రాష్ట్రీయం

టిక్కెట్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ మినహా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, బిజెపిల్లో ఆగ్రహాజ్వాలలు రగిల్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో పార్టీ కార్యాలయాలు అట్టుడుకాయి. టిక్కెట్లు రాని ఆశావాహులు ఆందోళనలకు దిగి నేతలపై కనె్నర్ర చేశారు.
టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు డూప్లికేట్ బి-్ఫరం ఇచ్చారని ఒక మహిళా కార్యకర్త రోజంతా ధర్నా చేయగా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం లేదని ఒక మహిళా కార్యకర్త పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అంతటా గొడవలే..
గురువారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 150 డివిజన్లకు 2713 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 1214 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టిఆర్‌ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా, మజ్లిస్ పార్టీ 70 స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ పార్టీల నుంచి కూడా కొంత మంది రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేసినా, అందరికీ ఫోన్లు చేసి విరమింపజేశారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి నాయకులకు మాత్రం జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి పోటీ చేయించడం గగనమైపోయింది.
కెప్టెన్ ఉత్తమ్ ఎక్కడా?
ఇలాఉండగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం లేదని కార్యకర్త పార్వతి బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లంగర్‌హౌస్‌కు చెందిన శోభారాణి తనకు డూప్లికేట్ బి-్ఫరం ఇచ్చారని ధర్నాకు దిగారు. ఫలక్‌నుమాలో తన పేరును ప్రకటించి రుక్మిణికి టిక్కెట్ ఇచ్చారని కమలానాయక్ ఆందోళనకు దిగారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్కను నిలదీశారు. టిక్కెట్లు రాని వారు ఆందోళనలకు దిగడంతో పోలీసులు గాంధీ భవన్‌లోని రెండు గేట్లను కొంత సేపు మూసి ఉంచారు.
బెడిసిన మైత్రీబంధం..!
టిడిపి-బిజెపిల మధ్య అనేక డివిజన్లలో సమస్య తలెత్తింది. ఇరు పార్టీల ముఖ్య నాయకులు వారం రోజులుగా చర్చలు జరిపినా, కొన్ని డివిజన్లలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిపిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చిలుకానగర్, హబ్సిగుడా, ఉప్పల్, మాదాపూర్, బోరబండ, ఆర్‌కె పురం తదితర 10 డివిజన్లలో రెండు పార్టీలూ బి-్ఫరాలు ఇచ్చాయి. 10 డివిజన్లలో స్నేహపూర్వక పోటీ చేయాలని నిర్ణయించాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి బి-్ఫరం తీసుకున్న మాదాపూర్ అభ్యర్థి గరికపాటి సతీష్ చిక్కుల్లో పడ్డారు. బి-్ఫరం తీసుకుని ఆవరణలోకి రాగానే గేటు దాటకుండా ఆ టిక్కెట్ ఆశించిన హరికృష్ణ తన అనుచరులతో అడ్డుపడ్డారు. సుమారు గంటన్నర పాటు సతీష్‌ను బయటకు వెళ్ళనీయకుండా నినాదాలు చేశారు. బి-్ఫరం ఇచ్చేయ్యాల్సిందిగా బతిమిలాడారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, సతీష్‌ను బయటకు పంపించారు. ఈ దశలో పోలీసులకు హరికృష్ణ అనుచరులకు మధ్య కొంత తోపులాట జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్‌ను ఆశించిన తృప్తి సుధాకర్ బి-్ఫరం కోసం గంటల తరబడి వేచి చూసి తర్వాత నిరాశగా వెళ్ళిపోయారు. ఆ డివిజన్ టిడిపి తీసుకోవడ పట్ల రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. ఇలాఉండగా పార్టీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ నివాసం వద్ద చర్లపల్లి డివిజన్ కార్యకర్తలు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు.
ఇలాఉండగా బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేశారు. టిడిపితో పొత్తు వద్దని తాము చెప్పినా వినిపించుకోలేదని, పొత్తు పెట్టుకుంటే టిడిపి కంటే ఎక్కువ సీట్లు తీసుకోవాలని సూచించినా వినిపించుకోలేదని అందుకే రాజీనామా చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బిజెపి రంగారెడ్డి జిల్లా పట్టణ అధ్యక్షుడు మీసం చంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. జిల్లాలోని డివిజన్లకు టిడిపితో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను సంప్రదించనందుకు నిరసనగా రాజీనామా చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిథిలో 63 డివిజన్లు ఉంటే బిజెపి కేవలం 13 మాత్రమే తీసుకున్నదని ఆయన చెప్పారు.
ఎన్నికల అధికారికి టిడిపి జాబితా..
మరోవైపు మిత్రపక్షమైన బిజెపికి కేటాయించిన డివిజన్లలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. వారిని పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్యాలెట్ పేరులో తమ పార్టీ కార్యకర్తల పేర్లు స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చినా, వారు ప్రచారం చేయకుండా, బిజెపికి మద్దతుగా ప్రచారం చేయిస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇలాఉండగా టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మీడియాతో మాట్లాడుతూ తాము 92 మందికి మాత్రమే బి-్ఫరాలు ఇచ్చామని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారికి అందజేశామని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎంబిటి మాజీ కార్పోరేటర్ అంజదుల్లాఖాన్ అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి, ఆయన సతీమణి ఆజంపురా డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 27 డివిజన్లకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించినట్లు ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఇక లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఈ ఎన్నికల్లో 30 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో వివిధ పార్టీల్లో టిక్కెట్లు రాని కొంత మంది ఆశావాహులు ఉన్నారు. సిపిఐ-15, సిపిఎం-22 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. ఇలాఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.