తెలంగాణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 23: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలైన నల్లగొండ, భువనగిరి స్థానాల్లో పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి సాధించినట్టయ్యింది. ఉమ్మడి జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా తొమ్మిది స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ సీనియర్లు కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డిలను సైతం మట్టికరిపించిన టీఆర్‌ఎస్ పార్టీకి ఆరునెలల వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికలు టీఆర్‌ఎస్ అధిష్టానానికి షాక్ పుట్టించాయ. అసెంబ్లీ ఎన్నికల్లో, తదుపరి పంచాయతీ ఎన్నికల్లో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన కారు విజయాలకు పార్లమెంట్ ఎన్నికల్లో బ్రేక్ పడటం వెనుక కారణాలపై అధికార పార్ట వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుండి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందగా, అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు పుణ్యమా అని తృటిలో ఓటమి తప్పించుకుని స్వల్ప ఓట్లతో గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడం వెనుక మారిన ప్రజాభిప్రాయం..మార్పు కోరిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్ల చైతన్యం స్పష్టమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఇతర జిల్లాల్లో చేదు ఫలితాలు ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు ఉత్తమ్, కోమటిరెడ్డి గెలవడం ఆ పార్టీ భవిష్యత్ రాజకీయాలకు కొత్త ఊపునిచ్చేదిగా కనిపిస్తోంది. ఉత్తమ్ ఎంపీగా గెలిచి పీసీసీ చీఫ్ నుండి అగౌరవంగా తప్పుకోవాల్సిన పరిస్థితులను అధిగమించగా, కోరిన పదవుల దిశగా కోమటిరెడ్డి తన గెలుపుతో బాటలు వేసుకున్నారు.
ఓటమిపై అంతర్మథనం
అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానంలో పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యేగా ఉత్తమ్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాలు సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో కలిపి టీఆర్‌ఎస్‌కు లక్షా 226 ఓట్లు అధికంగా వచ్చాయి. ఐనప్పటికీ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డి తన ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ చేతిలో ఓటమి చెందారు. అలాగే భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్‌కు 40,076 ఓట్లు అధికంగా వచ్చాయి. నకిరేకల్‌లో కాంగ్రెస్ నుండి గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోగా, మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మినహా తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఐనప్పటికీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు.
కారు పదహారు నినాదాన్ని తిప్పికొట్టిన జిల్లా ఓటర్లు
నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ‘కారు పదహారు నినాదం’తో సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం సాగించినప్పటికీ ప్రజలు మాత్రం కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ ఎంపీ కంటే తమ ప్రతినిధిగా జాతీయ పార్టీకి చెందిన ఎంపీ ఉంటేనే మంచిదని భావించినట్టు ఫలితాల సరళి వెల్లడిస్తోంది. అదీకాక టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పోలింగ్ నాటికి ఉన్న నాలుగున్నర నెలల సమక్షంలో సీఎం కేసీఆర్ ఎన్నికల హామీ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే ప్రధానమన్నట్టుగా వ్యవహరించడం, వీటిపై ప్రతిపక్షాలు సాగించిన ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఆలోచింపచేశాయని భావిస్తున్నారు.
నల్లగొండలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి పూర్తిగా నియోజకవర్గం ప్రజలకు కొత్త కావడం, ఉత్తమ్ నియోజకవర్గం ప్రజలకు సుపరిచితుడవ్వడం, కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ దిశగా ఉత్తమ్ గెలుపును జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ గెలుపుకు ఉపకరించాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా వేమిరెడ్డి గెలుపునకు సంపూర్ణ స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఆయన ఓటమికి కారణమైంది. వేమిరెడ్డి ఓటమి జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి జీర్ణించుకోలేని అంశం. అటు టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావును పక్కన పెట్టడం, ఎంపీ గుత్తాకు పదవి ఇవ్వకపోవడంతో వీరి వర్గాలు ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేదన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.
ప్రజల్లో సంక్షేమ పథకాలపై ఆదరణ ఉన్నప్పటికీ ఎవరిని ఎంపీ అభ్యర్ధిగా పెట్టినా గెలిపించాలంటూ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల ధోరణిని చైతన్యవంతమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తమ విలక్షణ తీర్పుతో తిరస్కరించినట్లయ్యింది. వీటికి తోడు విద్యావేత్తలు, నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో వ్యతిరేకత టీఆర్‌ఎస్‌ను నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి దిశగా నడిపించాయి.
భువనగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గెలుపుకు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సహకారం అందించకపోవడం ఆయన ఓటమికి దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కారణమైన టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాల ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల కులపరంగా చీలిపోవడం, ఎంపీగా తన పదవీ కాలంలో బూర తన వర్గీయులకు పెద్దపీట వేయడం వంటి సమస్యలు బూర ఓటమికి, వెంకట్‌రెడ్డి గెలుపుకు దోహదం చేశాయి. టీఆర్‌ఎస్‌లోని వర్గాలు సైతం ప్రత్యర్థి పార్టీకి సానుకూలంగా మారాయి. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో పనె్నండింటిలో తొమ్మిది స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్ ఆరునెలలు తిరక్కుండానే రెండు పార్లమెంట్ స్థానాల్లో ఓడి ఆత్మవిమర్శలో పడింది. ఇదే సమయంలో పోగొట్టుకున్న చోటే దక్కించుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి తమ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్ల ధోరణి చూస్తుంటే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అంచనాలకు గండి కొట్టి అనూహ్య విజయాలు అందుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్థానిక ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటం మరింత ఆసక్తికరం.