తెలంగాణ

సకల జనుల సమ్మెను తలపిస్తున్న ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 16: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలంతా సంఘటితంగా 42 రోజుల పాటు నిరాటకంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఏ మాత్రం తీసిపోకుండా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కూడా ఎక్కడి పనులు అక్కడే వదిలిపెట్టి నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు 42 రోజులు పూర్తి చేసుకున్నాయి. అవసరమైన జలవనరులతో సస్యశ్యామలంగా పంటలను పండించుకుంటున్న తమ గ్రామాలను ముంపునకు గురిచేయడం ససేమిరా అంటున్నారు. కొనసాగుతున్న ఉద్యమంలో కులం, మతం, వర్ణ విభేదం లేకుండా పదేళ్ల వయస్సు గల పిల్లలు మొదలుకుని పండు వృద్ధుల వరకు నిరాహార దీక్షల కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
బాధితులకు బాసటగా నిలిచేందుకు రోజూ ఎవరో వస్తుండడంతో వారి ముందు గ్రామాల్లో తమ జీవన విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో వివరిస్తూ తమను ఎట్టి పరిస్థితుల్లో విడదీయకుండా ఆదుకోవాలని నిస్సహాయ స్థితిలో వేడుకుంటున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ప్రాజెక్టును కట్టేందుకు ప్రయత్నిస్తే తమ శవాలపైనే కట్టాలని, తమ శవాలనే పునాది రాళ్లుగా ఉపయోగించుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని, వంద శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, అయినా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, గ్రామాలను వదిలేది లేదంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రక్రియ ప్రారంభమైన మూడు నెలల నుంచి ఆందోళనకు గురవుతున్న తమకు బుక్కెడు బువ్వ కూడా కడుపులోకి దిగడం లేదంటే తమ పరిస్థితి ఏమిటో సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు అర్థం చేసుకోవాలని వేములగట్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ మొరపెట్టుకుంటోంది. రాత్రి సమయంలో ఫోన్ చేసి భూమి అమ్ముతున్నట్లు సంతకం పెట్టాలంటూ బెదిరింపు కాల్ వచ్చిందని ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఆరె బాలవ్వ అనే మహిళ వాపోయింది. ఆందోళనకు గురైన ఆమె శనివారం గ్రామాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి విషయాన్ని వివరించి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా శశిధర్‌రెడ్డి నివారించి ధైర్యం కల్పించారు. ఇటీవల కాలంలోనే వివాహాలైన యువతులు మొదలుకుని మహిళలంతా శిబిరాల వద్దకు బిడియపడకుండా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే గ్రామాల్లో వారి జీవనం ఏవిధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల బాల బాలికలు మొదలుకుని పండు వృద్దుల వరకు శిబిరాల వద్ద తిష్ట వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపులు నిర్వహించడం, బతుకమ్మ ఆటలు ఆడినట్లుగానే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కూడా మహిళలు ఆట, పాటల ద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యేడాది కాలంగా ఎంతోమంది గుండెపోట్లతో మృతి చెందుతున్నారని ఓ మహిళ రోదిస్తూ మర్రి శశిధర్‌రెడ్డి బృందం ముందు ఆవేదన వెళ్లగక్కడం బాధాకరం. తరతరాలుగా స్థిర నివాసం ఉంటున్న తాము ఇతర గ్రామాలకు వలస వెళ్లి జీవించలేమని, తమను కాపాడాలంటూ వచ్చిన ప్రతి నాయకుడితో మొరపెట్టుకుంటున్నారు. మొత్తంమీద మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతుందా లేదా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం కావడానికి నిరవధికంగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలే నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు.

చిత్రం.. తొగుట మండలం వేములగట్ దీక్షా శిబిరం ముందు బతుకమ్మ ఆట ఆడుతున్న మహిళలు