తెలంగాణ

అవినీతి మితిమీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని, అవినీతి మితిమీరిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో తాము పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినవని, కనుక రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్ గెలిచినా, కేసీఆర్ ప్రధాని కాలేరని , పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే నరేంద్రమోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. దేశ ప్రజలు 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను, 55 నెలల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనను భేరీజు వేసుకుంటారని, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అవినీతిలేని పాలన కొనసాగించారని, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు.
రైతు సంక్షేమానికి, వారి ఆదాయం, అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యమని, ఇటీవల 14 పంటలకు కనీస మద్దతు ఇవ్వడం ప్రధాని ఫసల్ బీమా పథకం, భూసార పరీక్షలు, దేశవ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ఇవ్వడం లాంటి అనేక చర్యలు మోదీ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా మంత్రివర్గం లేదని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్రంలో నిజాం తరహా నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ఈ తరహా పాలన వస్తుందని తాము చెప్పినా, ప్రృలు పట్టించుకోలేదని లక్ష్మణ్ నిశితంగా విమర్శించారు. మంత్రులు లేకపోవడం వల్ల వందల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి మితిమీరిపోయిందని, అన్ని శాఖల్లో డబ్బులు ఇస్తే కానీ పనులు జరగడం లేదని, తాము అవినీతి గురించి మాట్లాడితే , కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ భగ్గుమంటున్నారని, కానీ వారి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడారని, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, సబ్సిడీపై ట్రాక్టర్ల కేటాయింపు లాంటి వాటిలో డబ్బులు దండుకుంటున్నారని, వారి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తమ బంధువు పోస్టుమార్టం కోసం మూడు వేలు లంచం అడిగినట్టు రాష్ట్ర కౌన్సిల్‌లోనే తెలిపారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీని ఎన్నడూ వ్యక్తిగతంగా దూషించలేదని, ఢిల్లీ ధర్నాలో ఎంగిలి కప్పులు కడిగే వారిని దేశాన్ని అప్పగించారని పేర్కొనే పోస్టర్ పెట్టడం తీవ్రంగా ఖండించదగిందేనని , అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్నారని, ఆయన మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏపీలో ఆయన గెలిచే అవకాశం లేదని, అందుకనే అసహనంతో మాట్లాడుతున్నారని , ప్రాంతీయ పార్టీలు అన్నీ తమ కుటుంబం కోసమే పనిచేస్తాయని, దేశ సమస్యలు వారికి పట్టవని వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల వద్దకు బీజేపీ వెళుతోందని, ఇప్పటికే రెండు పార్లమెంటు క్లస్టర్ సమావేశాలు పూర్తి చేశామని, ఈ నెలలో అన్ని క్లస్టర్ సమావేశాలు పూర్తి చేస్తామని వెల్లడించారు.
దేశం కోసం మోదీ- మోదీ కోసం దేశం అనే నినాదంతో ఎన్నికల్లో పాల్గొంటామని, అన్ని మోర్చాల సమావేశాలూ నిర్వహిస్తున్నామని, మేరా పరివార్ - బీజేపీ పరివార్ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. మార్చి 2న అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో చింతాసాంబమూర్తి, జీ ప్రేమేందర్‌రెడ్డి, బీ జనార్ధన్‌రెడ్డి, ఎన్వీ సుభాష్, ఎ రాకేష్‌రెడ్డి, గోలి మధుసూధనరెడ్డి, సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్