తెలంగాణ

రాజ్యసభకు పోటీ అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు బలం లేనందున ఖాళీలేర్పడనున్న మూడు స్థానాలూ ఏకగ్రీవం అవుతాయనీ, ఆ మూడూ టిఆర్‌ఎస్ ఖాతాలోకే వెళతాయని అందరూ భావించారు. కానీ శుక్రవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాజీ ఎంపీలు అజరుద్దీన్, రవీంద్ర నాయక్, టి.పిసిసి గూడురు నారాయణ రెడ్డి పేర్లలో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు ఊహించారు. పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంతియాకే సిఎల్‌పి అప్పగించింది. కాగా శనివారం అనూహ్యంగా ‘తెర’పైకి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు వచ్చింది. గూడూరు నారాయణరెడ్డి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అజహర్, రవీంద్ర నాయక్ మాత్రం పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం అన్నట్లుగా ఉన్నారు.
ఇలాఉండగా ఖాళీలేర్పడనున్న మూడు స్థానాలకు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య (120) ప్రకారం ఒక్కో అభ్యర్థి విజయం సాధించేందుకు 29.75 (అంటే 30 ఓట్లు) రావాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల బలం 13 మాత్రమే. ఓడిపోతామని తెలిసీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలపాలని అనుకుంటున్నది. అందుకు కారణం లేకపోలేదు. తమ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ఓటింగ్‌కు రావాల్సిందిగా ‘విప్’ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకూ ‘విప్’ జారీ చేస్తుంది. కానీ ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని, లేనిపక్షంలో అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు పిటిషన్ ఇస్తామనో చెప్పడం కుదరదు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 13 ఓట్లు వస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారనే సంకేతం వెళుతుంది.
ఏ మాత్రం తేడా వచ్చినా, ఒకటి, రెండు ఓట్లు రాకపోయినా, అనే్వషణ మొదలవుతుంది. ఇది అనవసరంగా తెచ్చుకున్న తంటా అవుతుంది. కానీ అలా జరగదని, పార్టీ ఎమ్మెల్యేలంతా నమ్మకంగా ఉన్నారని, తేడా రాదని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. పార్టీ అభ్యర్థి పేరును నాయకత్వం ఆదివారం ప్రకటిస్తుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం తుది గడువు.