తెలంగాణ

‘సరళాసాగర్’కు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫాన్ ప్రాజెక్టుగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు పొందిన సరళాసాగర్ ప్రాజెక్టు ఆనకట్టకు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గండిపడింది. మొదటగా ఆనకట్ట కింది భాగంలో కొద్దిగా గండిపడి నీరు పోతూ ఏకంగా అరగంట వ్యవధిలోనే ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురవుతూ ఒక్కసారిగా తెగిపోయింది. ప్రాజెక్టు మధ్యలోని
ఆనకట్ట తెగిపోవడంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా కిందికి వెళ్లిపోయింది. ఉదయం ఆరు గంటలకు గండిపడగా మధ్యాహ్న ఒంటిగంట వరకు ప్రాజెక్టులోని నీరంతా వెళ్లిపోయి ప్రస్తుతం వెలవెలబోతోంది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట దగ్గర గల సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడడంతో ఆయకట్టు రైతులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్టులోని నీరంతా పంట పొలాలను ముంచుతూ కిందకు వెళ్లిపోయింది. ప్రాజెక్టు ఆనకట్టకు దాదాపు 80 అడుగుల మేర కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది. ఉదయం పూట ప్రాజెక్టు ఆనకట్ట నుండి కిందకు నీరు వస్తుండడంతో నీరు ఎక్కడి నుండి వస్తోందని గమనించిన కొందరు రైతులు కట్ట దగ్గరకు వెళ్లి చూసేసరికి అర గంట వ్యవధిలోనే ఆనకట్టకు పడ్డ గండి పెద్దదిగా మారి కట్టను కోతకు గురి చేసింది. ఈ విషయాన్ని రైతులు గ్రామస్థులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చేసరికి ప్రాజెక్టు నుండి నీరు ప్రవాహంలా పరుగులు తీస్తూ కిందకు వెళ్తోంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కళ్ల ముందే పంటల సాగు కోసం నిల్వ ఉన్న నీరంతా వృథాగా కిందకు పోతుంటే రైతులు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయం గురించి రైతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సమాచారం అందించారు. దాంతో మంత్రి నిరంజన్‌రెడ్డి సరళాసాగర్ ప్రాజెక్టు దిగువన గల రామన్‌పాడ్ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు నుండి నీరు భారీగా వస్తుండడంతో ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను ఎత్తివేయాలని సూచించారు. దాంతో రామన్‌పాడ్ ప్రాజెక్టు అధికారులు పది గేట్లను ఎత్తివేసి కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేశారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుండి పెద్దవాగు ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టులోకి ప్రవాహంలా నీరు వచ్చి చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టుకు రామన్‌పాడ్ ప్రాజెక్టు కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో కొన్ని గంటల్లోనే నీరు రామన్‌పాడ్ ప్రాజెక్టును తాకింది. నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదిలోకి నీరు వెళ్లేలా రామన్‌పాడ్ గేట్లను తెరిచారు. దాంతో కృష్ణానదిలోకి నీరు పరుగులు తీసింది. కాగా, సరళాసాగర్ ప్రాజెక్టు కింద రైతులు ఈ యాసంగి పంటలను సాగు చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. నారుమళ్లు కూడా వేసుకుని కరిగెట్లు చదును చేస్తున్న తరుణంలో ప్రాజెక్టుకు గండి పడటం రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. సరళాసాగర్ ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల ఆయకట్టు దాదాపు 4,182 ఎకరాలు. కుడికాలువ కింద 388.32 ఎకరాలు కాగా ఎడమ కాలువ కింద 3,796.20 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం ఆయకట్టు సాగు చేయడానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపుతూ సరళాసాగర్ ప్రాజెక్టును సైతం ప్రభుత్వం నింపింది. ఈ నేపథ్యంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రాజెక్టు అంతా ఖాళీ కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు పడ్డారు. కాగా, సరళాసాగర్ ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడిందని తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అయితే 2009లో వచ్చిన వరదలకు అప్పట్లో పూర్తి స్థాయిలో నిండిన ప్రాజెక్టు ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతూ వాగుల ద్వారా వచ్చిన నీటితో గత రెండు మూడు నెలల నుండి ప్రాజెక్టును నింపారు. దాంతో యాసంగి పంటలకు సిద్ధమైన తరుణంలోనే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యామని వాపోతున్నారు.

'చిత్రం...వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడి ఆనకట్ట తెగిపోవడంతో వృధాగా పోతున్న నీరు