తెలంగాణ

చెలరేగిన హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ చివరి గంటల్లో పాతబస్తీలో హింస చెలరేగింది. కొద్దిగంటల్లో పోలింగ్ ముగియనుండగా లంగర్‌హౌజ్, ప్రశాంత్‌నగర్‌లో బిజెపి, తెరాస, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణలతో పాతబస్తీ రణరంగమైంది. పోలింగ్ సందర్భంగా పురానాపూల్‌లో మొదలైన ఉద్రిక్తత చార్మినార్, లంగర్‌హౌజ్, ఆజంపురలో ఘర్షణలకు దారితీసింది. లంగర్‌హౌజ్‌లో పోలీసులు లాఠీచార్జి జరిపితే, జంగమ్మెట్‌లో ఇరువర్గాల రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ సమక్షంలోనే కార్యకర్తలు కాంగ్రెస్ అగ్ర నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై దాడికి దిగారు. ఘటనలో పలువురు గాయపడగా, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ గౌస్‌పై ఎంఐఎం శ్రేణులు దాడికి దిగడంతో పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఇంతకుముందు మజ్లిస్ పార్టీలో కొనసాగారు. అక్కడి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే మంగళవారం పోలింగ్ సందర్భంగా ఎంఐఎం నేతలు కొందరు గౌస్‌పై దాడికి పాల్పడ్డారు. డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో గౌస్‌ను అరెస్టు చేసి మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను మజ్లిస్ భయభ్రాంతులకు గురి చేస్తోందన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పాషాఖాద్రీని అరెస్టు చేసి చార్మినార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్‌ను విడిపించుకునేందుకు అక్కడికి వచ్చిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై లంగర్‌హౌస్ వైపునుంచి వస్తున్న ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉత్తమ్, షబ్బీర్ అలీ గాయపడ్డారు. దీంతో వారు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగడంతో పాషాఖాద్రితోపాటు, మరో ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేశారు. జంగమ్మెట్‌లో బిజెపి అభ్యర్థి కౌడి మహేందర్, నాయకుడు ఎడ్ల విజయ్‌కుమార్‌లపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచరులు దాడికి దిగడంతో ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం దాడులకు ఉపక్రమించారు. దీంతో ఫలక్‌నుమా, జంగమ్మెట్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త చెలరేగింది. ప్రత్యేక దళాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ అమల్లో ఉంది. మలక్‌పేటలోని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఆజంపురలో మహమూద్ అలీని మలక్‌పేట ఎమ్మెల్యే అనుచరులు నెట్టివేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అడ్డొచ్చిన మహమూద్ అలీ కుమారునిపైనా దాడికి దిగడంతో తెరాస కార్యకర్తలు ఎంఐఎం కార్యకర్తలను అడ్డుకొనేయత్నంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే అనుచరులను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన సమయంలో నగర కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి భద్రతా దళాలను మోహరింపజేశారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీని నగర కమిషనర్‌తోపాటు హోంమత్రి నాయిని నర్సింహరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సిఎంపై ఎంఐఎం దాడికి పాల్పడడం బాధాకరమన్నారు.
బిజెపి, ఎంఐఎం నేతల ధర్నా
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని జంగమ్మెట్ డివిజన్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఎంఐఎం, బిజెపి ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ జంగమ్మెట్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి బిజెపి ఏజెంట్‌పై చేయిచేసుకోవడంతో అందుకు నిరసనగా బిజెపి నాయకులు కౌడి మహేందర్, విజయ్‌కుమార్ ఆందోళనకు దిగారు. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లదాడికి దిగారు. దీంతో ఫలక్‌నుమా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలొకొన్నాయి.
అక్బరుద్దీన్ హల్‌చల్
ఫలక్‌నుమలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హల్‌చల్ సృష్టించారు. బిజెపి కార్యకర్తలు ఎంఐఎం ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారంటూ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఫలక్‌నుమలో ఆందోళనకు దిగారు. దాదాపు రెండువేల మంది కార్యకర్తలతో పిఎస్ ఎదుట బైఠాయించి బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డిజిపి ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ధర్నా
పాతబస్తీలో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీలపై ఎంఐఎం నేతలు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి డిజిపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిజిపి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 24 గంటల్లో ఎంఐఎం నాయకులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఆందోళన విరమించేదిలేదంటూ టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, భట్టివిక్రమార్క భీష్మించుకు కూర్చున్నారు. ఎంఐఎంపై చర్యలు తీసుకుంటామని అదనపు డిజిపి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

చిత్రం... పాతబస్తీ ఎన్నికల ఘర్షణల్లో కారులో కూర్చున్న షబ్బీర్ అలీని కాలితో తన్నుతున్న ఎంఐఎం కార్యకర్త. షబ్బీర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం. లంగర్‌హౌజ్‌లో పోలీసుల లాఠీచార్జి