తెలంగాణ

కదులుతున్న డొంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: తీగలాగితే డొంక కదిలినట్లు నకిలీ వేలిముద్రల నిందితుడిని విచారిస్తే సిమ్ కార్డులే కాదు, రేషన్ సరుకులకు భారీగా ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. భూ దస్త్రాల రికార్డుల నుంచి వేలిముద్రలను డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా వేలాది సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసిన నిందితుడిని ఐబి, కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు లోతుగా విచారించారు. రెండు రోజుల పోలీసు కస్టడీలో అనేక విషయాలను రాబట్టారు. కేవలం ఈ కుంభకోణం సిమ్ కార్డుల వరకే పరిమితమైందా, లేక దీని వెనుక భారీ స్కెచ్ ఏదైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇదో అతిపెద్ద సైబర్ స్కాంగా భావిస్తున్న విచారణ బృందాలు దేశ సమగ్రత, భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు. శుక్రవారం విచారణ బృందాల పరిశీలనలో వేలిముద్రల ద్వారా రేషన్ సరుకులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఇందుకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు రేషన్ డీలర్ల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం భారీగానే స్వాహా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు చేశారు, ఎక్కడెక్కడి నుంచి బియ్యం తీసుకుని ఎవరికి తరలించారనే కోణంలో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దృష్టిసారించింది. ఇంతటితో ఆగకుండా బ్యాంకులు, ఇంకా ఆన్‌లైన్ లావాదేవీలను ఈ వేలిముద్రలతో చేశారా..? అనే కోణంలోనూ అనుమానించి ఆ దిశగా విచారిస్తున్నారు. కేవలం సిమ్ కార్డుల టార్గెట్ చేరుకునేందుకు ఇలా వేలిముద్రలు డౌన్ లోడ్ చేశానని నిందితుడు చెబుతున్నా, పోలీసులు శతవిధాల ఈ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా నిందితుడి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా ధర్మారానికి నిందితుడిని తీసుకెళ్లారు. నివాసంలోనూ, అతడి మొబైల్ దుకాణం ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్‌లోనూ తనిఖీలు నిర్వహించి కంప్యూటర్, మరికొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను సీజ్ చేసి సమగ్ర డేటా సేకరించే పనిలో ఉన్నారు. నిందితుడు ఏవిధంగా నకిలీ వేలిముద్రలు తయారు చేసిందీ అతనితోనే విచారణ అధికారులు డెమో కూడా తీసుకుని పరిశీలించారు. కేవలం గ్రామంలో ఉంటూ ఇంత పెద్ద సైబర్ నేరానికి పాల్పడ్డాడంటే, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? అనే దిశగా విచారిస్తున్నారు. ఈ సైబర్ నేరం ఉగ్రవాదుల వరకూ చేరితే ఎంత ముప్పు వాటిల్లేదని అధికారులే ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రంగంలో దిగింది. వేలిముద్రల ద్వారా ఏ స్ధాయిలో అవకతవకలకు ఆస్కారం కలిగిందనే కోణంలో విచారిస్తున్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అనుమానితులుగా ఉన్న నలుగురు రేషన్ డీలర్లను పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం 10 మంది డీలర్లతో సంతోష్ సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించి, వీరిలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేలిముద్రలు తయారు చేసే మిషన్ ఎక్కడ దొరుకుతుందీ, దాని ఖరీదు ఎంత, ఎవరిని సంప్రదించాలని విషయాలను జస్ట్ డయల్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని రూ.7 వేలకు ఆ మిషన్‌ను ఖరీదు చేసినట్లు విచారణలో వెల్లడైందని సమాచారం. పోలీస్, పౌరసరఫరాల శాఖతో పాటు ఆధార్ సంస్థ ఉన్నతాధికారులు కూడా రంగంలో దిగారు. సంతోష్ వేలిముద్రల కుంభకోణంలో ఆధార్ నెంబర్లను ఏ స్ధాయిలో దుర్వినియోగం చేసిందీ ఆ సంస్థ అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ కుంభకోణం వెల్లడికావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ వేలిముద్రల ద్వారా డాక్యుమెంట్ల డౌన్ లోడ్ పద్ధతిని నిలిపివేసింది. ఈ ఒక్క ప్రభుత్వ శాఖే కాకుండా మిగిలిన శాఖలు సైతం వేలిముద్రల ద్వారా డౌన్‌లోడ్ లేదా మరే ఇతర పనీ చేపట్టకుండా ఆ సేవలను ప్రస్తుతం నిలిపివేశాయి. నిందితుడు సంతోష్ చేసిన వేలిముద్రల స్కాంతో ఇంకా ఏయే శాఖలు, ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.