తెలంగాణ

తెరుచుకున్న బాబ్లీ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 11: మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల పుణ్యమా అని నిజామాబాద్ జిల్లా సరిహద్దున గల వివాదాస్పద బాబ్లీ బ్యారేజీ పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకుంది. దీంతో నిర్ణీత సమయానికి ముందే బాబ్లీ గేట్లను పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం బాబ్లీ బ్యారేజీకి చెందిన నాలుగు గేట్ల ద్వారా 98వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ జలాలు మంగళవారం మధ్యాహ్నానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరనున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి బాబ్లీ గేట్లు తిరిగి మూసివేసినా, ఎస్సారెస్పీలోకి కనీసం 5టీఎంసీల వరకు నీటి నిల్వలు పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీలో జలమట్టం అడుగంటిపోయి డెడ్‌స్టోరేజీకి చేరువైన తరుణంలో ముందస్తుగానే బాబ్లీ ద్వారా వరద జలాలు వచ్చి చేరుతుండడం ఊరటనిచ్చే అంశంగా మారింది.
1091.00 అడుగులు, 90 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం నాటికి 1050.50 అడుగులు, 6.47 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 8.91టీఎంసీల వద్ద నీరు నిలిచి ఉండింది. బాబ్లీ బ్యారేజీ 1.75టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండడంతో వరుసగా నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇకముందు కూడా ఒక మోస్తారు నుండి భారీ స్థాయిలో వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరిగిన సందర్భాల్లోనూ బాబ్లీ గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలనున్నారు. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూన్ నెల ముగిసిన మీదటే తెరువాల్సి ఉంటుంది. ప్రతీఏటా వర్షాకాలం సీజన్‌లో జూలై 1 నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ గేట్లు పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని మళ్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతేడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురియని కారణంగా బాబ్లీ వద్ద ఇదే సమయానికి నీటి నిల్వలు అసలేమాత్రం కనిపించలేదు. జూన్ నెలాఖరు వరకు కూడా కేవలం 0.40టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉండగా, గేట్లు తెరిచినప్పటికీ ఎస్సారెస్పీకి అంతగా ప్రయోజనం చేకూరలేకపోయింది. ఈసారి వర్షాకాలం సీజన్ ఆరంభం నుండే ఏకధాటిగా కురుస్తున్న వానల ఉద్ధృతితో ముందస్తుగానే ఆశావహ పరిస్థితి నెలకొంది. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ప్రవేశించే కందకుర్తి త్రివేణి సంగమంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర వద్ద కూడా గోదావరిలో నిన్నమొన్నటి వరకు పూర్తిగా ఇసుక తినె్నలు దర్శనం ఇవ్వగా, వర్షాల ప్రభావంతో ప్రస్తుతం నీటి జాడలు కనిపిస్తూ, నది పాయలుగా చీలి ప్రవహిస్తోంది. బాబ్లీ వరద జలాలు తోడైతే గోదావరి ప్రవాహం మరింతగా పెరగనుంది.
ఇకముందు కూడా మహారాష్టల్రో సమృద్ధిగా వానలు కురిస్తే బాబ్లీ మీదుగానే శ్రీరాంసాగర్‌కు వరద జలాలు పోటెత్తనున్నాయి. తద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా ఏర్పడనుంది. కాగా, బాబ్లీ నీటిని విడుదల చేసిన నేపథ్యంలో దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు సూచించారు.

చిత్రం..బాబ్లీ గేట్లు పైకి లేపి మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న దృశ్యం