ఆంధ్రప్రదేశ్‌

అయోమయానికి పరాకాష్ఠ! (తరలింపు తిప్పలు-4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం రమ్మంటున్నారు.. కార్యదర్శులు వద్దంటున్నారు!
హైదరాబాద్‌లో ఇళ్లు ఖాళీ చేయాలా? వద్దా?
వస్తే లక్షలాది ఫైళ్లు ఎక్కడ పెట్టాలి? ఎలా తరలించాలి?
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాకే కదిలేదంటున్న ఉద్యోగులు

విజయవాడ, జూన్ 8: సెక్రటేరియట్, వివిధ శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ల ఉద్యోగుల తరలింపులో అయోమయం పరాకాష్ఠకు చేరుకుంది. ఓ పక్క అమరావతికి చేరుకోవలసిన ముహూర్తం దగ్గర పడుతోంది. మరోపక్క ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి సిగ్నల్ రాలేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. టన్నుల కొద్దీ ఉన్న ఫైళ్లను, ఫర్నీచర్‌ను ఏలా, ఎక్కడికి తరలించాలి? తాము హైదరాబాద్‌లో ఇళ్ళు ఖాళీ చేయాలా వద్దా? ఇళ్ళ యజమానులకు ఏమని సమాచారమివ్వాలి? వీటన్నింటికి తోడు ప్రధాని కార్యాలయం నుంచి రాష్టప్రతి వద్దకు చేరుకున్న స్థానికత ఫైలు ఏ రూపంలో తిరిగి వస్తుందో.. వంటి అంశాలేవీ తేలకుండా తాము ఏవిధంగా అమరావతికి వెళతామని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
స్పష్టత ఏదీ?
తరలింపు సమస్యలు అన్నీ కొలిక్కి వచ్చేశాయి. ఇక తరలి వెళ్లడమే తరవాయి అంటూ మీడియా ఊదరగొడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో.. సెక్రటేరియట్ ఉద్యోగులైనా, హెచ్‌ఓడిలైనా 27 నాటికి రావల్సిందేనని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎపి ఎన్‌జిఓ సంఘ నాయకుడు అశోక్‌బాబు మాట్లాడుతూ హెచ్‌ఓడి కార్యాలయాల భవనాలు దొరకాలి, వాటిని కార్యాలయాలకు అనుగుణంగా మార్చుకోవాలి. అందువల్ల ఆగస్ట్ 31వ తేదీలోగా హెచ్‌ఓడి కార్యాలయాలు ఇక్కడికి వస్తాయంటున్నారు. మరోపక్క కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలను ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో కలిసినప్పుడు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంత సమయం తీసుకుని వెళదామని అంటున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్ర అయోమయ పరిస్థితిలో పడిపోయారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఇళ్ళను ఖాళీ చేయాలా? వద్దా? అన్న మీమాంస ఉద్యోగులను వేధిస్తోంది.
లక్షలాది ఫైళ్ళను ఎలా తరలించాలి?
ఫైళ్లను తరలించడం ఉద్యోగులకు ఆశనిపాతంగా మారబోతోంది. ఫైళ్ల తరలింపు బాధ్యతను కన్సల్టెన్సీకి ఇచ్చినట్టు ప్రభుత్వ పెద్దలు గతంలో చెప్పారు. కానీ ఆ ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. ఒక్కో కార్యాలయంలో వేల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఇరిగేషన్ శాఖ హెచ్‌ఓడి కార్యాలయంలో ఫైళ్లు, ఫర్నీచర్‌ను తవలించడానికి కనీసం 30 లారీలు కావాలని చెపుతున్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి, రెవెన్యూ శాఖల్లో కూడా ఇంతకు మించిన ఫైళ్లు ఉన్నాయి. సగటున చూసుకుంటే, ఒక్కో హెచ్‌ఓడిలో ఫైళ్లు, ఫర్నీచర్ తరలించడానికి కనీసం 15 నుంచి 20 లారీలు అవసరం ఉంటుందని లెక్క వేస్తున్నారు. అంటే 110 హెచ్‌ఓడిల్లో ఫైళ్లను, ఫర్నీచర్‌ను తరలించడానికి కనీసం మూడు వేల లారీలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని శాఖలైతే ఎప్పుడు తరలి వెళతాయో తెలియక, ఆ శాఖ ఉన్నతాధికారులు తరలింపు లెక్క చేయనే లేదు. ఒకవేళ ఫైళ్లు అమరావతికి వెళ్లిపోయి, ఆ సమయానికి ఉద్యోగులు అక్కడికి చేరుకోపోతే, వాటిని ఎక్కడ ఉంచుతారు? ఈ విషయంలో ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడం గమనార్హం.
‘స్థానికత’పై ఏమొస్తుందో చూద్దాం!
స్థానికత ఫైలు ప్రధాని కార్యాలయం నుంచి రాష్టప్రతి వద్దకు వెళ్లింది. దీనిపై 10 రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. గతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో సవరణ చేసి 610 జిఓ తీసుకువచ్చారు. దీని ప్రకారమే ఉద్యోగుల విభజన జరిగింది. ఇప్పుడు మరో సవరణ కోసం పంపించారు. ఆ సవరణను అనుసరించి ప్రభుత్వం జిఓ జారీ చేస్తుంది. ఇది తమకు ఏమాత్రం అనుకూలంగా ఉంటుందో చూస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చెపుతున్నారు.
కళాశాలల సహకారం అనుమానమే!
ప్రస్తుతం హెచ్‌ఓడిలు, సెక్రటేరియట్ ఉద్యోగుల పిల్లలు ఇప్పటికే చాలా మంది హైదరాబాద్‌లోని వివిధ కళాశాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరారు. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు అమరావతికి రావల్సిన పరిస్థితి ఏర్పడింది.
సదరు విద్యార్థిని విజయవాడకు తీసుకువస్తే, హైదరాబాద్ కళాశాలకు చెందిన బ్రాంచ్‌లో ఇప్పటికే చెల్లించిన ఫీజును పరిగణలోకి తీసుకుని చేర్చుకుంటారా? ఈ సంగతి పక్కన పెడితే, హైదరాబాద్‌లో కళాశాలల నుంచి తమ పిల్లలను ఇప్పుడు బయటకు తీసుకురావాలంటే, రెండేళ్ల ఫీజు చెల్లించమని ఆయా కళాశాలల యాజమాన్యాలు వత్తిడి తెస్తున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిపై

రెండు దశల్లో సమగ్ర సర్వే

ఈ నెల 20 నుంచి 30 వరకు మొదటి దశ
జూలై 6 నుంచి 30 వరకు రెండవ దశ
పీపుల్స్ హబ్‌గా నామకరణం
సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో నివాసముండే ప్రతి కుటుంబానికి చెందిన ఆర్థిక, సామాజిక స్థితిపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 20నుంచి 30వ తేదీ వరకు, మళ్లీ వచ్చే నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. రెండు దశల్లో ఈ సర్వే ముగుస్తుంది. ఈ సర్వేలో ప్రతి కుటుంబాన్ని 75 ప్రశ్నలు అడుగుతారు. దాదాపు 30 వేల మంది మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా, లేదా లబ్ధిదారులకు మాత్రమే అందుతున్నాయా అనే వివరాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
ఇంతవరకు దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ తరహా సర్వేలు నిర్వహించాయి. ప్రజల నుంచి సేకరించిన ఈ డేటాకు పీపుల్స్ హబ్‌గా నామకరణం చేశారు. ఆధార్ డేటాలో 9 అంశాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ సమాచారాన్ని ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులు సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని స్టేట్ డాటా రెసిడెంట్ హబ్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్ని ప్రజాబాహుళ్యంలో ఉంచరు. అత్యంత గోప్యంగా ఈ సమాచారాన్ని ఉంచుతారు. సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆయాశాఖల ద్వారా క్రోడీకరిస్తారు. 75 ప్రశ్నల్లో 35 ప్రశ్నలకు సమాధానాలు రవాణాశాఖ, రెవెన్యూ రికార్డు, ఆధార్ కార్డుల్లో ఉన్నాయి. కాని వీటిని అనుసంధానం చేయాలంటే ప్రభుత్వానికి కత్తిమీద సవాలుగా మారింది. అలా కాకుండా ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా జోడించి అడగడం వల్ల ఒక కుటుంబం సమాచారాన్ని మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుందని ఐటి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆరోగ్యం, ఆర్థిక, అకడమిక్ డేటాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడి కానున్నాయి. మతం,కులం, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్లు, పెన్షన్లు, ఇంటి ఓనర్‌షిప్ హక్కులు, కరెంటు కనెక్షన్, మరుగుదొడ్లు, భూమి తదితర వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రజల స్థిర,చరాస్తుల వివరాలు కూడా 75 ప్రశ్నల్లో ఉన్నాయి. ఈ డేటాను ఓరాకిల్ సంస్ధ పర్యవేక్షిస్తుంది.