దక్షిన తెలంగాణ

లక్ష్మి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగరీత్యా లక్ష్మికి ముప్పై కిలోమీటర్ల ప్రయాణం. దాదాపు ముప్పై మంది, అందరు కలిసి మినీ బస్సులాంటిది మాట్లాడుకున్నారు.
ఈ ప్రయాణ సమయంలో, వాహనంలో ఉన్న వాళ్లందరు పిచ్చాపాటి కబుర్లు, ఆడవారు చీరలు, నగల గురించి, మగవాళ్లు కొత్తగా వచ్చిన మోటారు బైకుల గురించి, రాజకీయాలు, సినిమాలు, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ప్రపంచమంతా ముప్పై మంది చుట్టూ, ముప్పై కిలోమీటర్ల దూరం వరకు సాగేది. కాని లక్ష్మి మాత్రం ప్రకృతిలోని అందాలను, చెట్టు పుట్టలు, గుట్టలు, చెరువులు, సెలయేర్లు, పూలు, కాయలను చూస్తూ నయనానందాన్ని అనుభవిస్తూ తనలోకంలో తాను విహరించేది. ముఖ్యంగా ఈతచెట్లు కనిపించినపుడు తన ఆనందం వర్ణనాతీతం. తన తోటి సహోద్యోగులందరు పచ్చటి పొలాలను చూస్తూ ఏవో మాట్లాడుతున్నారు. వారితో చూడండి ఈతచెట్లు ఎంత బావున్నాయో, ఆకుపచ్చని కొమ్ములలో, వాటి మధ్యలో పచ్చటి ఈతకాయలు (చిన్న ఖర్చూర పండు) పండిన పండ్లు, వాటిని చూడగానే నోరు ఊరుతుంది కదూ, అంటూ తన్మయత్వంగా చెప్పేది. అమ్మా..తల్లీ..నీ ఈతచెట్టు వర్ణన ఆపు, ఎవరన్నా మామిడి పండు గురించి, యాపిల్ పండ్లు, మల్లెమొక్కలు, గులాబి మొక్కల గురించి వర్ణిస్తే విన్నాము, కానీ నీవేంటి ఈత చెట్టుగురించి చెప్పి చంపకు..అంటూ చిరాకు పడ్డారు.
ఆ చెట్టుకు ఒక కుండ కూడా ఉంది. కల్లుకుండ దాని గురించి ఏమీ చెప్పవా..ఏం చెప్పినా ఏదో అంటారు. అని లక్ష్మి తన మనస్సులోనే అనుకుంటుంది. తొమ్మిది నెలల నిండు గర్భిణీలాగా ఉన్నట్లుంది కల్లుకుండతో ఈతచెట్టు.
రోజులాగానే ఆ రోజు కూడా ప్రయాణం, మినీ బస్సు పాడవటం, రిపేరు చెయ్యటానికి పది నిమిషాలు పడుతుందని డ్రైవర్ చెప్పడం, లక్ష్మీతో పాటు అందరూ దిగి పంట చేలలోకి వెళ్తారు. లక్ష్మి మాత్రం ఈత చెట్టు దగ్గరకు వెళ్తుంది. ఆ చెట్లను తాకుతుంది. ఈత రెమ్మలను తెంపుకుని వాటిని తన హృదయానికి హత్తుకుంటుంది. ఆ చెట్టు పక్కన నిల్చొని తన సెల్‌ఫోన్‌లో ఫోటో తీసుకుంటుంది.
డ్రైవర్ పిలవగానే అందరూ వచ్చారు. కొందరు రేగుపండ్లు, మరికొందరు పువ్వులు తెచ్చుకున్నారు. లక్ష్మి నువ్వేం తెచ్చావు అని అడుగుతారు. ఈత రెమ్మలను చూపిస్తుంది. అందరు పగలబడి నవ్వేశారు.
ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక డాబా మీదకు వెళ్లి పడుకుంటుంది లక్ష్మి. నిండైన వెనె్నల, ఆ వెనె్నలను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ చిన్నప్పుడు చెప్పిన ముచ్చట్లు గుర్తుకు రాసాగాయి. నిజమే అనుకునే వాళ్లము, అవన్ని మధుర స్మృతులుగా మదిని తొలుస్తాయి. ఇప్పుడు ఆ వెనె్నలను చూడగానే ఈతచెట్టు, తన అవ్వ గుర్తుకు వస్తాయి.
ఈత చెట్టుతో తన బంధం ఒక్కొక్కటి కన్నులముందు కదలాడుతుంటాయి. లక్ష్మివాళ్లు గోసమోల్లు, ఆ జాతి ఆడవారి కులవృత్తి ఈతసాపలు అల్లడం, అదే వాతావరణంలో ఎనిమిది సంవత్సరాలు పెరుగుతుంది. ఈత సాపను అల్లినట్లుగా ఈత రెమ్మలతో తన అనుబంధం అల్లుకుపోతుంది.
ఈత కొమ్మలను ఎండబెట్టడం, ఎండిన తరువాత పొడవాటి కొమ్మనుండి రెమ్మలన్ని వేరుచేయడం, వాటిలో పెద్దవి, చిన్నవి మళ్లీ వేరుచేయడం, ఈతరెమ్మ మడతగా ఉంటాయి. వాటిని రెండుగా చీరడం (దీనిని కమ్మచీరడం), పెద్ద రెమ్మలతో పెద్ద పట్టాలు కుట్టడం, చిన్న రెమ్మలతో కల్సారి కుట్టడం (పెద్ద పట్టాలకు చుట్టు దీనిని కుడుతారు). ఇవన్నీ లక్ష్మికి వాళ్ల అవ్వదగ్గర బువ్వ తింటూ అలవాటు చేసుకుంటుంది.
లక్ష్మివాళ్ల నాన్నగారు రాజు. ఆ రోజుల్లో ఎస్‌ఎస్‌సి చదువుకోవడం వల్ల గవర్నమెంటు ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటాడు. రాజు భార్య గంగ కూడా సాపలు అల్లేది. రాజు స్నేహితుల తల్లులు అంటారు. ‘నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు మీ కుల కశిపి చేపిచ్చుడేందిరా, బీడీలు నేర్చుకోవడానికి మా దగ్గరకు పంపు’ అనడం. గంగకు కూడా ఈతసాపలు అల్లడం ఇష్టంలేక బీడీలు ఒక నెలలో నేర్చుకుంటుంది. బీడీ కార్ఖానాలో బీడీలు చెయ్యడం, అక్కడున్న కులాల వారితో దోస్తావ కావడం, లక్ష్మిని స్కూళ్లో చేర్తిస్తారు. స్కూలునుంచి సాయంత్రం రాగానే అవ్వదగ్గరకు వెళ్లి ఈత కమ్మను చీరడం, ఇదంతా గంగకు ఇష్టం ఉండదు. దానికి కారణం ఉంది. బీడీలు చేసే దగ్గర ఏందే నీ బిడ్డకు మీ కులం రీతులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడూ మీ ముసల్దాని దగ్గర ఈతకమ్మ చీరుకుంటూ కూచుంటది. ఆ మాటలు విన్నప్పుడు తన మనస్సుకు బాధ కలుగుతుంది.
ఏదో మతలబు చేసి తన భర్త కూతురితోని గోసమోల్ల గూడెమును వదిలి బీడీలు చేసే వాడకట్టుకు వచ్చి ఉంటారు. ఈత రెమ్మల చుట్టు ఝుమ్మంటూ తిరిగిన లక్ష్మికి కొత్తగా వచ్చిన చోట మనుషుల మధ్య బంధించిన జంతువులాగా తయారవుతుంది. కాలంతో పాటు లక్ష్మి చదువు. కాగితాల బరువు కూడా పెరుగుతుంది. చదువు కమ్మల (పేజీల) మాటున ఈత కమ్మలను మరచిపోతుంది. కాదు..కాదు..మరిపింపజేస్తారు.
ఈ చుట్టూ ఉన్న సమాజ పోకడలో కాలంతో పాటు కాగితాల మీద సంతకం పెట్టే స్థాయికి చేరుతుంది లక్ష్మి.
ఇప్పుడు హోదా పెరిగింది. ఆర్థిక పరిస్థితి, అధికారం, సమాజంలో ఒక స్థానం వచ్చాయి. కానీ నీటికోసం తాను తన భాషను, యాసను, తన కులవృత్తిని అన్నింటిని వదులుకోవాల్సి వచ్చింది. అయినా తన ఆచారాలు, ఆత్మీయతలు, ఆఖరకు తినే తిండి మరువలేదు. ఈత సాపలను అల్లేవారు కన్పిస్తే వారిని, వారి దగ్గరున్న ఈత సాపలను అమాంతంగా వాటేసుకుంటుంది.

- డాక్టర్ గంధం విజయలక్ష్మి
నిజామాబాద్
సెల్.నం.9948181458

అంతరంగం

అర్హులకే సాహితీ పురస్కారాలు అందాలి

కథా రచయత రేగులపాటి కిషన్ రావు

రేగులపాటి కిషన్‌రావు
10-1-436
సంతోష్‌నగర్
కరీంనగర్ - 505001
సెల్.నం.9640606404

అర్హులు, యోగ్యులయిన వారికే సాహితీ పురస్కారాలు అందించాలని ఆకాంక్షించే సీనియర్ కథా రచయిత రేగులపాటి కిషన్ రావు ఇప్పటివరకు 29 గ్రంథాలను వెలువరించారు. వృత్తిరీత్యా ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. వందలాది కథలు రాసిన అనుభవం ఆయనకుంది. కవిత్వం, కథలు రాయడంలో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్న రేగులపాటి కిషన్ రావుతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...

ఆ మొట్టమొదటి రచన ఎప్పుడు చేశారు?
1967 నుండి 1977 వరకు 22 కథలు, 3 నాటికలు రాసాను. కానీ ఏ పత్రికకు వాటిని పంపించలేదు. 1978 మొదటి కథ ‘కుళ్లుబుద్ధి’ కథాంజలి మాస పత్రికలో ప్రచురింపబడింది.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
పాఠకులకు, శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తూ భావాన్ని రమణీయంగా కొత్త కోణంలో చెప్పగల రచనే కవిత్వమని నా అభిప్రాయం.

ఆ కవిత్వం - కథ రాయడంలో ఏది సులభం?
రెండూ కష్టమే, రెండు సులభమే. అది రచయిత జ్ఞానపరిధిననుసరించి, అభిరుచిననుసరించి, సృజన శక్తిననుసరించి ఉంటుంది.

ఆ మంచి కథకు ఉండాల్సిన లక్షణాలు చెప్పండి?
కథా ప్రారంభం, శైలి, శిల్పము ఆసక్తికరంగా ఉండాలి. ఊహించని మలుపులతో పాటు ఆలోచనాత్మకమైన ముగింపు ఉండాలి. చక్కని సందేశంతో ముగింపు ఉండాలి.
ఆ మీకు రచనల వైపు ఆసక్తి ఎలా కలిగింది?
1967లో నేను బాలకొండలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్‌బాబుల నవలల, కథల తెలుగు అనువాద రచనలు చదివాను. కాలక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి మొదలగువారి రచనలు చదువుతుండగా కథలు రాయాలనే ఆసక్తి కలిగింది. విశ్వనాథ కినె్నరసాని పాటలు, సి.నారాయణరెడ్డి గారి రామప్ప, అక్షరాల గవాక్షాలు చదివాక కవితలు రాయాలనే ఆసక్తి కలిగింది, పెరిగింది.

ఆ మీకు నచ్చిన కవి - రచయిత ఎవరు?
పైన చెప్పిన రచయితలు, కవులే కాకుండా పాఠకులకు సన్మార్గం చూపించే మంచి రచనలు చేయగలిగిన వాళ్లందరూ నాకు నచ్చిన రచయితలే!

ఆ మీకు నచ్చిన గ్రంథమేది?
నాకు నచ్చిన గ్రంథాలు చాలా ఉన్నాయి. విశ్వనాథ ‘మా బాబు’, విష్ణుశర్మ ‘ఇంగ్లీష్ చదువు’ రంగనాయకమ్మ రచయిత్రి, ‘బలిపీఠం’, ‘జానకి విముక్తి’, వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టి మనుషులు’ సమత ఇలా.. చాలా ఉన్నాయి.

ఆ మీ ముద్రిత గ్రంథాలు..?
నా కథాసంపుటాలు కథక చక్రవర్తి, సంస్కారం కథలు, ఈతరం పెళ్లికూతురు, అనే్వషణ, పరిమళించిన కవిత్వం, నవలలు 4, విమర్శ గ్రంథం 1, వ్యాస సంపుటి 1, సాహితీ సౌరభం (సమీక్షా వ్యాసాలు) కవితా సంపుటాలు 13. మొదలగు 29 రచనలు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
రచయితలు కథలు, నవలలు శక్తివంతంగా విస్తారంగా రాయాలి. సమీక్షకులు ఆయా రచయితల గుణదోషాలను నిజాయితీగా చెప్పగలగాలి. ఇంకా చెప్పాలంటే పుస్తక ప్రచురణ సంస్థలు తెలంగాణలో విస్తృతంగా రావాలి.

ఆ ఇప్పటితరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే
ఏం చేయాలి?
సాహితీ సంస్థల నిర్వాహకులు జూనియర్ కాలేజీ, డిగ్రీ, పిజీ కాలేజీల అధ్యాపకులను, విద్యార్థులను పెద్ద మొత్తంలో సమావేశమందిరాలకు రప్పించగలగాలి. ప్రతిభావంతులైన వక్తలతో సాహిత్య ఉపన్యాసాలు ఇప్పించాలి. ప్రతి సమావేశంలోనూ గాయకులచేత గేయాలను, జానపద గీతాలను, పాటలను, గజళ్లను గానం చేయించి శ్రోతలను ఆకర్శించేలా చేయాలి.

ఆ సాహిత్య పురస్కారాలపై మీ అభిప్రాయం?
సాహిత్య పురస్కారాలు ఇవ్వడమంటే రచయితలను గుర్తించడమే, ప్రోత్సహించడమే.. అయితే సమర్థులైన రచయితలను ఎన్నుకోవడం ముఖ్యం! అర్హులకే పురస్కారాలు అందించాలి. ఎంపికలో పారదర్శకత ఉండాలి.

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలంగా
పనిచేయాలంటే ఏం చేయాలి?
కొన్ని సాహితీ సంస్థలు చాలాకాలం నుండి నిరాటంకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి చక్కగా నిర్వహిస్తూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఆరుద్ర పురుగుల్లాగా పుడుతున్నాయి. కనుమరుగవుతున్నాయి. ఇక ఏం చేయాలంటే ఏం చెప్పగలము? కవులు, రచయితలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆ ఇప్పటి కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు, సూచనలు?
సాహిత్యం పట్ల అభిరుచి గల నూతన తరం వాళ్లు ఎక్కువగా కథలు, నవలలు, కవితలు విస్తారంగా చదవాలి. అధ్యయనం పట్ల శ్రద్ధ చూపుతూ శక్తివంతంగా రాయడానికి కృషి చేస్తూనే ఉండాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

పుస్తక సమీక్ష

ఘాటైన భావాలు..
‘సొంటికొమ్ములు’!

పేజీలు: 66.. వెల : 40/-
ప్రతులకు: వడ్నాల కిషన్
ఇం.నం.2-20/1
తీగలగుట్టపల్లి,
జిల్లా కరీంనగర్ - 505002
సెల్.నం.9866702382

‘ఎడ్లు ఏడుస్తున్నాయి
మేతేసే నారైతు
బతుకు పోరులో
ఓడిపోయిండని’ అంటూ ఆర్ధ్రంగా అన్నదాతను నానీలో ఆవిష్కరించిన కవి వడ్నాల కిషన్..తన తొలి గ్రంథంగా ‘సొంటి కొమ్ములు’ నానీల సంకలనాన్ని వెలువరించారు. ఈ సంకలనంలోని నానీలన్నీ కవి యొక్క లోక పరిశీలనకు..సామాజిక చింతనకు అద్దం పట్టేలా రూపుదిద్దుకున్నాయి. వృత్తిరీత్యా జిల్లా పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షకులుగా పని చేస్తున్న ఆయనకు నాటక రంగంలో నటునిగా కూడా విశేష అనుభవముంది. మనుష్యుల్లోని మాలిన్యాన్ని రూపుమాపేందుకు..‘సొంటికొమ్ముల’ రూపంలో..తన మనో రంగాన్ని మధించి..మనకు ఓ ఔషధంలా అందించడం అభినందనీయం!
ఆధునిక తెలుగు సాహిత్యంలో సుమారు గత రెండు దశాబ్ధాలుగా అందరినీ అలరిస్తున్న నానీల ప్రక్రియను వడ్నాల కిషన్ ఎంచుకుని తను సృజనను చాటుకోవడం స్వాగతించదగింది..
‘తొలకరి చినుకుల
మట్టి వాసనలు
మనసు నిండా
పులకరింతలు’ అంటూ రాసిన
నానీ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇలా ఎన్నో నానీలు ఈ గ్రంథంలో ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి..ఘాటైన భావాలతో సాగే ఇందలి నానీలు సమాజంలోని రుగ్మతల నివారణకు ఔషధంలా పనిచేసే అవకాశముంది.
‘పరిచయం ఒక దిశ
స్నేహం మరో దశ
అనంతరం
పందిట్లో పదనిస’ అంటూ నేటి యువతరం సరిగమల్ని మొదటి నానీలో వినిపించిన కవి కిషన్..అంతే గాఢంగా మిగతా నానీలు రాస్తే బాగుండేదని పాఠకులకు అనిపించినప్పటికీ..ఆయన సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేరు. ఈ గ్రంథంలోని కొన్ని నానీలు ఒక వాక్యాన్ని నాలుగు పంక్తులుగా విభజించబడి, కవిత్వాంశ కొరవడినట్లు కనిపించినప్పటికీ..అవి సందేశపరంగా బాగున్నాయని మెచ్చుకుంటాము..అయితే కాయకన్నా తొడిమె పెద్దగా అన్నట్లు ముందు మాటలు ఎక్కువైనాయి!
‘మది మెదిలే భావాలు / నన్నూ రడించే
నా ప్రియనేస్తాయి’ అని భావించే కవి వడ్నాల కిషన్ మున్ముందు ఓ మంచి కవితా సంపుటితో మన ముందుకు రావాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

సభాపర్వం

శాతవాహన విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కడారు వీరారెడ్డి రచించిన ‘నిత్య యవ్వని’ దీర్ఘకావ్యాన్ని త్యాగరాయ గానసభలో డిసెంబర్ 21న ఆవిష్కరించారు. ఈ సభకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, వంశీ రామరాజు, దాస్యం సేనాధిపతి, డా. గండ్ర లక్ష్మణ్‌రావు, డా. వెలిచాల కొండల్‌రావు, కళా వెంకట దీక్షితులు, పొరెడ్డి రంగయ్య, తెనే్నటి సుధాదేవి తదితరులు హాజరయ్యారు.

మనోగీతికలు

సుపథం వెలుగులో..
దుఃఖాన్ని ఢీకొనే
గుండె ధైర్యం చాలని దుర్భలులకు
ప్రౌఢ పరిమళాల్ని అద్ది
మానసిక దారుఢ్యం పెంచుతున్నాను
చిరు సమస్యలకే
చిగురుటాకుల్లా విల విల్లాడే
అపరిపక్వచింతనా పరులకు
విద్యుల్లత లాంటి ఆలోచనల
క్రాంతి గుళికల్ని అందిస్తున్నాను
ఒకవైపు అల్పపీడనం వల్ల
కుండపోత జలధారల్తో
అతలాకుతలం జేసే
ప్రకృతి బీభత్సం
వణికిస్తూ భయపెడుతుంటే
మరోవైపు
నిశ్చలత్వం స్థిరచిత్రం చాటే
ప్రబోధగీతాల్తో
చైతన్యం రంగరించిపోస్తున్నా..
గడ్డిపోచల్నిజమ చేసి
అల్లుకున్న పిట్టగూడులాంటి
నా ఇంటి గుమ్మంనుంచే
అవలోకిస్తున్నా విశ్వవీధిని
అరుదైన టెలిస్కోపుల్తో..
ఆర్థిక హార్థిక అసమతుల్య
నిరాశమయ నిస్సహాయులకి
వెలుగు దివిటీని చేతబూని
సుపథం నిర్దేశిస్తున్నాను..

- డాక్టర్ దామెర రాములు, నిర్మల్, సెల్.నం.9866422494

కవి!
మనస్సనే నేత్రాలతో..
సమాజం నకడను పరిశీలించేవాడు కవి!
తన కల్పనా శక్తితో
అక్షరాలకు అందాన్ని సమకూర్చి..
అందరినీ అలరించేవాడు కవి!
సంస్కృతీ, సంప్రదాయాలను
మన జీవనశైలీ విధానాన్ని
సృజనతో మనముందుంచి
సన్మార్గంలో నడిపేందుకు..
తన కలానికి పని కల్పించేవాడు కవి!
మంచీ, చెడు విచక్షణ తెలిపి..
వివేకంతో మసలుకోవాలని..
జన చైతన్యానికి అహరహరం
తన రచనలతో
మార్గదర్శనం చేసేవాడు కవి!
ప్రకృతి అందాలను
తన పద బంధాల్లో బంధించి..
ఎంచక్కా మనల్ని
మంత్రముగ్ధుల్ని చేసేవాడు కవి!

- అనభేరి విప్లవ కుమారి
కరీంనగర్
సెల్.నం.9100442747

చీకటి సృష్టి
విధి బలీయమని కొందరంటుంటారు
వాడి కోట్ల నోట్లకు
వీడి కోట్ల దుఃఖానికి
సంబంధమేమిటో నాకు అర్థంకాదు
చావు పుట్టుకలు విధి పగ్గాలు కావచ్చు
ఇక్కడ తలవంచాల్సిందే!
దేవుడి గాలి నేల
జన మందరిది కానప్పుడు
దేవుడా!
నీ న్యాయస్థానం ఎక్కడోచెప్పు!
సవాల్ చేయాలని వుంది
నీ అడుగులు ప్రశ్నించాలని నాకు లేదు
నా అడుగుల సంగతేమిటీ ప్రశ్న
నా అడుగులు దినదినం
చీకట్లోకి బురదలోకి జారిపోతున్నాయి
ఎవరి ఆజ్ఞ ఇది! ఎవరి కుట్ర ఇది!
నిన్ను ప్రశ్నించడానికి జనమున్నారు
జగత్తూ వుంది
తండ్రి కొడుకును ప్రశ్నిస్తాడు
తప్పు కాదు
ఈ పచ్చనోట్లను ఎందుకు సృష్టించావు నీవు
అన్నీ నీవే అంటున్నావు కనుక!

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486122

ఆశ

నేను రాసిన కవితని
పత్రికలో చదవాలని
పంపించాను
పత్రికలవారికి
కవితలో
ఏమి లోపం ఉందోగాని
ప్రచురించలేదు పత్రికల్లో
ఆశ నిరాశగనే మిగిలింది
బేజారెక్కిపోయింది
రాసి, రాసి..
అయినా ఆపలేదు
నా కలాన్ని
కాలాని, కనుకూలంగా
రాసి పంపుతూనే ఉన్నా!
ఇకముందైనా
ప్రచురించకపోరా!
పత్రికలో, రేపో మాపో అనీ..
అనే ఆశతో...

- రేగుంట పోచయ్య
బెల్లంపల్లి, జిల్లా మంచిర్యాల
ఫోన్.నం.08735-225184

విద్యాకల్ప వృక్షం

వికసిస్తోంది విద్య
విరబూసే కుసుమంలా
చిన్న విత్తుతోనే ఆరంభం
ఆ విత్తు చిత్రంలోనుండి పొడుచుకొని వచ్చి
అంకురంలా మారుతుంది
అంకురం మొక్కగా పరిణమించి
మహావృక్షమై విస్తరించి
చివరికి కల్పవృక్షంలా మారుతుంది
ఆ కల్పవృక్షం కాయలూ తీయనివే
అమిత ఫలాలూ తీయనివే
ఆ చెట్టుకు చీడపీడల బాధలేదు
వృద్ధాప్యం అసలే లేదు
మరణం రానే రాదు
అదెప్పుడూ నిత్యనూతనమే!
దాని వయస్సు ఎప్పుడూ యవ్వనమే!
దాని విలువ ఎన్నాళ్లైనా ఘనమే!

డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి. సెల్.నం.9440468557

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- డాక్టర్ గంధం విజయలక్ష్మి