తెలంగాణ

బృహత్ శిలాయుగం ఆనవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్లుగా మరుగున పడిన ప్రాచీన చారిత్రాక ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఆది మానవుడి కాలం నుండి నిజాం కాలం వరకు ఉన్న చారిత్రాక ఆనవాళ్లు, సంపదలను, గుడులు, గడుల వివరాలను సేకరించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం వైపు నుండి పురావస్తు శాఖ, ఇటు తెలంగాణ జాగృతి, కొత్త తెలంగాణ చరిత్ర సంస్థలు తెలంగాణ పూర్వ చరిత్ర అనే్వషణను ఇటీవల ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ముందుగా నల్లగొండ జిల్లా పరిధిలోని తిప్పర్తి మండలం పజ్జూరు, ఎరగడ్లగూడెం, నల్లగొండ మండలం అప్పాజీపేటలో ఆదిమానవుల సమాధులు(శిస్త్), మెన్‌హీర్‌లను గుర్తించారు. ఇటీవల పాటిగడ్డలో బృహత్ శిలాయుగం నాటి బౌద్ధ చైత్యాలు, ఆదిమానవుల ప్రాచీన సమాధులు (రాక్షసగుండ్లు), మెన్‌హిర్ సమాధులు బయల్పపడగా తవ్వకాల్లో ఆనాటి చరిత్ర ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయి.
కొత్తగా ఎరగడ్లగూడెంలో రైతు ముసుగు మాధవరెడ్డి తోటలో గండ శిలలతో కూడిన 235 అడుగుల వృత్తంతో, ఎదుటిరాళ్ల మధ్య దూరం 77 అడుగుల వ్యాసం, చుట్టుపరిచిన మూడు నుండి ఆరు అడుగుల పరిమాణంలో ఉన్న 50 గండ శిలలతో నిర్మితమైన భారీ ప్రాచీన సమాధిని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, సుజీత్‌సింగ్ శనివారం సమాధిని పరిశీలించి బృహత్ శిలాయుగం నాటి భారీ సమాధిగా నిర్ణయించారు. సముద్ర మట్టానికి 140 మీటర్ల ఎత్తున ఇంత భారీ వైశాల్యంతో నిర్మించిన ఈ సమాధి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాచీన సమాధిగా భావిస్తున్నామన్నారు. ఎరగడ్లగూడెం ప్రాచీన సమాధి ప్రపంచ ప్రాచీన చరిత్రలో తెలంగాణను నిలిపే చరిత్రాక ఆనవాలు అవుతుందన్నారు. విశ్రాంత పురావస్తు అధికారులు భానుమూర్తి ఇంత భారీ ప్రాచీన సమాధిని ఎక్కడా చూడలేదన్నారు. పజ్జూరు, ఎర్రగడ్లగూడెంలలో సమాధులు, బౌద్ధ చైత్యాలు క్రీ.పూ.2వ శతాబ్దం నుండి క్రీ.శ.2వ శతాబ్దం మధ్య బృహత్ శిలాయుగం, శాతావాహన కాలం నాటివని పురావస్తు బృందం నిర్ధారించింది. కాగా, గతంలో వరంగల్ జిల్లా రాయపర్తి తిరుమలాయపల్లిలో 50 అడుగుల వ్యాసంతో, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 40 అడుగుల వ్యాసంతో ఉన్న ప్రాచీన సమాధులు గుర్తించారు. అప్పాజీపేట గ్రామం నలుమూలల వందల ఎకరాలలో అక్కడక్కడ బృహత్ శిలాయుగం నాటి ప్రాచీన సమాధులు, దేవాలయాలు, పాటిగడ్డలను తాజాగా గుర్తించారు. వాటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు పరిశీలించి విలువైన ఈ చారిత్రాక ఆనవాళ్లను పురావస్తుశాఖకు అందించి ప్రాచీన తెలంగాణ చరిత్ర వైభవాన్ని వెలుగులోకి తెస్తామన్నారు. పజ్జూరులో జరుపుతున్న త్రవ్వకాల్లో సీసం, రాగి, కాల్చిన మట్టి ఇటుకలు, పూలు, శంఖపు గాజులు, మృణ్మయ పాత్రలు, మట్టిబొమ్మలు లభించాయి. ఇప్పటికే ఈ తవ్వకాలను పురావస్తు డైరెక్టర్ రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్ సందర్శించి మరింత లోతైన చరిత్ర పరిశోధనకు ఈ ప్రాంతంలో తవ్వకాలను కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో జిల్లా పరిధిలో నాగార్జునసాగర్, ఫణిగిరి, గాజులబండ, వర్ధమానుకోట, తిరుమలగిరి, నాగారం, పానగల్, వలిగొండ (మూసీ), ఆలేరు, ఆత్మకూర్ (ఎస్), కట్టంగూర్‌లలో ఆది మానవుల కాలం, బృహత్ శిలాయుగం, శాతవాహన కాలం వరకు ఉన్న ప్రాచీన చారిత్రక సంపద వెలుగుచూడడం విశేషం.

చిత్రం ఎర్రగడ్లగూడెంలో వెలుగుచూసిన అతిపెద్ద బృహత్ శిలాయుగం నాటి ప్రాచీన సమాధి