తెలంగాణ

మల్బరీ తోటలకు పూర్వవైభవం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో మల్బ రీ సాగుకు, పట్టు ఉత్పత్తికి పూర్వవైభవం తీసుకురావాలని, ఇందుకు రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం సింగాపురంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సెరీకల్చర్, హార్టీకల్చర్ ఆధ్వర్యంలో 14 జిల్లాల మల్బరీ రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి ఈటల మాట్లాడారు. గతంలో మల్బరీ పెద్ద ఎత్తున సాగు చేసే వారని, క్రమంగా వాటిపై రైతులకు ఆసక్తి తగ్గిందన్నారు. గతంలో హుజూరాబాద్ ప్రాంతంలో పట్టుపరిశ్రమ మూడు పువ్వు లు ఆరు కాయలుగా వర్థిల్లిందని, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని, మల్బరీ సాగుకు మంచి రోజలు వస్తున్నాయని, ఇందులో లాభాలు కూడా బాగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అధికంగా ఇస్తున్నాయని వెల్లడించారు. రైతులు ఒకే రకమైన పంట వేస్తూ నష్టపోకుండా విభిన్నమైన పంటలను సాగుచేసి లాభాలు పొందాలని సూచించారు. ఏ భూములకు ఏయే పంటలు సరిపోతాయో అవగాహన పెంచుకోవాలని, రైతులు డ్రిప్ ఇరిగేషన్ విధానం ఉపయోగించుకుని ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేయాలని అన్నారు. తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి అనే రైతు మూడు లక్షల పెట్టుబడితో మల్బరీ సాగు చేసి రూ.10 లక్షల వరకు ఆదాయం పొం దాడని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా మారిందని ఆయన అన్నారు. మల్బరీ పెంపకంపై, రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై సీ ఎంతో ప్రత్యేకంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని, లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌లో 50 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామని వెల్లడించారు. 30 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, 7 వేల కోట్లు ఉచిత విద్యుత్తుకు, 12 వేల కోట్లు రైతు బంధు పథకం కోసం వెయ్యి కోట్లు రైతు బీమాకు కేటాయించామని వెల్లడించారు. రూ.900 కోట్లు డ్రిప్ ఇరిగేషన్‌కు కేటాయిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల చరిత్రలోనే ఇంత బడ్జెట్ కేటాయింపులు ఎక్కడా లేవని, ఇవన్నీ రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని సీ ఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించి భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు నివారించాలని, రైతును రాజును చేయాలన్నదే సీఎం సంకల్పమన్నారు. గడచిన నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపించామని తెలిపారు. భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకుని లక్షలాది మంది జీవిస్తున్నారని, గత పాలకులు వ్యవసాయం దండగ అన్నారని, దీన్ని పండగ చేసి సీఎం కేసీఆర్ చూపిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 వేల టన్నుల పట్టు అవసరం ఉండగా ప్రస్తుతం 30 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. ముఖ్యంగా మహిళలు దీన్ని కుటీర పరిశ్రమలా భావించి ఉపాధి పొందాలన్నారు. బొడిగె శోభ మాట్లాడుతూ రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకుని, అవసరమున్న పంటలు సాగుచేయాలని, రైతుల ఆలోచనా విధానంలో మార్పురావాలని అన్నారు. ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ మాట్లాడుతూ మల్బరీ ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు. తుమ్మనపల్లిలో రైతు సమ్మిరెడ్డి సాగుచేస్తున్న మల్బరీ తోటలను పట్టు పరిశ్రమను మంత్రి ఈటల రాజేందర్ సందర్శించి పరిశీలించి ప్రశంసించారు.
హరితహారంలో పాల్గొన్న మంత్రి ఈటల
హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కనీసం ఒక్కొక్కకరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కను నాటాలని, నాటగానే సరిపోదని దాన్ని మూడేళ్ల వరకు కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామపంచాయతీలు హరితహారం కార్యక్రమాన్ని స్వీకరించాలని కోరారు.
చిత్రం..హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో సమ్మిరెడ్డి అనే రైతుకు చెందిన మల్బరీ సాగును,
పట్టు ఉత్పత్తిని పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్