రాష్ట్రీయం

పరిశ్రమలు, ఐటీ రంగాల్లో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించాలని, ఈ ముసుగులో రాష్ట్భ్రావృద్ధిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, ఇది మంచి సంప్రదాయం కాదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అద్భుతమైన ఫలితాలతో, అభివృద్ధితో దూసుకుపోతోందని, టీఎస్ ఐపాస్ వల్ల రాష్ట్రంలో గత ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 10.993 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 12 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విద్యుత్ కొరత లేదని, తెలంగాణ ఏర్పడిన
తర్వాత ఇన్వర్టర్లు, జనరేటర్ల పరిశ్రమలు, కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే దివాలా తీసినట్లు ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. శుక్రవారం ఇక్కడ అసెంబ్లీలో దేవాదాయ, పరిశమ్రలు, కార్మిక సంక్షేమం, పర్యాటక రంగం పద్దులను సభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగా రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని, నక్సలైట్లు విజృంభిస్తారనే ప్రచారం జరిగిందన్నారు. కానీ, ఈ విష ప్రచారం చేసిన వాళ్లకు గట్టి బుద్ధి చెప్పే విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. 2015లో ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ వల్ల పరిశ్రమల రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఖాయిలాపడిన పరిశ్రమలను ఆదుకునేందుకు రూ. 332 కోట్లతో నిధిని ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో జీనోమ్ వ్యాలీ, కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ, రక్షణ రంగ సంస్థలలు వచ్చాయని చెప్పేందుకు తాను సందేహించనని, కానీ, 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత రాష్ట్రం విశేషమైన అభివృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ అభివృద్ధిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయరాదని ఆయన విపక్షపార్టీలను కోరారు.
హరిత విప్లవం, నీలి విప్లవం, పింక్ విప్లవం (మాంస ఆహార ఉత్పత్తులు), శే్వత విప్లవం (డెయిరీ రంగం)లో తెలంగాణ దూసుకెళుతోందని కేటీఆర్ అన్నారు. గత ఐదేళ్లలో 59 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 49 ఎకరాలను సేకరించామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు 7660 ఎకరాల భూసేకరణ పూర్తయిందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు తీసుకుని నిర్లక్ష్యం చేసిన పరిశ్రమల నుంచి 1,234 ఎకరాలను వెనక్కు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బోయింగ్, ఆర్‌పీజీ, హెలికాప్టర్ పనిముట్లు, రిఫైల్ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు. మైనింగ్ రంగంలో కూడా సంచలన విజయాలు సాధించామన్నారు. గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ ద్వారా రూ. 7,376 కోట్ల ఆదాయం వస్తే, టీఆర్‌ఎస్ పాలనలో ఐదేళ్లలో అది రూ.16,937 కోట్లకు పెరిగిందన్నారు. ఇసుక విక్రయాల ద్వారా అంతకు ముందు పదేళ్లలో కేవలం రూ.39.66 కోట్ల ఆదాయం వస్తే, గత ఐదేళ్లలో రూ.2842 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దండుమల్కాపూర్‌లో అతి పెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటుచేస్తామని చెప్పారు. చౌటప్పుల్ పరిసరాల్లో కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలను ఫార్మాసిటీకి తరలిస్తామని హామీ ఇచ్చారు.
వాగ్వాదం..
పరిశ్రమలపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘మీరు ఏ పార్టీలో ఉన్నారు’ అనే అర్థం వచ్చేవిధంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నాననే విషయంపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారన్నారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ గతంలో తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందని, రాజస్థాన్‌లో బీఎస్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారని, దీనిపై ఏమి మాట్లాడుతారని ప్రశ్నించారు. అనంతరం స్పీకర్ జోక్యం చేసుకుని, చర్చ పద్దులకే పరిమితం కావాలని రాజ్‌గోపాల్ రెడ్డిని కోరారు.