తెలంగాణ

పెన్‌గంగ.. ప్రాణహిత ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూలై 12: ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుండి పోటెత్తిన వరదలతో ఆదిలాబాద్ జిల్లా అస్తవ్యస్తమైంది. జిల్లా సరిహద్దులోని గోదావరి, పెన్‌గంగా, ప్రాణహిత నదులు పోటెత్తి ఉధృతంగా ప్రవహించడంతో బ్యాక్‌వాటర్ కారణంగా లోతట్టు గ్రామాలు మంగళవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాత్రి వరకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. మంగళవారం ఉదయం మరో 12 వేల క్యూసెక్కుల నీటిని వదలగా కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి గరిష్ట నీటిమట్టం 700 అడుగులకు గాను 696 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచారు. దీంతో రాయపట్నం వరకు గోదావరి ఉరకలేస్తూ పోటెత్తి ప్రవహించింది. రాయపట్నం మీదుగా ఉదయం 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సరిహద్దులోని పెన్‌గంగా నది ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చడంతో జైనథ్ మండలం ఆనంద్‌పూర్ వంతెన పైనుండి వరద నీరు పోటెత్తి సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్‌గంగా బ్యాక్‌వాటర్ కారణంగా బేల మండలంలోని సాంగిడి, మణియార్‌పూర్, బెదోడ, బాబి, కామ్‌దర్‌పూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. పెన్‌గంగా బ్యాక్‌వాటర్ ముంచెత్తడంతో జైనథ్, బేల మండలాల్లోని 600 ఎకరాల్లో పత్తి, సోయా, కంది పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారు.
మరోవైపు తూర్పు జిల్లాలోని వేమనపల్లి మండలంలో ప్రాణహిత పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చడంతో వేమనపల్లి, నీల్వాయి ప్రాంతాల్లోని 24 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అత్యవసర పనులపై వెళ్ళాల్సినవారు నాటుపడవలపైనే భారం వేసి ప్రయాణం సాగించారు. నిల్వాయి మత్తడిపై నుండి వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. సుమారు 450 ఎకరాల్లో పంటలు నీటమునిగి నష్టపోవాల్సి వచ్చింది. సిర్పూర్‌టి మండలం తాటిచెట్టు ఒర్రె వంతెన పైనుండి పెన్‌గంగా బ్యాక్‌వాటర్ ముంచెత్తడంతో సిర్పూర్‌టి మండలం నుండి ఇతర గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. దీంతో ఎండ్లబండ్లపైనే ప్రజలు రాకపోకలు సాగించారు.
ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటి వరకు 307 మి.మీటర్ల సాధరణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రికార్డుస్థాయిలో 537.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు.

నీట మునిగిన
రాయపట్నం వంతెన

ధర్మపురి, జూలై 12: గోదావరి నదీ పరివాహక ప్రాంత ఎగువన కురిసిన భారీ వర్షాల నీరు ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టులోకి చేరుతుండగా లక్ష క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలిన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరిగింది. కడెం ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి 700 అడుగులు కాగా, ఇటీవలి కాలంలో అత్యధికంగా 696.5 అడుగుల నీటి సామర్థ్యానికి చేరుకోగా, ఇన్ ఫ్లోగా వస్తున్న అదనపు నీటిని పరిస్థితులకు అనుగుణంగా అవుట్‌ఫ్లోగా వదిలిన క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక సదరు నీరు ధర్మపురి ప్రాంతానికి చేరింది. ప్రాజెక్టు కింది, గోదావరి ఎగువ ప్రాంత వర్షపు నీరు కడెం నుండి వదిలిన నీటితో కలిసి ధర్మపురి ప్రాంతానికి చేరగా నది మట్టం గణనీయంగా పెరిగింది. మంగళవారం ఉదయం ధర్మపురి క్షేత్రంలో శ్రీసంతోషిమాత ఆలయం ముందు భాగాన గల పుష్కర మెట్లను నదినీరు తాకింది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల తర్వాత కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాను కలిపే రాయపట్నం వంతెన పైనుండి నీరు ప్రవహించడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పరచి, రాకపోకలను నియంత్రించారు. మంగళవారం సాయంత్రానికి కడెంలో 696.3 అడుగుల ఎత్తుతో 13 వేల క్యూలెక్కల ఇన్‌ఫ్లో ఉండగా, ఒకేగేట్ ద్వారా 12 వేల కూసెక్కులను వదిలారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రం వద్ద పుష్కర ఘాట్లను తాకిన గోదావరి.. వరంగల్‌లోని రాంనగర్ లోలెవల్ వంతెన వద్ద పడవలో ప్రయాణిస్తున్న లోతట్టు ప్రాంతవాసులు... ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌టి మండలం తాటిచెట్టు ఒర్రె ఉప్పొంగడంతో ఎడ్లబండ్లపై రాకపోకలు సాగిస్తున్న దృశ్యం