తెలంగాణ

రైతులకు సత్వర చెల్లింపులు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 19: ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సత్వరమే బిల్లుల చెల్లింపులు జరిగేలా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు చొరవ చూపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని 8ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 64 కెమెరాలతో అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉండి అన్ని చోట్లా పర్యవేక్షణ జరిపేలా దీనిని ఏర్పాటు చేశారు. అనంతరం జే.సీ చాంబర్‌లో పౌర సరఫరాలు, మార్కెటింగ్, డీసీఓ, మెప్మా తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని, అప్పుడే రైతులకు కూడా సంతృప్తి మిగులుతుందని, వారు తమ ఇతర అవసరాలను తీర్చుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి వివరాలు అడుగగా, మొత్తం 3లక్షల మెట్రిక్ టన్నులను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటి వరకు 2.84లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం పూర్తయ్యిందని జే.సీ రవీందర్‌రెడ్డి వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యం రీసైక్లింగ్ జరుగకుండా పకడ్బందీగా నిఘా కొనసాగించాలని, రీసైక్లింగ్‌కు పాల్పడే రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీ.డీ యాక్టును అమలు చేసే విషయంలోనూ వెనుకంజ వేయబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులకు నష్టం వాటిల్లకుండా పూర్తిస్థాయి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని, అదే సమయంలో సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం నిజామాబాద్ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేసి, ఆ వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని నిర్వహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో సకాలంలో నమోదు చేయని కారణంగానే రైతులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఈ విషయాన్ని నిర్వహకులు గుర్తించి వివరాల నమోదులో జాప్యానికి తావులేకుండా వెంటదివెంట స్పందించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రెండు రోజుల్లో నిధులను మంజూరు చేస్తోందని, వీటిని సకాలంలో రైతుల ఖాతాల్లో చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించామని, మొదట్లో చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని జే.సీ రవీందర్‌రెడ్డి కమిషనర్ దృష్టికి తెచ్చారు. గన్నీ బ్యాగుల కొరత లేదని, జిల్లా అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. కమిషనర్ వెంట డీఆర్‌డీఏ పీ.డీ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ కృష్ణప్రసాద్, సివిల్ సప్లైస్ డీఎం హరికృష్ణ, మార్కెట్ కమిటీ కార్యదర్శి స్వరూపారాణి, డీసీఓ శ్రీశైలం, మార్కెటింగ్ శాఖ ఏ.డీ రియాజ్ ఉన్నారు.

చిత్రం.. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న అకున్ సబర్వాల్