తెలంగాణ

ఆర్టీసీ సమ్మె వివాదానికి ముగింపు పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 8: గడచిన 35రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వివాదానికి ముగింపు పలికేందుకు హేతుబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును తెరాస అసమ్మతి నేతగా ముద్రపడ్డ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆర్టీసీ సమ్మె విషయమై శుక్రవారం ఆయన ముఖ్యమంత్రికి పంపిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులు నెల రోజులకు పైగా కొనసాగిస్తున్న సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేఖలో పేర్కొంటూనే, సమ్మె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని డీఎస్ సుతిమెత్తగా ఆక్షేపించారు. పంతాలు, పట్టింపులను వీడి సమ్మెను పరిష్కరించాల్సిన ఆవశ్యకత గురించి ఓ సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నేత హోదాలో నొక్కి చెప్పారు. ముందుగా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ప్రకటిస్తూ వారిలో విశ్వసనీయతను పెంపొందింపజేయాలని, తద్వారా సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి కార్మికుల న్యాయమైన కోర్కెలను అంగీకరించి సమ్మె వివాదానికి ముగింపు పలకాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్న తెలంగాణ ప్రజానీకం సైతం సీఎం నిర్ణయాన్ని హర్షిస్తారని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కోసం కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరమరుగు అవుతాయని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అభిలషించారు. నిజానికి సంస్థ మనుగడ కోసం ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం కొనసాగిస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని డీఎస్ అభిప్రాయపడ్డారు. ‘లక్ష్య సాధనలో ఎప్పుడూ శృతి మించకు... ఎవరికీ తల వంచకు’ అన్న రీతిలో వారు పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయోననే ఆందోళనకర పరిస్థితుల్లో సైతం కార్మికులు పిల్లాపాపలతో రోడ్డెక్కి యావత్ కుటుంబమంతా మొక్కవోని ధైర్యంతో ఉద్యమిస్తుండడం తెలంగాణ మట్టిలోని పోరాట పరిమళాలను వెదజల్లుతోందన్నారు. ఉద్యోగ భద్రత పేరిట 48వేల మంది కార్మికుల మెడ పై కత్తి పెట్టినా, కనీసం ఒక్క శాతం ఉద్యోగులు కూడా తలవంచక నిలబడిన వైనంలో తెలంగాణ శౌర్యం ప్రతిబింబిస్తోందని డీఎస్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏ సంస్థను అయినా ఎలా నడపాలి అన్న విషయంలో ముఖ్యమంత్రికి విశేష అధికారులు ఉంటాయని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్న ఏపీఎస్‌ఆర్‌టీసీ విభజన, ఆస్తుల పంపకం పూర్తిగా జరుగకముందే, సంస్థలో వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదాన్ని పొందకుండానే ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడం సరి కాదని, ఈ విషయం సీఎం కేసీఆర్‌కు తెలియనిది కాదని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఆర్టీసీ పోరు బిడ్డల పట్ల సీఎం కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా, కఠిన రీతిలో వ్యవహరించడాన్ని బట్టి చూస్తుంటే దీని వెనుక ఎవరిదైనా కుట్ర ఉందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు ఎవరికీ తలవంచరు అనే విషయం కేసీఆర్ తెలుసునని, అయినా కూడా ముఖ్యమంత్రి ద్వారానే నేరుగా ఆర్టీసీ కార్మికులను, వారి కుటుంబాలను బెదిరింపులకు గురి చేసే దుస్సాహసానికి పాల్పడ్డారంటే ఆ కుట్రదారులు ఎవరో అర్ధం కాకుండా ఉందని, ఈ తరహా చర్యల వల్ల ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులైన వారిపై తన గుండె రగిలిపోతోందని డీఎస్ లేఖలో ఆక్రోశం వెళ్లగక్కారు.
ఇప్పటికైనా ఆర్టీసీ సమ్మె పరిణామాలపై అన్ని రకాలుగా ఆలోచనలు చేసి, ఒక కుటుంబ పెద్దగా సత్వరమే ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.