తెలంగాణ

గులాబీకే ‘హుజూర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోరులో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజేతగా నిలిచారు. అభివృద్ధి నినాదంతో పోటీ చేసిన అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓటర్లు ఆదరించడంతో ఆ పార్టీ అవిర్భావం తర్వాత తొలిసారిగా హుజూర్‌నగర్ గడ్డపై గులాబీ జయకేతనం ఎగురవేసింది. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల తేడాతో గెలుపొందారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు, పద్మావతికి 69,737 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి
కోట రామారావు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు మాత్రమే పోలవ్వగా, వారిద్దరూ డిపాజిట్లు కోల్పోయారు. తన భూసమస్య పరిష్కారాన్ని కోరుతూ ఉప ఎన్నికలో పోటీ చేసిన నియోజకవర్గంలోని మంచతండా గిరిజన రైతు స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమన్ 2,697 ఓట్లతో బీజేపీ, టీడీపీ అభ్యర్థులను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉప పోరులో 13 రాజకీయ పార్టీల అభ్యర్థులు, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 28 మంది పోటీపడగా ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థినే గెలిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు గందరగోళంతో అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి దూరమైన విజయం ఈ ఉప ఎన్నికలో దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.
రికార్డు మెజారిటీతో సైదిరెడ్డి గెలుపు
హుజూర్‌నగర్ పాత నియోజకవర్గం 1952(ద్విసభ) ఎన్నిక, అదే ఏడాది ఉప ఎన్నికతో పాటు 1957, 1962, 1967, 1972లలో జరిగిన ఎన్నికల్లో, కొత్త హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 2009, 2014, 2018, ఎన్నికలతోపాటు 2019 ఉప ఎన్నికతో కలిపి ఇప్పటిదాకా గెలిచిన అభ్యర్థులలో సైదిరెడ్డి సాధించిన 43,358 ఓట్ల ఆధిక్యతనే అధికం కావడం విశేషం. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి జయసూర్య 37,857 ఓట్లతో గెలుపొందగా, 2009లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపై 29,194 ఓట్లతో విజయం సాధించారు. నియోజకవర్గం చరిత్రలో టీడీపీ నాలుగుసార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. టీఆర్‌ఎస్ వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి సైదిరెడ్డి గెలుపుతో బోణీ కొట్టింది. ఈ దఫా ఉప ఎన్నికలో పోలైన 2 లక్షల 248 ఓట్లను 22 రౌండ్లుగా లెక్కింపు చేశారు. నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, నేరడుచర్ల మున్సిపాల్టీల పట్టణ ఓటర్లతోపాటు ఆయా మండలాల ఓటర్లు, మేళ్లచెర్వు, పాలకీడు, చింతలపాలెం, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల ఓటర్లు అంతా కారుకే జైకొట్టడంతో అన్ని రౌండ్లలోనూ సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై ఆధిక్యత కనబరిచారు. టీఆర్‌ఎస్‌కు ఏకంగా 56.45 శాతం ఓటర్లు మద్దతు పలకగా, కాంగ్రెస్‌కు 34.60 శాతం ఓటింగ్ నమోదైంది. హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన రికార్డు ఆ పార్టీకి సొంతమవ్వగా, కాంగ్రెస్ సీనియర్లు జానా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన టీఆర్‌ఎస్ ఈ దఫా ఉప ఎన్నికలో ఉత్తమ్ సతీమణి పద్మావతిని ఓడించి కాంగ్రెస్ సీనియర్ల ఓటమిని పరిపూర్ణం చేసింది.
మార్పు కోరిన హుజూర్‌నగర్ ఓటరు
ఉప ఎన్నికలో హుజూర్‌నగర్ ఓటర్లు మార్పు కోరుకున్న విషయం సైదిరెడ్డి గెలుపుతో స్పష్టమైంది. 2018 డిసెంబర్ 7న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఉత్తమ్ 7,466 ఓట్లతో గెలుపొందగా, ట్రక్కు గుర్తు గందరగోళం ఉత్తమ్‌కు గెలుపునకు దోహదం చేసింది. అయితే 2019 ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌కు 75,145 ఓట్లు, కాంగ్రెస్‌కు 88,138 ఓట్లు రాగా ఉత్తమ్‌కు 12,993 ఓట్ల మెజారిటీ లభించింది. ఉప ఎన్నికకు వచ్చేసరికి ఏకంగా ఉత్తమ్ సతీమణి 43,358 ఓట్లతో ఓడిపోయిన తీరు ఓటర్లు మార్పు కోరుకున్నారనడానికి నిదర్శనంగా కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కే లాభమని, టీఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ ప్రజలకు లాభమంటూ అభివృద్ధి నినాదంతో టీఆర్‌ఎస్ సాగించిన ప్రచారానికి ఓటర్లు సానుకూలంగా స్పందించినట్లు ఉప ఎన్నిక తీర్పు చెప్పకనే చెప్పింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన సంక్షేమ పథకాలు ఓటర్లతో పాటు మరో నాలుగేళ్ల పాటు ఆ పార్టీనే అధికారంలో ఉండనున్నందున అభివృద్ధికి అవకాశముంటుందన్న ఆలోచనతో ఓటర్లు గులాబీకే పట్టం కట్టారు. ఇదిలావుండగా, ఆర్టీసీ సమ్మె ప్రభావం, సీపీఐ మద్దతు ఉపసంహరణ వంటి అంశాలు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ విజయవకాశాలపై ప్రభావం చూపుతాయన్న విశే్లషణలన్నీ ప్రజాతీర్పులో కొట్టుకుపోయాయి. నిజానికి ఉత్తమ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగాను, పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం ఆయన గెలుపునకు కలిసివచ్చిందని, లేదంటే అప్పుడే ఆయన ఓడిపోయి ఉండేవారని వ్యాఖ్యానించిన టీఆర్‌ఎస్ నాయకుల వాదనకు ఈ ఉప ఎన్నిక ఫలితం బలం చేకూర్చింది. కాంగ్రెస్ హేమాహేమీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి, వీహెచ్, జానారెడ్డి వంటి నేతలంతా తరలివచ్చి సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారంటూ చేసిన ప్రచారాన్ని హుజూర్‌నగర్ ఓటర్లు పట్టించుకోలేదు.
బీజేపీ, టీడీపీల డిపాజిట్లు గల్లంతు
ఉప ఎన్నికలో భారీగా ఓట్లు చీల్చుతాయని భావించిన బీజేపీ, టీడీపీ డిపాజిట్లు సైతం కోల్పోగా బీజేపీకి గత అసెంబ్లీల్లో 1,555 ఓట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 3,251 ఓట్లు పడగా, ఇప్పటి ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కోట రామారావుకు మాత్రం 2,639 ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం. కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రచారం సాగించినా..మోదీ హవా వీస్తున్నా పార్టీకి ఓట్ల శాతం పెరగకపోవడం కమలనాథులను నిరాశపరిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన టీడీపీ ఈ ఉప ఎన్నికలో పోటీకి దిగగా ఆ పార్టీ అభ్యర్థి చావ కిరణ్మయికి 1,827 ఓట్లు మాత్రమే రావడం తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్ధకం చేసింది. ఉప పోరులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య సాగిన ముఖాముఖి పోటీ నేపథ్యంలో ఇతర పార్టీల ఓటర్లంతా ఆ రెండు పార్టీల వారిగా చీలిపోయారు.

*చిత్రం... ఎన్నికలో గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న సైదిరెడ్డి