తెలంగాణ

చుక్క నీటినీ జారిపోనివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ భూభాగం నుండి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఒడిసిపడదాం.. పంటలకు మళ్లిద్దాం, తెలంగాణను సస్యశ్యామలం చేద్దామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. భారీ, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’ అన్న అంశంపై ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాకతీయుల కాలం నుండి గొలుసుకట్టు చెరువులు వారసత్వంగా వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలోని జలాశయాలన్నీ 365 రోజుల పాటు నీళ్లతో కళకళలాడాలన్నదే తన ఉద్దేశమన్నారు. వచ్చే రెండునెలల్లో గొలుసుకట్టు చెరువులన్నింటినీ నింపాలని ఆదేశించారు. ఏడాది కాలంలో అన్ని చెరువులను నీటితో నింపే ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాలువల ద్వారా వచ్చే నీటిని, వానల ద్వారా వచ్చే నీటిని, పడబాటు (రీజనరేటెడ్) ద్వారా లభించే నీటిని చెరువులు, కుంటల్లోకి మళ్లించాలన్నారు. వచ్చే జూన్ వరకు కాళేశ్వరం నుండి పుష్కలంగా నీరు లభిస్తుందని పేర్కొన్నారు. కాలువలను, చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్‌పై నీటిపారుదల శాఖాధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు, కుంటలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని 1974 లోనే కేటాయించిందని గుర్తు చేశారు. చెరువులను పునరుద్దరించడం ద్వారా ఈ మేరకు నీటిని వాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి, రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని ఒక్కో గొలుసుకట్టులో 20 నుండి 70 వరకు చెరువులున్నాయన్నారు. మొదటి చెరువును నీటితో నింపిన తర్వాత మిగతా అన్ని చెరువులకు నీరు చేరుతుందన్నారు. కట్టుకాలువ (్ఫడర్ కాలువ) లను పంట కాలువల (క్రాప్ కెనాల్)ను సిద్ధంచేయాలన్నారు. ప్రతి మండలం ఏఈ వద్ద ఆ మండలంలోని చెరువులకు సంబంధించిన మ్యాపులు ఉండాలన్నారు. ఏ కెనాల్ ద్వారా ఏ చెరువుకు నీటిని అందించాలన్న అంశంపై వ్యూహం సిద్ధం చేయాలన్నారు. తెలంగాణలోని నీరు పరుగెత్తవద్దని, మెల్లగా వెళ్లాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ విధంగా అయితేనే నీటిని సాగుకోసం ఇతర అవసరాలకోసం వినియోగించుకోగలుతామన్నారు. అన్ని జలాశయాలు నీళ్లతో నిండితే తెలంగాణ వాతావరణమే మారిపోతుందన్నారు. దీని వల్ల భూగర్భజలాలు కూడా బాగా పెరుగుతాయన్నారు. గతంలో ఆయకట్టుదారులే కాలువలు, తూముల మరమ్మతు చేసుకునే వారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ పాతరోజులు మళ్లీ రావాలని ఇందుకోసం నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
యూరప్, అమెరికా తదితర దేశాల్లో రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, మన వద్ద మాత్రం రైతుకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. గోదావరి, కృష్ణా నదుల నీటిలో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి తెలిపారు. నదుల నీటిని, వాన నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ప్రగతిభవన్‌లో శనివారం నీటి పారుదల ప్రాజెక్టులు, గొలుసుకట్టు చెరువులపై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్