రాష్ట్రీయం

తాత్కాలిక సచివాలయానికి రూట్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి ఒకటి రెండురోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10 వ తేదీన శంకుస్థాపన చేయాలని ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, భవనాల నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థలతో ఆర్థిక ఒప్పందం కుదరకపోవడంతో శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడ్డది. దాదాపు ఆరులక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టి) విస్తీర్ణంలో నిర్మించబోయే ఆరు భవనాల కోసం ఆర్థిక లావాదేవీలు ఆదివారం ఖరారయ్యాయని తెలిసింది. మొత్తం మూడు ప్యాకేజీల కింద ఆరుభవనాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం తరఫున మున్సిపల్ వ్యవహారాల మంత్రి డాక్టర్ పి. నారాయణ నేతృత్వంలోని అధికార బృందంతో ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థల ప్రతినిధులు గత రెండు రోజుల నుండి జరుపుతున్న చర్చలు ఆదివారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఒక చదరపు అడుగుకు 3350 రూపాయలు చెల్లించేవిధంగా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. చదరపుఅడుగుకు 4000 రూపాయలుగా ఒక సంస్థ, 4200 రూపాయలుగా మరో సంస్థ తమ ఆర్థిక పత్రాల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం మాత్రం 3000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని మొదట భావించింది. చర్చల సందర్భంగా రెండు సంస్థలు కూడా చదరపు అడుగుకు 3350 రూపాయలకు అంగీకరించాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకారం తెలిపిందని తెలిసింది. భవనాల నిర్మాణ కోసం అంగీకారం కుదరడంతో ఒకటి రెండు రోజుల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఆరుభవనాలు ఉంటాయి. సచివాలయం, ఇతర శాఖల అవసరాల కోసం ఈ భవనాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. రెండు ప్యాకేజీల కింద నాలుగు భవనాల నిర్మాణాన్ని ఎల్ అండ్ టికి, ఒక ప్యాకేజీ కింద రెండు భవనాల నిర్మాణాన్ని షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని మున్సిపల్ వ్యవహారల శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. ఈ ఒప్పందం పత్రాలు ప్రభుత్వానికి అందగానే, ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వివరించారు.
తాత్కాలిక భవనాల నిర్మాణం జూన్ మొదటి పక్షం వరకే పూర్తి చేస్తే, హైదరాబాద్ నుండి కార్యాలయాలను తరలించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధప్రాతిపదికన భవనాలను నిర్మించడాన్ని ఒక ఛాలెంజ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారు. హైదరాబాద్ నుండి వీలైనంత త్వరగా సచివాలయ కార్యాలయాలను తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఉద్యోగులకు కూడా ఈ విషయాన్ని గత డిసెంబర్ నెలలోనే వెల్లడించారు.