీ అతిగా తినకపోవడం ఓ ఎన్నదగిన విషయం కాగా- ఆహార పదార్థాల్లో కొన్నింటిని ‘నచ్చలేదన్న’ వంకతో విసర్జించటం కూడా మంచి పద్ధతి కాదు. సృష్టిలో మనకు లభ్యమయ్యే ఆహార పదార్థాలన్నింటిలోనూ వాతావరణ మార్పులకు అనుగుణమైన పోషక విలువలుంటాయి. ఆయా వాతావరణాలకు అనుగుణంగా వాటిని ఇష్టమున్నా లేక పోయినా భుజించడం తప్పని సరి! అప్పుడే శారీరక ఆరోగ్యం సమతౌల్యంగా సమకూరుతుంది. ఉదాహరణకు కొన్నివేల సంవత్సరాల చరిత్ర కలిగిన ‘అవిశలు’ ఈ తరం వాళ్లకు చూడని, కనీసం ఆ మాట కూడా వినని తృణధాన్యాలుగా అంతర్థానమవడం అసత్యం కాదు కదా! కానీ వాస్తవానికి ‘అవిశగింజలు’ తినడం వలన- మన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసి- గుండెకు సరి అయిన రక్తప్రసరణ కలుగుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలకు సుప్రసిద్ధమైన ఈ అవిసెగింజలు హార్మోన్ల సమతౌల్యతకు సహాయపడి ‘కేన్సర్’ నిరోధకంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచులో 1/3 వంతు పీచు పదార్థం కలిగి అత్యధిక శాతం మాంసకృత్తులతో నిండి శారీరక దారుఢ్యాన్ని పెంచుతుంది. సంతాన లేమిని అరికట్టే అత్యద్భుత ఔషధం కూడా ఈ అవిసెగింజలే! మరి ఈనాడు వాటి వాడకం ఎంత గణనీయంగా తగ్గిపోయిందో మనందరికీ తెలుసు. ఇలా మరుగున పడి పోతున్న అనేకానేక పోషక విలువల్ని- ఏ ఫాస్ట్ఫుడ్ సెంటర్లూ భర్తీ చేయలేవు సరికదా, మనల్ని అనారోగ్యం పాలు చేయడంలో సహాయ పడతాయి! తెలిసి తప్పు చేయడం- తెలియక తప్పు చేయడం కంటే ప్రమాదకరమని, ఈ తరం ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతోంది! వ్యసనమొక నాగరిక లక్షణమని భావిస్తున్న మనం- ప్రకటనల్లో వెలువడుతున్న హెచ్చరికలైన ‘హానికరం’ అనే మాటను నిర్లక్ష్యం చేస్తూ వ్యసనాలబారిన పడడం కూడా అనారోగ్యానికి మరో మూలహేతువు. ఇది కూడా మనందరం తెలిసి చేస్తున్న తప్పే! తప్పనిసరి తప్పులుగా మిగిలిన ఈ వ్యసనాలకు పర్యవసానమే మన నేటి అనారోగ్యకర జీవనం! ఆరోగ్యం పొందాలంటే వ్యవసనాలకు దూరం కావాలి! మనందరికీ తెలిసిన విషయం- శరీరానికి తగినంత ఐరన్ కావాలని! అది లోపిస్తే రక్తలేమి, తదుపరి అనేక శారీరక రుగ్మతలు సంభవిస్తాయి- సమస్యలు తలెత్తుతాయి. కనుక తగినంత ఐరన్ అందే విదంగా ఆహార నియమాలు పాటించాలి. ఐరన్ ధాతువుకు నిలయాలైన చిక్కుడు, బీట్‌రూట్, ముడి బియ్యం వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుని- శరీరం గరిష్టంగా ఐరన్ స్వీకరించాలంటే విటమిన్-సి తగినంత అవసరమన్న సంగతి తెలుసుకుని- మన ఆహారంలో బత్తాయి-నిమ్మ-ఉసిరి వంటివి తగిన మోతాదులో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాక- కాఫీ, బ్లాక్ టీలు ఎక్కువగా తాగేవారికి ఐరన్ సరిగ్గా వంట బట్టదన్న నిజం గ్రహించాలి. ఐరన్ లోపం వలన అంటు వ్యాధులు పెరుగుతాయి. అలసట కలుగుతుంది.
పని సామర్ధ్యంలో చురుకుదనం లోపిస్తుంది. ఇవన్నీ శాస్ర్తియపరమైన వాస్తవాలు! ఇవి తెలుసుకోవడం మనందరి కనీస కర్తవ్యం! చివరిగా ‘పెరుగు’ ఇది నిజంగా దేవుడిచ్చిన వరం. ఇందులో 13 గ్రాముల మాంసకృత్తులు- 450 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తాయి. పాల నుంచి వచ్చిన ఈ పెరుగులో మానవ శరీరానికి మంచి చేసే బాక్టీరియా లభిస్తుంది. ఈ ప్రొబయోటిక్స్ వలన అరుగుదల 60 శాతం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. ఆచరణ ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని మన సొంతం చేసుకుందాం. నిండు నూరేళ్లు రోగ రహితంగా జీవిద్దాం! సరేనా!

-మరువాడ భానుమూర్తి