తెలంగాణ

హామీలు మరచిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: కేసీఆర్‌ది ముదనష్టంపు పాలన అని ఆయన పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో నిర్వహించిన బహుజన లెప్ట్ ఫ్రంట్ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు పుష్కలంగా వాగ్దానాలను ఇచ్చారని కానీ గద్దెనెక్కాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేస్తే కేసీఆర్ తట్టుకోవడంలేదని అన్నారు. కేసీఆర్ పాలనలో పౌరహక్కులు లేకుండా పోతున్నాయని ఎవరైనా ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తే ఆయన సహించడంలేదని ఇలాంటి ప్రభుత్వం కొనసాగితే రాజ్యాంగానికే అవమానకరమని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కేసీఆర్‌ను గద్దెదింపడం ఖాయమని అందుకు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరినీ ఏకం చేయడానికి ఐక్యతను తీసుకురావడానికి బహుజన లెప్ట్ ఫ్రంట్ నిరంతరంగా కృషి చేస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని ఓడిస్తేనే తప్పా రాష్ట్రంలో పౌరహక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో బహుజన లెప్ట్‌ఫ్రంట్ తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతుందని చెప్పారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల వారి విధానాలన్నీ ఒకటేనని ఆ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగబోతుందని ఇది నాలుగైదు నెలల్లో అదందరికీ అర్థం అయ్యేవిధంగా తాము కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి గుప్పిట్లో బందీగా ఉందని ఆ సంకెళ్లను తెంచాల్సిన బాధ్యత బహుజనులపై ఉందని అందుకు తాము ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అందరూ టీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని చెబుతున్నారని కానీ గతంలో పాలించిన వారు తిరిగి అధికారంలోకి వస్తే కేసీఆర్ చేస్తున్న దుష్టపాలననే కొనసాగిస్తారని అందుకే తాను ఈ వేదిక నుండి రాష్ట్రంలోని బహుజనులకు ఓ పిలుపునిస్తున్నానని రాష్ట్రంలో నూతనంగా ఆవిర్భవించిన బహుజన లెప్ట్ ఫ్రంట్‌ను బలపరిచి నాయకులుగా ఎదగాలని దాంతో రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్ర పేరిట ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని గతంలో తాము అధికారంలో ఉన్నామనే విషయాన్ని మరువకూడదని హితవుపలికారు. నేడు దేశంలో ఇన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓ ఘనమైన చరిత్ర మాత్రం ఉందని అది కుంభకోణాల పార్టీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి భయపడుతున్నారని వీరి జాతకాలు ఆయన చేతుల్లో ఉన్నాయని విమర్శించారు. మోదీ, కేసీఆర్, చంద్రబాబుల పాలసీలు అంతా ఒకటేనని అన్నారు. రాష్ట్రం లో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ ఐదు అంశాలతో ప్రజల ముందుకు వెళ్తుందని విద్య, వైద్యం, సేద్యం, ఉద్యోగాలు, మద్యపాన నిషేధం వంటివి తమ ప్రధాన ఎజెండాలని వీటిని ప్రజలముందు ఉంచి రాబోయే ఎన్నికల్లో పోటీకి దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ బహిరంగ సభలో బిఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ జలజం సత్యనారాయణ, నాయకులు విశే్వశ్వర్‌రావు, మజీదుల్లాఖాన్, వనజ, చంద్రకుమార్, కిల్లె గోపాల్, రామ పాల్గొన్నారు.