తెలంగాణ

త్వరలో స్పైస్ సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 26: పసుపు రైతుల ప్రయోజనార్థం సాధ్యమైనంత త్వరగా జిల్లాలో స్పైస్ సెల్ (సుగంధ ద్రవ్యాల విభాగం)ను ఏర్పాటు కానుందని ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. పసుపు బోర్డు కోసం గత ఎంతోకాలం నుండి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో, స్పైస్‌సెల్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఆమోదం తెలిపారని అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఎంపీ కవిత అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశా) సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులు, సాధించిన పురోగతిని ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్పైస్ సెల్ కోసం కేంద్రం తరఫున ఒక అధికారి, ముగ్గురు సహాయకులను నియమించారని, జిల్లాలో వీరి కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కేటాయిస్తే స్పైస్ సెల్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా కార్యాలయ భవనాన్ని సమకూర్చాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుకు సూచించారు. స్పైస్ సెల్ ద్వారా పసుపు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం అమలుతీరుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసే విషయంలో నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడం పట్ల ఎంపీ అసంతృప్తి వెలిబుచ్చారు. జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయల పైచిలుకు ఈజీఎస్ నిధులు పక్కదారి పట్టినట్టు సామాజిక తనిఖీల్లో వెల్లడైతే, కేవలం 43శాతం మాత్రమే రికవరీ చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. అక్రమార్కులకు నోటీసులు జారీ చేసి, పూర్తిస్థాయిలో నిధులను రాబట్టాలని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని కలెక్టర్‌కు సూచించారు. కాగా, జిల్లా కేంద్రంలో చేపడుతున్న మిషన్ భగీరథ పథకం పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల ఎంపీ కవిత సంబంధిత అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. ఇదివరకు నగరంలో భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ల ఏర్పాటు కోసం రోడ్ల తవ్వకాలు జరుపగా, ఆ సమయంలోనే మిషన్ భగీరథ పైపులను కూడా ఏర్పాటు చేసుకోవాలని, నగర పాలక సంస్థ అధికారులతో సమన్వయం పెంపొందించుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టమైన సూచనలు చేశామని గుర్తు చేశారు. అయినప్పటికీ తమ సూచనలను పెడచెవిన పెట్టారని, ప్రస్తుతం యూజీడీ పైపులు వేసి రోడ్లను నిర్మించిన మీదట, మళ్లీ మిషన్ భగీరథ పైపుల కోసం రోడ్లను తవ్వేస్తున్నారని ఎస్‌ఈ రమేష్‌పై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు నిజామాబాద్ నగరాన్ని అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇలాగైతే సకాలంలో పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా అలసత్వ వైఖరిని వీడి, సమన్వయంతో ముందుకు సాగాలని, లేనిపక్షంలో ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇదే తన చివరి వార్నింగ్‌గా భావించాలని కటువుగానే హెచ్చరిక చేశారు. కాగా, హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని, ప్రతి గ్రామంలో 40వేల చొప్పున మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా పూర్తిస్థాయిలో వాటిని సంరక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. చెరవు గట్లు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కాల్వల వెంబడి వెదురు మొక్కలు నాటించినట్లయితే మహేంద్రులకు ఉపాధి లభిస్తుందని మానిటరింగ్ కమిటీ సభ్యుడు బీ.ఆంజనేయులు ఎంపీ దృష్టికి తేగా, ఈ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లాలోని ఇతర సెగ్మెంట్లలో ఆసరా పెన్షన్లు 50వేల వరకు ఉండగా, నిజామాబాద్ అర్బన్‌లో మాత్రం కేవలం 26వేల మందికే అందిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా సమావేశం దృష్టికి తేగా, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అర్హులైన వారికి అందిస్తామని ఎంపీ పేర్కొన్నారు. నవీపేట, డిచ్‌పల్లి, బాల్కొండ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాల మెరుగుదల కోసం తన కోటా నుండి 17 లక్షల చొప్పున మొత్తం 51లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్టు ఎంపీ కవిత తెలిపారు. రైతుబీమా పథకం వివరాల సేకరణ ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని, ఇప్పటికే 54,830 మంది రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ నెలాఖరులోపు మిగతా రైతులందరి నుండి సేకరించాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ.గౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, జే.సీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కవిత