తెలంగాణ

మూసుకున్న బాబ్లీ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14 గేట్లను పైకి ఎత్తగా, తిరిగి ప్రస్తుతం వాటిని మూసివేసి గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. సీడబ్ల్యూసీ ప్రతినిధి సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో బాబ్లీ గేట్లను కిందకు దించారు. కేంద్ర జల సంఘం ప్రతినిధి వెంకటేశ్వర్లు సమక్షంలో ఎస్సారెస్పీ ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ రామారావు, మహారాష్టల్రోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఈఈ కహలేకర్ పర్యవేక్షణలో గేట్లను కిందకు దించారు. బాబ్లీ గేట్లు తిరిగి వచ్చే ఏడాది 2019 జూన్ 30వ తేదీన తెరుచుకోనున్నాయి. అంతకుముందు మార్చి మాసంలో మూగజీవాల దాహార్తి కోసం ఒకవేళ బాబ్లీ వద్ద నీటి నిల్వలు ఉంటే తాత్కాలికంగా 0.60 టీఎంసీ నీటిని వదలనున్నారు. ఈ ఏడాది ఒక మోస్తరుగానే వర్షాలు కురియడంతో ప్రస్తుతం బాబ్లీ వద్ద కూడా నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో బాబ్లీ గేట్లు ఎత్తినా, కిందకు దించినా ఇరు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనంలో పెద్దగా మార్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. బాబ్లీ నీటి నిలువ సామర్థ్యం 2.74 టీఎంసీలుగా పేర్కొంటున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నీటిని వినియోగించుకునేలా ఈ బ్యారేజీని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ఏడాది అంతంతమాత్రంగానే వర్షాలు కురియడంతో ఎస్సారెస్పీలోకి పూర్తిస్థాయిలో వరద జలాలు చేరుకోలేకపోయాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన మీదట దాదాపు నాలుగు నెలల పాటు బాబ్లీ గేట్లు తెరిచి ఉంచిన సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 77 టీఎంసీల వరకే వరద జలాలు వచ్చి చేరాయి. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 1091.00 అడుగులు, 90 టీఎంసిలు కాగా, ప్రస్తుతం 1073.60 అడుగులు, 36.5టీఎంసీల వరకే నీటి నిల్వలు మిగిలి ఉన్నాయి. గతేడాది బాబ్లీ గేట్లు మూసివేసిన ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 1081.00 అడుగులు, 55.23టీఎంసీల నీరు ఉండింది. దీంతో రబీ సీజన్‌లో పంటలకు సరిపడా నీరందుతుందో లేదోనని ఆయకట్టు రైతులు ఒకింత ఆందోళనకు లోనవుతున్నారు. ఇంకనూ ఖరీఫ్ చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే ఉద్దేశ్యంతో కాకతీయ, ఫ్లడ్‌ఫ్లో కెనాళ్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా రబీ ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో నీటి నిల్వలు మరింతగా పడిపోనున్నాయి.
ఎస్సారెస్పీలో 5టీఎంసీల వరకు నీటిని డెడ్‌స్టోరేజీగా పరిగణించనుండగా, ఆవిరి రూపంలో రబీ సీజన్ నాటికి కనీసం ఐదారు టీఎంసీలు కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. మిగిలే నీటి నిల్వల నుండి మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాల కోసం 7టీఎంసీల వరకు అట్టి పెట్టనున్నారు. వీటన్నింటిని మినహాయిస్తే కేవలం రబీ పంటలకు 15టీఎంసీల వరకే నీటి నిల్వలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటలు చేతికందే వరకు నీటిని అందించడం సాధ్యపడదని ఆయకట్టు రైతుల్లో ఇప్పటినుండే బెంగ కనిపిస్తోంది. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేస్తుండడం పట్ల ఎగువ ప్రాంతాల రైతులు నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం..ఒక్కొక్కటిగా బాబ్లీ గేట్లను మూసివేస్తున్న దృశ్యం...