తెలంగాణ

ముంచెత్తిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 28: ఆలస్యంగానైనా నైరుతి కరుణించడంతో తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తుంటే, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలు ఖరీఫ్ రైతుకు ఊపిరి పోస్తుంటే, అనేకచోట్ల జనజీవనాన్ని స్థంభింపచేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వాన కురిసింది. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించగా, నిన్నటి వరకు ఏడారిని తలపించిన చెరువులు, రిజర్వాయర్లలోకి వరదనీరు చేరడంతో ఖరీఫ్ పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయంకాగా లోతట్టు కాలనీల్లో వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలో మంగళవారం 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, శ్రీరాంపూర్, జైపూర్, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కుండపోత వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. కోటపల్లి మండలంలోని పాలవాగు ఉప్పొంగి ప్రవహించడంతో చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని 35 గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. సింగరేణిలోని శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ ఓపెన్ కాస్టు గనుల్లోకి వరదనీరు చేరడంతో రెండు షిప్టుల్లో 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి కంపెనీకి పెను నష్టం సంభవించింది. మరోవైపు తలమడుగు, తాంసి, ఆదిలాబాద్, బోథ్ మండలాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా అనకుంట, బంగారుగూడెం, బజార్‌హత్నూర్ వాగులు ఉప్పొంగి ప్రవహించి, గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. బేల మండలం సిర్సన్న వద్ద భారీ వర్షానికి లారీ రోడ్డుపై కూరుకుపోవడంతో మంగళవారం ఆదిలాబాద్ కేంద్రానికి నాలుగు గంటలపాటు రాకపోకలు స్థంభించాయి. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట వద్ద ఆర్టీసి మంగళవారం ఉదయం భారీ వర్షానికి అదుపుతప్పి కల్వర్ట్ కిందికి బోల్తా కొట్టడంతో 12మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి వివిధ వాగులగుండా భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో 276 మీటర్ల గరిష్టస్థాయికి వరదనీరు చేరి జలకళ ఉట్టిపడుతోంది. బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి సమీపంలోని బల్హాన్‌పూర్ వాగు వంతెనపై నుండి వరద నీరు ఉప్పొంగడంతో ఇచ్చోడ నుంచి బజార్‌హత్నూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఇచ్చోడ గిర్నూర్ మీదుగా ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ వాహనాలను నడిపించారు. ఇదిలావుంటే జిల్లాలో 12 మండలాల్లో సాధారణం కంటే అధికస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వాతావరణ నిపుణులు చెప్పారు.

చిత్రం... ఆదిలాబాద్ జిల్లాలో
వంతెనపై నుండి ఉప్పొంగి
ప్రవహిస్తున్న బల్హాన్‌పూర్ వాగు
ఏమాయికుంట వద్ద
బోల్తాపడిన ఆర్టీసీ బస్సు