తెలంగాణ

తెలంగాణకు ప్రత్యేక ఎండోమెంట్స్ ట్రిబ్యునల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10 : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవసరాల కోసం ‘తెలంగాణ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్’ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని 10 జిల్లాలు ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఎపి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌ను రాష్ట విభజన చట్టంలోని పదోషెడ్యూల్‌లో చేర్చారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏర్పాటైన ఎపి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ 23 జిల్లాలకు పనిచేసేది. ధార్మిక సంస్థలు, ధర్మాదాయ, మతపరమైన సంస్థలు, దేవాలయాలు, హిందూమతపరమైన ఇతర సంస్థల్లో ఏవైనా వివాదాలు ఏర్పడితే ఈ ట్రిబ్యునల్ విచారిస్తుంది. తెలంగాణ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ రెవెన్యూ (ఎండోమెంట్స్) కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అధికార లాంఛనాలతో చెన్నమనేని అంత్యక్రియలు
హైదరాబాద్, మే 10: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి తరం కమ్యూనిస్టు నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో మంగళవారం జరిగాయి. చెన్నమనేని కుమారుడు, శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ తండ్రి చితికి నిప్పు అంటించారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అనారోగ్యంతో 93 ఏళ్ల వయసులో చెన్నమనేని రాజేశ్వరరావు సోమవారం అస్పత్రిలో మృతి చెందారు. అంత్యక్రియలకు మంత్రులు కె తారక రామారావు, నాయిని నర్సింహ్మారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల్లో లింగమార్పిడి
విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు
హైదరాబాద్, మే 10: లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు విద్యాసంస్థల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధానంగా వారు ఇటు స్ర్తిలతోనూ, అటు పురుషులతో కలిసి సఖ్యంగా ఉండి చదువుకునే పరిస్థితి లేకపోవడంతో వారికి ప్రత్యేకించి ప్రతి విద్యాసంస్థలో సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. లింగమార్పిడి విద్యార్థులకు అవసరమైతే ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు, తరగతి గదులు కూడా నిర్వహించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లింగమార్పిడి విద్యార్థుల సంఖ్యను ప్రతి విద్యాసంస్థ నుండి ఇప్పటికే కేంద్రం సేకరించింది. అలాగే చాలా విద్యాసంస్థలు వారికి అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయని, మున్ముందు అలా జరగకుండా వారి లింగనిర్ధారణకు సంబంధించి ప్రత్యేక కాలమ్స్ రికార్డుల్లో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ అంశంపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది.

తెలంగాణలో కరవు విలయం
5 జిల్లాల నుంచి 14 లక్షల మంది వలస
రాజ్యసభలో దేవేందర్ గౌడ్ ఆవేదన
న్యూఢిల్లీ, మే 10: తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులకు తాళలేక మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 14 లక్షల మంది ప్రజలు వలసపోయారని తెలుగుదేశం సభ్యుడు దేవేందర్‌గౌడ్ మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో తెలిపారు. కరవు మూలంగా ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే, పశువులకు గ్రాసం కూడా లభించటం లేదని ఆయన వాపోయారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోవటంతో తాగేందుకు కూడా నీరు లభించటం లేదని, ఇంతటి కరవు గతంలో ఎప్పుడూ రాలేదని అన్నారు. కరవు మూలంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనవలసి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అధిక సంఖ్యలో కొనసాగుతున్నాయని, వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉందని దేవేందర్ గౌడ్ తెలిపారు. రూ.791 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు విడుదలచేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేయగలుగుతుందని ఆయన ప్రశ్నంచారు.

కాంట్రాక్టు లెక్చరర్ల
క్రమబద్దీకరణపై సవాలు
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పిటిషన్
హైదరాబాద్, మే 10: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసుల క్రమబద్దీకరణపై కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన సుచరిత మరి కొంత మంది ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ నెల 31వ తేదీలోపల కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. గెజిట్‌లో ఈ జీవోను నోటిఫై చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును జూన్ 2వ తేదీకి ట్రిబ్యునల్ వాయిదా వేసింది.

మంచి ర్యాంకు కోసం ఆగితే
ఉన్న ర్యాంకు పోయింది!
హైదరాబాద్, మే 10: మెడికల్, డెంటల్ కాలేజీల్లో చేరాలంటే నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేలాది మంది లాంగ్‌టెర్మ్ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది ఇంటర్ పూర్తయి, ఎమ్సెట్‌లో మంచి ర్యాంకులు సాధించుకోలేకపోయిన విద్యార్థులు లాంగ్‌టెర్మ్‌లో చేరడం, మరోమారు ఏడాది పొడవునా శిక్షణ పొంది ఎమ్సెట్ రాయడం గత కొద్ది సంవత్సరాలుగా అలవాటుగా ఉంది. మెడికల్ స్ట్రీంలో అయితే విద్యార్థులు రెండు, మూడు సార్లు, చివరికి ఐదుసార్లు కూడా రాసిన వారున్నారు. అదే పనిగా నిరంతరం ప్రిపేర్ కావడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించడం, ఒక సారి అనుకున్న ర్యాంకు సాధించకలేకపోయినా, మరో సారి మంచి ర్యాంకు సాధించి సీట్లు సాధించడం జరుగుతోంది, ఈ క్రమంలోనే కార్పొరేట్ కాలేజీలు సైతం తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకులు వచ్చిన వారిని సైతం మరోమారు లాంగ్‌టెర్మ్‌లో చేరి ఇంకా మంచి ర్యాంకులు, టాపర్లుగా నిలిచేందుకు ప్రోత్సహిస్తున్నాయి. నీట్ సంగతి తెలియక గత ఏడాది ఎమ్సెట్‌లో ర్యాంకులు వచ్చినా, తమకు నచ్చిన కాలేజీల్లోసీట్లు రాలేదని భావించి, వదిలిపెట్టి లాంగ్‌టెర్మ్‌లో చేరిన విద్యార్థుల పరిస్థితి నేడు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.

పదవులపై నేతల ఆశలు
కెసిఆర్ ఢీల్లీ నుంచి రాగానే నామినేటెడ్ పోస్టుల కసరత్తు
హైదరాబాద్, మే 10: వివిధ నామినేటెడ్ పదవుల పంపకానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టడంతో పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌కు తిరిగి రాగానే నామినేటెడ్ పదవుల పంపకంపై దృష్టి సారిస్తారని తెలియటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, దేవాలయ కమిటీలు, గ్రంధాలయ కమిటీలు మొత్తం దాదాపు నాలుగు వేల వరకు పదవులు ఉన్నాయి. ఆలయాల ట్రస్ట్ సభ్యుల నియామకంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఈ నియామకాలు మినహా మిగిలిన నామినేటెడ్ పదవుల నియామకాలు సత్వరం పూర్తి చేయనున్నట్టు కెసిఆర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక్క ఆర్టీసి చైర్మన్ మినహా ఇప్పటి వరకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్‌లను నియమించలేదు. అధికార భాషా సంఘం చైర్మన్‌ను మొదటి నుంచి పార్టీకి సంబంధం లేకుండా సాహితీ వేత్తలనే నియమిస్తున్నారు. అదే విధంగా దేవులపల్లి ప్రభాకరరావును నియమించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌ను నియమించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన బుద్ధవనంకు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో పిడమర్తి రవిని ఎస్సీ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించారు. మిగిలిన కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులకు పెద్ద సంఖ్యలో ఆశిస్తున్న వారు ఉన్నా ఇప్పటి వరకు నియామకాలు జరగలేదు. ప్లీనరీకి ముందు పదవుల పంపకాన్ని లాంచన ప్రాయంగా ప్రారంభించారు. 8 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. తొలిసారిగా మార్కెట్ కమిటీల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మార్కెట్ కమిటీల నియామకాలు తొలుత జరుగుతాయని పార్టీ నాయకులు తెలిపారు. అదే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లను, రాష్ట్ర చైర్మన్‌ను నియమించనున్నారు. మే నెలలోనే ఎక్కువ సంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్‌ల నియామకంలో గతంలో పార్లమెంటరీ కార్యదర్శులుగా పనిచేసిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీరి నియామకాలను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రివర్గంలో ఒక్క మహిళా ఎమ్మెల్యేకు అవకాశం దక్కలేదు. అదే విధంగా ఇప్పటి వరకు జరిగిన నిమాయకాల్లో మహిళలకు ఒక్కరికీ స్థానం దక్కలేదు. దాంతో నామినేటెడ్ పోస్టుల్లో మహిళలను నియమించనున్నారు. టిఆర్‌ఎస్ మహిళా విభాగం నుంచి నామినేటెడ్ పదవుల కోసం పేర్లు ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉన్న మహిళా విభాగం నాయకులకు అవకాశం కల్పించనున్నారు.

మరో రెండు రోజులు వర్షాలు
ఉరుములు..మెరుపులు..పిడుగులు
వాతావరణంలో మార్పులే కారణం
ఐఎండి డైరెక్టర్ వెల్లడి
హైదరాబాద్, మే 10 : ప్రస్తుతం ఎండాకాలం వర్షాకాలాన్ని తలపిస్తోంది. మహబూబ్‌నగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారిక లెక్కలు వెల్లడించాయి. గడచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, వరంగల్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.
ఎండాకాలంలో వర్షాలు తరచుగా వస్తుంటాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రస్తుతం బంగాళాఖాతం వైపు నుండి తెలంగాణ, కోస్తాంధ్రవైపు గాలులు వీస్తున్నాయని, గాలిలో తేమ ఉండటంతో పాటు 10-12 కిలోమీటర్ల ఎత్తువరకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని, ఉపరితలంలో ఎలక్ట్రోస్ట్రాటిక్ ఎనర్జీ ఏర్పడటం వల్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. విపరీతంగా ఎండలు ఉన్న సమయంలో వాతావరణంలో ఈ తరహా మార్పులు వస్తుంటాయని డైరెక్టర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కూడా మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని, ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇలాఉండగా, తెలంగాణ, ఎపితో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడుల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్-11, మోమిన్‌పేట -5, చేవెళ్ల, నల్లగొండ-4, కంపాసాగర్, పరిగి, మహేశ్వరం, వికారాబాద్, తాండూరు, నవాబ్‌పేట, టేకులపల్లి, పాల్వంచ, అశ్వాపురం, వరరామంచంద్రాపురం (తూర్పుగోదావరి) మెంటాడ (విజయనగరం) మూడేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తగ్గిన విద్యుత్ డిమాండ్
వారం రోజుల్లో 117 ఎంయుకు తగ్గిన వినియోగం
హైదరాబాద్, మే 10: తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు, ఎండ తీవ్రత తగ్గడంతో విద్యుత్ వినిమయం గణనీయంగా పడిపోయింది. తగిన డిమాండ్ లేకపోవడంతో ఆ మేర విద్యుత్ ఎక్స్చేంజీ ద్వారా ఐదువందల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లను నిలిపివేశారు. వ్యవసాయం, గృహ రంగంలోనూ విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర విద్యుత్ రంగంలో అరుదైన పరిస్థితి నెలకొంది. 6వ తేదీ శుక్రవారం పొద్దుపోయిన తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో 7.5 సెం.మీ వర్షం కురవటంతో విద్యుత్తు డిమాండ్ 6వేల మెగావాట్ల నుంచి 1620 మెగావాట్లకు పడిపోయింది. ఈ సీజన్‌లో గరిష్టంగా 6500 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదైంది.
విద్యుత్ డిమాండ్ తగ్గడంతో జెన్కో పరిధిలో ఆ తర్వాత అంతరాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఆ తర్వాత ఒప్పందం మీద తీసుకునే విద్యుత్‌ను కూడా తగ్గించేశారు. జెన్కో పరిధిలోని అన్ని విద్యుత్ స్టేషన్లను అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు.
గత నాలుగు రోజులుగా ఆశించిన స్థాయి విద్యుత్ వినిమయం లేకపోవడంతో ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ తీసుకోకపోయినా స్థిర ధర ప్రకారం విద్యుత్ చార్జీలను చెల్లిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రతకు సగటున 150 ఎంయు విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 117 ఎంయు విద్యుత్ వినిమయమైంది. దాదాపు డిమాండ్ కంటే 30 ఎంయు తక్కువ. పీక్ డిమాండ్ 5237 మెగావాట్లు నమోదైంది. జెన్కో థర్మల్ నుంచి 38 ఎంయు, కేంద్ర విద్యుత్ స్టేషన్, విద్యుత్ కొనుగోళ్ల ద్వారా 43.290 ఎంయు, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి 10.952 ఎంయు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా 24.603 ఎంయు విద్యుత్‌ను సేకరించారు.