రాష్ట్రీయం

అన్ని సీట్లపై తెరాస గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్‌లో చేరికల జోరు నిస్తేజంగా టిడిపి, కాంగ్రెస్

హైదరాబాద్, నవంబర్ 30: పనె్నండు శాసన మండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసే వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు. రెండు రోజుల్లో పార్టీ నాయకుల అభిప్రాయాలు సైతం తెలుసుకోనున్నారు. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, మరోవైపు తమ పార్టీ ఓటర్లు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం కాంగ్రెస్, టిడిపిలకు మింగుడు పడడం లేదు. టిఆర్‌ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మొత్తం 12 స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇతర పార్టీల స్థానిక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. టిఆర్‌ఎస్ దూకుడు చూసిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేట్టు చూస్తే బాగుంటుందని, ప్రస్తుతం స్థానిక సంస్థల ఓట్లలో ఎవరికి మెజారిటీ ఉంటే వారే పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. టిఆర్‌ఎస్ యేతర పార్టీలన్నీ కలిసి పోటీ చేయడం ద్వారా టిఆర్‌ఎస్‌ను ఓడించాలని కొందరు కాంగ్రెస్ నాయకులు సూచించారు. అయితే టిఆర్‌ఎస్ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తాం మొత్తం 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ జిల్లాల నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆయా జిల్లాల నుంచి వరుసగా వీరి చేరికలు ఉంటాయని పార్టీ నాయకులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. కుత్బుల్లాపూర్ ఎంపిటిసిలు ఆరుగురు కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఐదుగురిది టిడిపి కాగా, ఒకరిది వైఎస్‌ఆర్ కాంగ్రెస్. ఈసారి టిఆర్‌ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న మాజీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
వరంగల్ ఫార్ములాపై దృష్టి
వరంగల్ పార్లమెంటు నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థే ఆర్థికంగా పేదవారు. చివరకు ఎన్నికల ఖర్చును సైతం పార్టీనే భరించి పోటీకి నిలబెట్టారు. ఎన్నికల్లో ఈ ప్రభావం బాగా పనిచేసిందని భావిస్తున్న టిఆర్‌ఎస్ నాయకులు మండలి ఎన్నికల్లో సైతం ఈ విధానాన్ని పాటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపన్నులైన ఎన్‌ఆర్‌ఐ, మాజీ కేంద్ర మంత్రులు రంగంలో నిలిచినా ప్రజలు ఒకసాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని గెలిపించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మసునూరి దయాకర్‌ను పోటీకి నిలపడంతో టికెట్ ఆశిస్తున్నవారి నుంచి వ్యతిరేకత రాలేదు. అదే సమయంలో ప్రజల నుంచి సానుకూలత వచ్చింది. ఇదే ఫార్ములా మండలి ఎన్నికల్లో అమలు చేయాలనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. శాసన మండలిలో టిఆర్‌ఎస్‌కు మెజారిటీ రావడానికి ఇతర పార్టీల నుంచి మండలి సభ్యులను చేర్చుకున్నారు. తిరిగి మండలికి పంపిస్తామనే హామీతో చేర్చుకున్నారు. ఆ విధంగా పంపించారు కూడా. ఈ విధంగా హామీ ఇచ్చిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాల్సిందేనని, అయితే మిగిలిన సీట్లలో మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంచి సందేశం పంపినట్టు అవుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది అనే నమ్మకం కలిగించడానికి మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి అవకాశం ఇస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో అయితే ఆ నియోజక వర్గంలో బలంగా ఉన్న అభ్యర్థినే పోటీకి నిలపాల్సి ఉంటుంది. ఏ పార్టీనుంచి వచ్చిన వారైనా నియోజక వర్గంలో బలాన్ని బట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కానీ స్థానిక సంస్థల కోటాలో జరిగే మండలి ఎన్నికల్లో అలాంటిదేమీ ఉండదు. కాబట్టి పార్టీ ఇమేజ్‌కు ఉపయోగపడే విధంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా హామీ ఇచ్చిన మేరకు రెండు మూడు స్థానాలను మినహాయిస్తే మెజారిటీ స్థానాల్లో మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నవారికే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.