రాష్ట్రీయం

అడుగంటుతున్న సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూన్ 16: నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం కనీస నీటిమట్టం కంటే తగ్గుతూ దీన స్థితిలో ఉంది. సాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులు కాగా కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం కనీస నీటి మట్టానికి మరో రెండు అడుగులు తగ్గి సాగర్ ఆయకట్టు రైతులలో ఆందోళన నింపుతోంది. ప్రస్తుతం తాగు నీటి అవసరాల నిమిత్తం కూడా సరిపోని పరిస్థితులలో సాగర్ జలాశయం ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు సూచనల మేరకు సాగర్ జలాశయ కనీస మట్టం 510 అడుగుల నుండి ఐదు అడుగుల తగ్గేంతవరకు తాగు నీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని చెప్పడంతో కనీస మట్టం నుండి రెండు అడుగులు తగ్గే వరకు ఇప్పటికే వినియోగించుకున్నారు. మరో మూడు అడుగులు మాత్రమే సాగర్ జలాశయానికి నీరు వచ్చేంతవరకు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాలువలకు పూర్తిగా నీటిని నిలిపివేశారు. దీంతో పాటు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి కూడా ఎటువంటి నీరు విడుదల కావడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 825 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండ తీవ్రతకు జలాశయంలో 589 క్యూసెక్కుల నీరు రోజుకు సగటున ఆవిరైపోతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 806.30 అడుగుల నీటి మట్టం ఉండగా సాగర్ జలాశయంలో 508.20 అడుగులుగా ఉంది. ఇది 128.63 టీఎంసీలకు సమానం. జూన్ చివరి వారంలో కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు పడి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నీరు చేరితేనే సాగర్ ఆయకట్టు కాలువలకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. గత ఐదు, ఆరు సంవత్సరాల నుండి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా కృష్ణానది ఎగువ ప్రాంతంలో జూలై, అగస్టు మాసాల్లో వర్షాలు ఆలస్యంగా పడిన సందర్భాలున్నాయి. వర్షాలు సకాలంలో పడకుంటే సాగర్ ఆయకట్టు రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

చిత్రం...508 అడుగులకు తగ్గిన సాగర్ నీటిమట్టం