తెలంగాణ

సీఎం రాడాయె... సమస్య తీరదాయె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 31: వివాదాస్పదంగా మారిన సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరుకు ముఖ్యమంత్రి వస్తేకానీ తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. జనాకర్షక పథకాలతో ప్రజలను తమవైపు తిప్పుకుని మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులు సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చేసరికి చిత్తవుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి దక్కాల్సిన మెడికల్ కళాశాలను అమాంతం సిద్దిపేటకు తన్నుకుపోయారంటూ బహిరంగ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో అధికార టీఆర్‌ఎస్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఘోరంగా విఫలమవుతున్నారు. కాంగ్రెస్ ఆడుతున్న మెడికల్ కళాశాల గేమ్ ఎంతవరకు విజయం సాధిస్తుందన్నది పక్కన పెడితే నియోజకవర్గ ప్రజల్లో మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. యేడాదిన్నరకుపైగా ఈ వివాదం కొనసాగుతుండగా ఇటీవల కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, గురువారం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. గతంలో కలెక్టరేట్ ముట్టడి, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు మెడికల్ కళాశాలను అక్రమంగా తరలించుకుపోయారని జగ్గారెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంస్థాగత ఎన్నికలు మొదలుకుని సార్వత్రిక ఎన్నికలు తన్నుకొస్తున్న వేళ.. మెడికల్ కళాశాల వివాదం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టిందని చెప్పవచ్చు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు కాలేదని, కేవలం దరఖాస్తుకే పరిమితమైందని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ మెడికల్ కళాశాలను తీసుకువస్తామని గట్టిగా చెప్పడంలో విఫలమవుతున్నారు. మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని సీఎంకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పుకుంటున్నా ప్రజలను నమ్మించలేకపోతున్నారు. మెడికల్ కళాశాలతో టీఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందేమోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. జగ్గారెడ్డి రిలే నిరాహార దీక్షల ముగింపు కార్యక్రమానికి వందలాది మంది తరలిరావడంతో కాంగ్రెస్ నియోజకవర్గంలో పట్టుసాధిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వస్తేకానీ ఈ వివాదానికి తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పట్లో ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటనకు వస్తారన్న నమ్మకం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతమాత్రం విశ్వసించడం లేదు. సీఎం రాడాయే.. సమస్య తీరదాయే అన్న నిరాశ నిస్పృహలతో టీఆర్‌ఎస్ అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. మెడికల్ కళాశాలను ఎన్నికల హస్త్రంగా మలుచుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఓటర్లలో సానుభూతిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సరైన సమాధానం చెప్పలేక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జగ్గారెడ్డి అనుసరిస్తున్న విధానాన్ని అభినందిస్తూ జై కొడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సభను సంగారెడ్డిలో విజయవంతం చేసి మెప్పుపొందిన జగ్గారెడ్డి, టీపీసీసీ అధిష్ఠానానికి ప్రత్యేక ఆకర్షణ ఉన్న నాయకునిగా వెలుగందడం విశేషమనే చెప్పాలి. మెడికల్ కళాశాల వివాదాన్ని దివ్య ఔషధంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో, ఆందోళన చెందుతున్న టీఆర్‌ఎస్‌కు నష్టం ఎంత కలుగుతుందో చూడాల్సిందే.