తెలంగాణ

19న టిఎస్ ఐసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట (వరంగల్), మే 10: తెలంగాణ ఐసెట్ 2016ను ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఐసెట్ వివరాలను వెల్లడించారు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సులలో ప్రవేశాలకై నిర్వహించే రాష్టస్థ్రాయి ఐసెట్ పరీక్షను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి కెయు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఐసెట్ 2016 పరీక్ష ఈ నెల 19 తేదీన, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30వరకు జరుగుతుందని వివరించారు. దీని కోసం 16 రీజినల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా 127 కేంద్రాలలో పరీక్షకు ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. హైదరాబాదు రీజినల్ కేంద్రంలో అత్యధికంగా 59 కేంద్రాలను, వరంగల్ రీజినల్ కేంద్రంలో 14, కరీంనగర్ రీజినల్ కేంద్రంలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆదిలాబాద్, కోదాడ, వికారబాద్, వనపర్తిలలో ఒక్కొక్క కేంద్రం ఉంటుందని అన్నారు. జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాలలలో రెండేసి కేంద్రాలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సిద్దిపేటలలో మూడేసి కేంద్రాలను, ఖమ్మంలో 7, నల్లగొండ 5, నిజామాబాద్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ చేయాలి
ప్రధానికి కడియం శ్రీహరి వినతి
న్యూఢిల్లీ, మే 10: షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక వినతిపత్రం సమర్పించినట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, తాను మంగళవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు శ్రీహరి విలేఖరులకు తెలిపారు. ఎస్‌సి రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరుతూ తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తేనే మాదిగలకు మేలు జరుగుతుందన్న విషయం మోదీకి వివరించామనని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను దామాషా పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బాలిక కాదు... బాలుడు!
ముస్తాబాద్, మే 10: ఆరోజు వరకు బాలికగా ఉన్న మానస, బాలుడిగా మారాడు. ఇంతకాలం బాలికగా భావిస్తున్న సమాజానికి తాజాగా బాలుడిగా పరిచయమయ్యాడు. జన్యుపరమైన లోపంతో జన్మించి, 11 ఏళ్లుగా బాలికగా ఎదిగిన ఆ చిన్నారి నేడు సంపూర్ణ బాలుడిగా మారింది. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి చెందిన గవ్వల రాజు-లావణ్య దంపతుల సంతానం మానస 11 ఏళ్లు గడుస్తున్నా స్ర్తి లక్షణాలు కన్పించకపోవడంతో వైద్యుల్ని ఆశ్రయించారు. ముస్తాబాద్‌లోని డా.బ్రహ్మయ్య మెమోరియల్ స్మారక ఆసుపత్రిలో వైద్యులు సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె బాలిక కాదని గర్భసంచి, స్ర్తి జననాంగాలు లేవని, వైద్య పరిభాషలో బైలటెరల్ ఆర్కిటోపెక్సీగా గుర్తించారు. శస్తచ్రికిత్స జరిపి, పొత్తికడుపులో ఉన్న వృషణాలు, పురుషాంగాన్ని, పొట్ట దిగువన జననాంగాల స్థానంలో అమర్చినట్లు ప్రముఖ గైనకాలజిస్టు చింతోజు శంకర్ మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.

తాగి వాహనం నడపొద్దు
మద్యం సీసాలపై హెచ్చరికలకు ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, మే 10: మద్యం బాటిళ్లపై వాటి ధరలు, ఎంత పరిమాణం మద్యం ఉందో తెలియచేసే వివరాలను బాటిళ్లపై ఉండే లేబుళ్లపై ప్రముఖంగా ప్రచురించాలని కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మద్యం తాగడం హానీకరం, తాగి బండినడపొద్దు అన్న నినాదాలను కూడా లేబుళ్లపై ప్రచురించాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఏయే బాటిళ్లపై ఏయే సైజులో ఉండాలో కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఉదాహరణకు 50 ఎంఎల్ మద్యం బాటిళ్లపై 12 ఫాంట్‌లో, 750 ఎంఎల్ బాటిళ్లపై 20 పాంట్ సైజులో ధరల వివరాలు ఉండాలని స్పష్టం చేశారు.

సింగరేణి నీటిని తాగొద్దు: యాజమాన్యం
సింగరేణి కార్మిక కుటుంబాలకు సరఫరా అవుతున్న నీరు కలుషితమైన్నట్లు, దాని మూలంగా అతిసారా ప్రబలిన నేపథ్యంలో కార్మికులు ఆ నీటిని తాగొద్దని రామగుండం ఆర్జీ-1 సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కాలనీల్లో రోజూ సరఫరా చేసే నీటిని తాగడానికి తప్ప మిగతా పనులకు వాడుకోవాలని సూచించారు. సింగరేణి యాజమాన్యంచే తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నామని తెలిపారు. కలుషిత నీరు వల్ల ఏర్పడ్డ పరిణామాల దృష్ట్యా పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి నివేదికలు వచ్చిన తరువాతనే సింగరేణి నీటిని తాగాలని సూచించారు.

తెరాసకు ప్రత్యామ్నాయం బిజెపినే
ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ఆరాటం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
నిజామాబాద్, మే 10: రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలిచేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. దశా, దిశా లేకుండా కొనసాగుతున్న తెరాస పాలనతో విసిగెత్తిన తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో బిజెపి వైపు చూస్తున్నారని, భవిష్యత్తు తమ పార్టీదేనని అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన బిజెపి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీ కంటే దయనీయంగా మారిందని, తెలుగుదేశం పార్టీ అయితే తన ఉనికినే కోల్పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ నేతృత్వంలో బిజెపితోనే తెలంగాణ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరవు తీవ్రతతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటే కరవు సహాయక చర్యలు చేపట్టడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఓట్లు, నోట్లు, సీట్లపైనే ఆరాటం ప్రదర్శిస్తున్నారు తప్ప, ప్రజల గోడును పట్టించుకునేందుకు ఆయనకు సమయమే లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ వెంటే పాలేరు ప్రజలు
ఇనగాలి, వివేక్, పొన్నం స్పష్టీకరణ
ఖమ్మం, మే 10: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు మద్దతునిస్తున్నారని, విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనగాలి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిలు వివేక్, పొన్నం ప్రభాకర్‌లు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తిరుమలాయ పాలెం మండల పరిధిలోని తిప్పారెడ్డిగూడెం, అజ్మీరతండా, తిరుమలాయపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుచరితకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ విధానాలను, రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన సేవలను, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి తెలియ చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, నాయకులంతా ఐక్యంగా అధికారపార్టీ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు వల్ల పార్టీకి ఇతర ప్రాంతాల్లో నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలకే ఆమె పెద్దపీట వేశారన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సర్వశుభంకరిగా భద్రకాళి
వరంగల్, మే 10: వరంగల్ నగరంలో భద్రకాళీ భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడవ రోజు సర్వశుభంకరిగా భద్రకాళీ అమ్మవారిని అలంకరించి మకర వాహనంపై ఊరేగించారు. సాయంత్రం అమ్మవారిని ‘చంద్రపరమేశ్వరి’గా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. వేలాది మంది స్ర్తిల సహస్త్ర నామపారాయణంతో ఆలయ పరిసర ప్రాంగణం లలితనామంతో మార్మోగింది. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులు కూడా పారాయణం పూర్తయ్యే వరకు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. అనంతరం మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు భద్రకాళీ భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. కళ్యాణ మహోత్సవానికి ఆలయం సర్వంసిద్ధమైంది.

మామిడి... రంగు మారింది!
సంగారెడ్డి, మే 10: ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగుల్లో లభించే మామిడి పండ్లను ఆరగించిన వారికి త్వరలోనే ఆపిల్ రంగులో లభించే నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇజ్రయిల్ నుంచి తీసుకువచ్చిన విత్తనంతో సరికొత్త వంగడాన్ని సృష్టించాడు ఓ మామిడి రైతు. ఆపిల్ రంగులో ఎర్రగా కనిపించే మామిడి పండ్లను మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మంగళవారం తన చేతుల మీదుగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. పేరు నిర్ధారించని ఈ మామిడి మొక్కల పెంపకాన్ని సృష్టించిన రైతు నర్సాపూర్‌కు చెందిన జాలాలోద్దీన్. ఖమ్మం జిల్లా అశ్వారావ్‌పేటకు చెందిన జలాలొద్దీన్‌ను నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌కు చెందిన అగ్రి హార్టికల్చర్ సొసైటీ వారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చి నైపుణ్యాన్ని కల్పించారు. అనంతరం నర్సాపూర్‌కు వచ్చిన జలాలొద్దీన్ మామిడి నర్సరీని సొసైటీ ఆదేశాల మేరకు పోషించి అందించారు. 12 సంవత్సరాల క్రితం నర్సాపూర్ శివారులో 6 ఎకరాల పొలాన్ని ఖరీదు చేసిన జలాలొద్దీన్ సొంతంగా నర్సరీని నడుపుతున్న ఆయనలో సరికొత్త వంగడాన్ని తయారు చేయాలన్న ఆలోచన రేకెత్తింది. ఈ మేరకు తనకు పరిచయమున్న వారి ద్వారా ఇజ్రాయిల్ నుంచి ఎరుపు రంగు మామిడి పండ్లు పండే విత్తనాన్ని తీసుకువచ్చి విజయం సాధించాడు. ఎకరాకు 120 మొక్కల చొప్పున 720 మొక్కలను నాటించాడు. మొక్క నాటిన యేడాదిన్నర రెండేళ్లకు కాతకు వస్తుంది. చెట్టుగా మారి కాత కాయడం వరకు ఒక్కో చెట్టుకు సరాసరి 250 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఒక్క బోరు ద్వారా డ్రిప్ విధానంతో మామిడి తోటకు నీటిని సమకూర్చుతున్నారు. చెట్టుకు ఉన్నప్పుడే 50 శాతం పండుగా మారుతుందని, చెట్టు నుంచి కోసిన రెండు రోజుల్లోనే మాగుతుందని, కార్బైడ్ అవసరం లేకుండానే ఈ వంగడం పండ్లను మార్కెట్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని రైతు వివరించారు. ఈ యేడాది మామిడి కాత అంతంత మాత్రంగానే ఉన్నా ఆధునిక వంగడమైన ఈ రకం ప్రస్తుతం చెట్టు ఒక్కంటికి 15 నుంచి 20 కాయల వరకు కాత కాస్తుందని, వచ్చే యేడాది ప్రకృతి సహకరిస్తే కాత మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మామిడితో సమస్యలు రావని, ఇందులో చక్కర శాతం తక్కువగా ఉంటుందన్నారు. వచ్చే యేడాది నుంచి ఈ పండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు రైతు జలాలొద్దీన్ స్పష్టం చేసారు. కొత్తరకం మామిడిని పెంచి పరిచయం చేసిన రైతు జలాలొద్దీన్‌ను కలెక్టర్ రోస్ అభినందించారు. బంగినపల్లి మామిడి పండ్లకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో ఆపిల్ రంగులో మామిడి పండ్లు అందుబాటులోకి రావడం మామిడి ప్రియులకు శుభసూచకమని చెప్పవచ్చు.

విజృంభిస్తున్న అతిసార
రామగుండం, మే 10: బొగ్గు గని కార్మిక కుటుంబాల ఆరోగ్యమంటే ఇక్కడ అందరికీ చేదే. సంక్షేమం మాట అటుంచితే కార్మిక కుటుంబాలకు అందించే తాగునీటి సరఫరాలో సింగరేణి నిర్లక్ష్యం ఫలితంగా వందలాది మంది అతిసారంతో మంచం పట్టారు. స్వచ్ఛమైన నీరు అందరి హక్కు అన్న నినాదం ఒక్క సారిగా సింగరేణి ప్రాంతంలో తిరగబడుతోంది. స్వచ్ఛమైన నీరు దేవుడెరుగు కాని... మంచి నీరులో మురుగు నీరు కలవడంతో కార్మిక కుటుంబాల దాహార్తికి సింగరేణి ఇచ్చే కలుషిత నీరు దిక్కవడంతో పర్యవసనంగా గోదావరిఖని పట్టణంలోని కార్మిక వాడల్లో రెండు రోజులుగా అతిసార ప్రబలి సుమారు 200 మంది కుటుంబాలు ఆసుపత్రుల పాలయ్యారు. సోమవారం కలుషిత నీరు తెచ్చిన తంటాలు మంగళవారంతో మరింత పెరిగిపోయి ఇక్కడ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గోదావరిఖనిలోని ప్రభుత్వ వంద పడకల పెద్ద దవఖానా, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వాంతులు, విరేచనాలు బారిన పడ్డ రోగులతో కిక్కిరిసిపోయింది. గోదావరిఖనిలోని సిఎస్‌పి కాలనీ, బాపూజీ నగర్, రమేష్ నగర్, గంగా నగర్, హనుమాన్ నగర్, లెనిన్ నగర్, తిలక్‌నగర్, జవహార్ నగర్‌తోపాటు యైటింక్లయిన్ కాలనీ, సెంటినరీకాలనీ ప్రాంతాల్లోని వివిధ కాలనీవాసుల్లో నివసిస్తున్న గని కార్మిక కుటుంబాలకు సింగరేణి నుంచే తాగునీటి సరఫరా జరుగుతుంది. గోదావరి ఇన్‌టెక్ వెల్ వద్ద నుంచి గంగా నగర్‌లోని హెడ్ వర్క్స్ వద్ద పూర్తిగా క్లోరినేషన్ జరుపుకున్నాక... కార్మిక కుటుంబాలకు నీటి సరఫరా జరగాల్సి ఉంటుంది. అయితే ఇన్‌టెక్ వెల్ ప్రాంతంలో మురుగు కాలువల మీదుగా తాగునీటి పైప్‌లైన్లు ఉండడంతో లీకేజీల మూలంగా పైపులైన్‌లోని మురుగునీరు చొచ్చుకుపోయి కలుషిత నీరు సరఫరా మూలంగా కార్మిక కుటుంబాలు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది. సింగరేణి కార్మిక కుటుంబాలకు చెందిన వందలాది మంది అతిసారంతో ఆసుపత్రులపాలు కావడం గోదావరిఖనిలో సంచలనం రేపింది. జిల్లా కలెక్టర్ నీతు కుమారీ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నీతుకుమారి మాట్లాడుతూ బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ఊరుకునేది లేదని, 24గంటలను రోగులను పర్యవేక్షించాలని అన్నారు.