రాష్ట్రీయం

రూ. 45 వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: దేశంలోనే మొదటిసారిగా రూ 45 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మిషన్ భగీరథ పనులను జూలై 15 లోపు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 24 వేల గ్రామాలలో ఇప్పటివరకు 8వేల గ్రామాలలోని ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మిగిలిన 16 వేల గ్రామాలలో పెండింగ్‌లో ఉన్న పైప్‌లైన్లు, ఇంట్రావిలేజ్, ఇంటింటికీ నల్లా బిగించే పనులు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం హన్మకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఆర్‌డబ్ల్యుఎస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ నియోజకవర్గాలవారీగా పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తి స్ధాయిలో నూరు శాతం పనులు పూర్తి అయి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నట్టు గ్రామ సభలో తీర్మానం చేయించి పంపినప్పుడే సంబంధిత బిల్లుల చెల్లింపు చేస్తారని తెలిపారు. ఈ విషయంలో తప్పుడు నివేదికలిచ్చిన సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు కల్పించినట్లు తెలిపారు. అదే విధంగా ఆయా మండలాలు, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలు, రెండు పడకల గదుల ఇళ్లకు కేజీబీవీలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ పొడిగింపునకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. భగీరథ పైప్‌లైన్లు, ఇంట్రావిలేజ్ పనుల కోసం తవ్విన రోడ్లను పునరుద్ధరించాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లదేనని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు కూడా ఈ అంశాన్ని ధృవీకరించాలని తెలిపారు. శివారు గ్రామంలో చివరి ఇంటికి నల్లా ఇచ్చేందుకు పైప్‌లైన్ పొడిగింపునకు పనులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌భగీరథ పథకం పట్ల ప్రజలకు జవాబు చెప్పగలిగే విధంగా నాణ్యతగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేయని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంజనీరింగ్ అధికారులను తక్షణమే బాధ్యతల నుండి తప్పించాలని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నూరు శాతం కుటుంబాలకు పక్కాగా తాగునీరు అందించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు అధికార బృందాలు తరచుగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ వల్లనే ఈ వేసవిలో ఏర్పడిన గడ్డు పరిస్థితిని అధిగమించామని తెలిపారు. అక్కడక్కడా మిగిలిన అంతరాలను, పనులను పూర్తి చేసేందుకు శాసనసభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో వ్యవహారించాలని రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులకు సూచించారు. 57 ఏళ్లకు కుదించిన వయో పరిమితి ప్రకారం జూలై 1 నుంచి నెలకు 2016 రూపాయలు ఆసరా పింఛన్లను ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంజూరు చేసిన రెండు పడకల గదుల ఇళ్లను నూరు శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్ధాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కు, డీఆర్‌డీవో రాములకు మెమొంటోను, ప్రశంసాపత్రాలను అందజేశారు. జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎంపీ పసునూరు దయాకర్, శాసనమండలి సభ్యులు కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు