తెలంగాణ

భూములిత్తే.. బర్బాద్ జేత్తిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 28: సింగరేణి బొగ్గు పరిశ్రమ వస్తే బతుకులు మారుతాయనుకున్నాం... గనుల ఏర్పాటుకు వేలాది ఎకరాల పంట భూములను ఇచ్చాం... పచ్చని పొలాలు పోయాయి... వందల కుంటలు కనుమరుగయ్యాయి... ఊళ్లన్నీ బొందల గడ్డలయ్యాయి... ఒక్కరికీ ఉపాధి కల్పించింది లేదు... నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేసిందీ లేదు... అంతటా... అన్నింటా... మా బతుకులకు అన్యాయమే జరిగింది... సింగరేణి నమ్ముకుంటే... మా జీవితాలను నిలువునా ‘బర్బాద్’ చేశారంటూ సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు అంతా మూకుమ్మడిగా పొలికేక పెట్టారు. 1950వ దశకం నుంచి ఇక్కడ గనుల నిర్మాణం చేసిన తరువాత సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలకు ఇచ్చిన మాట ఏదీ కూడా నిలుపుకోలేకపోయిందని ప్రజానీకం మండిపడింది. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఎంవిటిసి కార్యాలయంలో ఆవరణలో జిడికె-1, 3, 2, 2ఎ, 5వ బొగ్గు గని విస్తరణ ప్రాజెక్ట్ తవ్వకాల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవిదాస్ సమక్షంలో రామగుండం మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామాలైన జనగామ, కమాన్‌పూర్ మండలంలోని సుందిల్ల, ముస్త్యాల, జల్లారం గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పై బొగ్గు గనుల విస్తరణ సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంపై ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంతా కూడా నిరసనల మధ్య సాగింది. భూగర్భ గనుల నిర్మాణానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని చెబుతూనే ఇక్కడ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టినట్టయితే కచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంతం గనులు, ఓపెన్‌కాస్టులతో బొందల గడ్డగా మారడంతోపాటు అంతా కాలుష్యమై ఇక్కడి ప్రజలు సర్వ రోగాలతో మృత్యువాత పడటమే కాకుండా వేలాది మంది మంచం పట్టారని గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న గనులకు సంబంధించి అనుమతుల సమయం అయిపోయినా ఇంకా తవ్వకాలు జరుపుతుంటే ఎలా ఊరుకుంటున్నారో చెప్పాలని పట్టుబట్టారు. మళ్లీ విస్తరణ చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురై ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. గనుల విస్తరణ కోసం భూములను ధారాదత్తం చేస్తే మా ఊళ్లకు పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తానని ఎన్నో వాగ్దానాలు... అంగీకార పత్రాలు కూడా రాసిచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని దుమ్మెత్తిపోశారు. సింగరేణి వందల కోట్లల్లో లాభాలను గడిస్తూ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నా ప్రభావిత గ్రామాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఇక్కడికి సంబంధించిన కోట్లాది రూపాయల షేప్ నిధులను అధికార పార్టీలోని మంత్రుల నియోజకవర్గాలకు, పక్క జిల్లాల అభివృద్ధికి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లకు నిధులను కేటాయింపు చేయడంపై తీవ్ర స్థాయిలో ప్రజలు, ప్రజానేతలు విరుచుకు పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-1 జిఎం విజయపాల్ రెడ్డి, ఆర్జీ-3 జిఎం సూర్యనారాయణతో పాటు సింగరేణి ఏజీఎంలు, డీజీఎంలు, ప్రభావిత గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొనగా పోలీస్ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రదేశమంతా కూడా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది.
*చిత్రాలు.. జేసీ వనజాదేవి ప్రసంగిస్తుండగా, నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు