తెలంగాణ

ఎప్పటికీ ప్రజలు మా వెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: హుజూర్‌నగర్‌లో సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్ధరహిత ప్రశ్నలకు ప్రజలే తగిన సమాధానం చెప్పారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ విజయం ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో
తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే తమ హుజూర్‌నగర్ ఉప పోరులో ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు. ప్రజలకు సరైన పరిపాలన అందిస్తే వారే కడుపులో దాచుకుంటారని పదే పదే సీఎం చెప్పేదానికి, ప్రజలపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం ఆ ఎన్నికని అన్నారు. ఈ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయిందన్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయిందన్నారు. గత కొంత కాలంగా బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు, పెద్ద పెద్ద మాటలు, ప్రచార పటాటోపం ఏంటో తేలిపోయిందన్నారు. కాగా, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు కూడా గాలివాటంతో గెలిచినవేనని కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఏమిటో ప్రజలు మరి ఓట్లతోనే సమాధానం చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థికన్నా బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ ఎన్నికతో తెలంగాణ రాష్ట్ర సమితిపైన, పార్టీ శ్రేణులపైన మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా హుజూర్‌నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ హుజూర్‌నగర్ వంటి ఫలితానే్న సాధించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ప్రణాళికాబద్ధంగా పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఫలితం సీఎం కేసీఆర్ నాయకత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితమని అభివర్ణించారు. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం, టీఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ నియోజకవర్గానికి లాభం అని కేటీఆర్ ఇచ్చిన నినాదానికే ప్రజలు నీరాజనాలు పలికారన్నారు. ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషిని కేటీఆర్‌తో పాటు మంత్రులు ప్రత్యేకంగా కొనియాడి అభినందనలు తెలిపారు.
*చిత్రం... కేటీఆర్‌ను కలిసిన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తదితరులు