ఆంధ్రప్రదేశ్‌

రేపటినుండి ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 7: తునిలో కాపుల ఐక్యగర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లు ముఖ్యమంత్రి చంద్రబాబే సృష్టించారని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఆయనే బాధ్యుడన్నారు. తుని ఘటనలో జరుగుతున్న అరెస్టులకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి ఆందోళనకు దిగిన ముద్రగడ రాత్రి 8 గంటల సమయంలో విరమించారు. బుధవారం సాయంత్రంలోగా తుని ఘటనలో పెట్టిన కేసులన్నీ ఉపసంహరించాలని, లేని పక్షంలో గురువారం ఉదయం నుండి ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గోదావరి మహా పుష్కరాల ప్రారంభం రోజు రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు కూడా చంద్రబాబే కారణమన్నారు. ఆయన కోసం జరిపిన సినిమా షూటింగ్ కారణంగా 29 మంది మృతి చెందారని, ఈ ఘటనలో ప్రథమ ముద్దాయి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ‘ఆయనను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని, చట్టాలు ఆయనకు వర్తించవా... మాకు మాత్రమే వర్తిస్తాయా’ అని ముద్రగడ ప్రశ్నించారు. తుని దుర్ఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 మందిపై తుని దుర్ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయని, వీటన్నిటినీ బుధవారం సాయంత్రంలోగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

43మంది డాక్టర్లకు నోటీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 7: ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది వైద్యులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 220 మొదలు 262 వరకూ 43 జీవోలను విడుదల చేశారు. 15 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకువస్తే తీవ్రమైన చర్యలు తప్పవని కూడా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకం
మరో పక్క రెండు రోజుల క్రితం ఫుడ్ సేప్టీ అధికారుల నియామకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంగళవారం నాడు ఆగమేఘాల మీద 61 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 9 మంది అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు, 26 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 13 మంది ఆఫీసు సూపరింటెండెంట్లు, 13 మంది జూనియర్ అసిస్టెంట్లు నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కిర్లంపూడిలో పోలీసు వాహనంలోనే
ఆందోళనకు దిగిన ముద్రగడ

మళ్లీ ముద్‌‘రగడ’!

ఆరోసారి దీక్షకు సిద్ధమవుతున్న నేత
అప్రమత్తమైన ప్రభుత్వం
కాపు మంత్రుల ఎదురుదాడి

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్, జూన్7 :చంద్రబాబునాయుడు సర్కారుకు తలనొప్పిలా పరిణమించిన కాపు ఉద్యమం కొత్త మలుపు తిరగనుంది. నిన్నటి వరకూ కాపులను తక్షణమే బీసీ హోదాలో చేర్చాలని ఆమరణ నిరాహారదీక్ష చేసి, సర్కారుకు నిద్ర లేకుండా చేసిన కాపునాడు నేత ముద్రగడ తాజాగా మరో ఆమరణ దీక్ష ద్వారా సర్కారుపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం అమలాపురం, కిర్లంపూడిలో జరిగిన పరిణామాలతో అటు బాబు ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ముద్రగడకు వ్యతిరేకంగా కాపుమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మోహరించింది.తుని ఘటనకు కారకులుగా భావిస్తూ సీఐడి పోలీసులు అరెస్టు చేసిన 8 మంది కాపులను తక్షణమే విడుదల చేయాలని, తుని సభకు కర్త, కర్మ,క్రియ తానే కాబట్టి ముందు తనను అరెస్టు చేయాలంటూ ముద్రగడ మంగళవారం ఉదయం నుంచి చేసిన హడావిడి, కాపుజాతిలో అలజడి రేపింది. నష్ట నివారణకు దిగిన ప్రభుత్వం మంత్రులు గంటా, నారాయణ, చినరాజప్ప, ఎమ్మెల్యే బోండాను రంగంలోకి దించింది. వారితో ముద్రగడకు వ్యతిరేకింగా మాట్లాడించింది. ఈ సందర్భంగా నేతలు, పోలీసులు చేసిన ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. ముద్రగడ మీద కేసులు లేవని, ఆయనను అరెస్టు చేయలేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ప్రకటించగా, ముద్రగడ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే బోండా ఉమ సీఎం క్యాంపు ఆఫీసులో మీడియా వద్ద వ్యాఖ్యానించారు. అంటే దీనిపై ముద్రగడ అరెస్టుకు సంబంధించి, ప్రభుత్వం గందరగోళంలో ఉందన్న విషయం స్పష్టమయింది.
కాగా, కాపులను తక్షణమే బీసీల్లో చేరుస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల 5 రోజులు దీక్ష చేసిన ముద్రగడకు రాష్టవ్య్రాప్తంగా అనూహ్య మద్దతు లభించింది. దీనితో బాబు ఒక మెట్టు దిగి, ఆయన వద్దకు తోట త్రిమూర్తులు, తోట నరసింహంతోపాటు మంత్రి అచ్చెన్నాయుడును రాయబారం పంపించి, త్వరగా కమిషన్ నివేదిక వచ్చేలా చూస్తామని, కమిషన్‌లో ముద్రగడ సూచించిన వ్యక్తికి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి, దీక్ష విరమింపచేశారు.
నిజానికి ఆమరణదీక్షలు ముద్రగడకు కొత్తేమీ కాదు. నిబద్ధతగల నేతగా పేరున్న ముద్రగడ వ్యూహం చివరి వరకూ ఎవరికీ తెలియదు. కాపుల కోసం ఆయన దీక్ష చేయడం ఇది నాలుగవసారి. కోట్ల హయాంలో కాపులను బీసీల్లో చేర్చాలని 13 రోజులు దీక్ష చేయగా, ప్రభుత్వం జీఓ నెం 30 ఇచ్చింది. ఎన్టీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అనుచరులను 18 మందిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఉత్తరకంచి ఉద్యమం చేపట్టారు. లంపకలోవ అనే గ్రామంలో నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చినందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేస్తే, వారి విడుదల కోసం 6రోజులు దీక్ష చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఒక్కొక్కరికీ 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది. వైఎస్ హయాంలో పోలవరం పుష్కరకాలువ తవ్వకాలతో, భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 7లక్షలు ఇవ్వాలని కోరుతూ 6 రోజులు దీక్ష చేశారు. మూసివేసిన తన రైస్‌మిల్లుకు 25 లక్షల కరెంటు బిల్లు పంపడంతో ఆగ్రహించి దీక్ష చేయడంతో అప్పటి ఐఎఎస్ అధికారి రేచల్‌చటర్జీ దిగివచ్చి, వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ తన ఇల్లు, సినిమాహాల్, అన్నింటికీ జనరేటర్ ద్వారానే కరెంటు తీసుకుంటున్నారు తప్ప, ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం లేదు. ఆవిధంగా అనుకున్న దానికోసం ఏదైనా సాధించే మొండితనం ఉన్న నాయకుడిగా పేరొందారు.ముద్రగడ తాజా ఉద్యమ నేపథ్యంలో ఆయనను అన్ని మార్గాల్లో దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆయనకు, వైఎస్సార్‌సీపీకి అనుబంధం ఉందన్న ప్రచారానికి పదునుపెట్టడం ద్వారా, ముద్రగడను నైతికంగా దెబ్బతీసే వ్యూహాన్ని కొనసాగిస్తోంది. తుని ఘటనలోనూ వైసీపీ కార్యకర్తలే ఉన్నారని, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తునికి ఎందుకు వచ్చారని ప్రచారం చేయడం ద్వారా, కాపులను ముద్రగడ నుంచి వేరు చేసే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

తుని ఘటనలో
ఏడుగురికి రిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూన్ 7: కాపుల ఐక్య గర్జన నేపథ్యంలో గత జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో చెలరేగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా భావిస్తున్న ఏడుగురు నిందితులను రిమాండుకు పంపారు. వీరిని సిఐడి పోలీసులు కాకినాడలోని సిఐడి కోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపరిచారు. ఇప్పటికే అరెస్టయిన తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం బిళ్ళనందూరుకు చెందిన లగుడు శ్రీనివాస్‌ను అందరికంటే ముందుగా సిఐడి కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్‌కు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండు విధిస్తూ మెజిస్ట్రేట్ కె శివశంకర్ తీర్పునిచ్చారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే అమలాపురం పట్టణానికి చెందిన దూడల మణీంద్ర అనే ఫణీంద్ర, గుంటూరు పట్టణానికి చెందిన గోపీ మహేష్, ఎం పవన్‌కుమార్, అంబాజీపేటకు చెందిన నక్కా సాయి, పిఠాపురం మండలం విరవాడకు చెందిన కూరాకుల పుల్లయ్య, కోలంకకు చెందిన శ్రీహరిబాబు అనే నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వీరికి ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితులపై 145, 149, 143, 307, ఐపిసి 3 అండ్ 4, 332, 109, 149, 7(1) సెక్షన్ల క్రింద క్రిమినల్ యాక్ట్ అమెండ్‌మెంట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అరెస్ట్‌ల పరంపర కొనసాగుతుందని సిఐడి అధికారులు చెప్పారు.

ప్రజాపోరు ఆపలేరు
టి.జెఎసి చైర్మన్ కోదండరాం
మంచిర్యాల, జూన్ 7: ప్రజా తెలంగాణ సాధనకు పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం ఉద్యమ సాగిస్తామని, ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. మంగళవారం మంచిర్యాలలోని ఎస్వీ ఫంక్షన్ హాలులో రెండేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ప్రభుత్వ తీరు తెన్నులపై ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ప్రజల అభ్యున్నతే తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ లక్ష్యమన్నారు. ప్రజల పక్షానే జెఎసి ఏర్పడిందని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన కార్యచరణతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జెఎసికి ఎవరి గుర్తింపూ, ఎవరో ఇచ్చే పదవులు అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్భ్రావృద్ధే తప్ప వేరే కోరికలు జెఎసికి లేవన్నారు. ఇప్పటికే నా జీవితంలో మాడొంతులు గడిచిపోయింది. మిగతా పావు జీవితంలో ఎవరి చేత ప్రేరేపించబడేది లేదు. జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకే కేటాయిస్తానని ప్రకటించారు. జెఎసి రాజకీయ సంస్థ కాదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వెల్లడించారు. తెరాస ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలపై బుధవారం నిర్వహిస్తోన్న టి.జెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించి సమాధానమిస్తామన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో మంత్రుల విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమాలు సాగుతాయని హెచ్చరించారు.