తెలంగాణ

24 గంటల విద్యుత్ ఎవరి ప్రయోజనాల కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఎవరి ప్రయోజనాల కోసమని రైతు సంఘాలు, ఎన్జీవోలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) సమావేశంలో నిలదీశారు. ఫ్యాప్సీ భవన్‌లో సోమవారం 2018-19 సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవశ్యకత, రిటేల్ ధరలు, సబ్సిడీ, సర్చార్జీ, అదనపు సర్జార్జీలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలి ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు చంద్రశేఖర్, మల్లిఖార్జున రావు, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల రావు, తిమ్మారెడ్డి, రైతు సంఘం నాయకులు కోదండరెడ్డి, స్వామి జగన్మయానంద, హెచ్‌పీసీఎల్ ప్రతినిధి అనూప్, డాక్టర్ దొంటి నర్సింహారావు, సోలార్ డవలపర్స్ అసోసియేసన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సుమారు తొమ్మిది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అత్యధికులు వ్యవసాయానికి 24 విద్యుత్‌ను వ్యతిరేకిస్తూ, విద్యుత్ సంస్థల్లో నెలకొన్న అవినీతి, ప్రమాదాలను ప్రస్తావించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రచారానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అన్నారు. భూగర్భ జలాలు లేని ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందో అర్ధం కావడం లేదని అన్నారు. భారీగా సబ్సిడీ ఇచ్చి విద్యుత్‌ను ఇస్తున్నా ఉపయోగించుకునే స్థితిలో రైతులు లేరని గుర్తు చేసారు. భారీ స్థాయిలో ఇచ్చే సబ్సిడీ తిరిగి ప్రజల మీద పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. విద్యుత్ సంస్థల్లో అవినీతి రైతాంగానికి, ఇతర వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, చిన్నపాటి సమస్యలను పరిష్కరించేందుకు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారని వాపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వాటిని మరమత్తులు చేయించేందుకు రైతులు చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుందన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. హెచ్‌పీసీఎల్, రైల్వే, భారీ నీటి పారుదల శాఖల నుంచి వచ్చిన ప్రతినిధులు తమకు విద్యుత్ చార్జీల్లో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వాహకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నష్టపరిహారం తదితర అంశాల్లో ఈఆర్‌సీ ఆదేశాలు క్రింది స్థాయిలో అమలు కావడం లేదని కోదండరెడ్డి అన్నారు. రాజకీయ ప్రజయోనాల కోసం కాకుండా వినియోగదారుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

రైతాంగ సంక్షేమానికే 24 గంటల విద్యుత్
- సీఎండీ రఘుమారెడ్డి
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సీఎండి రఘుమారెడ్డి ఇచ్చారు. ఇఆర్‌సి సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. విద్యుత్ సంస్థల్లో అవినీతి అధికారులను ఉపేక్షించబోమని, అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతిని నిర్మూలించేందుకు తమకు సహకరించాలని కోరారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ఆ నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాల విషయంలో బాదితులకు నిబందనల మేరకు నష్టపరిహారం అందించేందుకు మరింత సమర్థవంతంగా వ్యవహరిస్తామని అన్నారు. గృహాలలో జరుగే ప్రమాదాలకు సైతం తాము ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని, ఈ విషయాన్ని అధికంగా ప్రచారం చేసి లబ్దిపొందేలా చూడాలని కోరారు. అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు గతంతో పోల్చితే తగ్గాయని చెప్పారు. ఇది 24 గంటల విద్యుత్ వల్లే సాధ్యమైందని, గతంలో నిర్థిష్టమైన సమయంలో విద్యుత్‌ను అందించడంతో ఒకే సారి సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడేదని ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలుకు తక్కువ ధరకు విద్యుత్ అందిస్తున్నట్టు భావించడం సరికాదని, కేవలం ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల వరకే రాయితీపై విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. విమానాశ్రయం, మెట్రోరైల్వే స్టేషన్లలో వ్యాపార సముదాయాలకు ఇతర కార్యకలాపాలకు ఇస్తున్న విద్యుత్‌కు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.