తెలంగాణ

గెలుపు గుర్రాల కోసం బీజేపీ వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 25: ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమేనంటూ బరిలోకి దిగుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి జిల్లాలో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. టార్గెట్ తెలంగాణ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆపార్టీ అగ్రనేతలు ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో పట్టుసాధించాలనే సంకల్పంతో ఉండగా, అంగబలం ఉన్న నాయకుల కోసం అనే్వషిస్తోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తూ, వారిని తమవైపు ఆకర్షించేందుకు శతథా యత్నిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ లోపు చేర్చుకుని, టికెట్లు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలీకృతమవుతుండటంతో, రెట్టించిన ఉత్సాహంతో మరికొందరిపై వల విసురుతోంది. ప్రధానంగా తమకు పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో అసమ్మతి రాగమాలపిస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులపై దృష్టి సారించింది. ఒక్కో సెగ్మెంట్‌ను ఒక్కో అగ్రనేతకు అప్పగించి, బలమున్న నాయకులను వెదికే పనిలోనిమగ్నమైంది. ఇప్పటికే పశ్చిమ జిల్లా అయిన జగిత్యాలలో మొదలెట్టిన ఆకర్ష్ పథకంలోకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డా.జెఎన్ వెంకట్ చేరి, కోరుట్ల అసెంబ్లీ టికెట్ కైవసం చేసుకున్నారు. అలాగే, జగిత్యాలలో కూడా అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకునిపై, వేములవాడ నియోజకవర్గంలోసైతం తెరాసకు చెందిన ముఖ్యనేత, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధిపై నజర్ పెట్టగా, సదరు నేత కూడా పార్టీతీర్థం పుచ్చుకుని, వేములవాడ నుంచి బరిలోకి దిగేందుకు సై అంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా జరిగితే రెండు, మూడు రోజుల్లో ఈ ఇద్దరు నాయకులు భాజపా అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హుజురాబాద్, రామగుండం, హుస్నాబాద్ సెగ్మెంట్లలో కూడా ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తున్నారు. హుస్నాబాద్‌లో మాత్రం భాజపాకే చెందిన వరంగల్ జిల్లా నాయకున్ని బరిలోకి దించే యత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆకర్ష్ పథకం ఆపార్టీలోని సీనియర్లను వికర్షిస్తోంది. ఏళ్ళ తరబడి తాము సేవలందిస్తూ, పార్టీ అభివృద్ధికోసం పాటుపడుతుంటే, తమను కాదని వలస నేతలకు టికెట్లిచ్చేందుకు సన్నద్ధమవుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలోపార్టీని పట్టుకుని ఉన్న తమకు, అధిష్టానం మొండి చేయి చూపుతుండటాన్ని జీర్ణించుకోలేక, మానసిక ఆవేదనకు గురైన ఒకరిద్దరు జిల్లాస్థాయి నాయకులు ఇప్పటికే జెండాలు మార్చారు. అయినా, అగ్రనేతలు మాత్రం ఆకర్ష్ పథకానికే ప్రాధాన్యతనిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.