తెలంగాణ

భూసేకరణ వివాదాలపై సర్కారు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: భూ సేకరణలో వివాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు, పరిశ్రమలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదులక్షల ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణలో మినహా ఎక్కడా పెద్దగా వివాదం తలెత్తలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉద్యమం తరువాత పలు రాజకీయ పక్షాలు మహబూబ్‌నగర్ జిల్లాలో భూ సేకరణపై దృష్టిసారించాయి. 12వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం భూ సేకరణ జరిపితే ఆందోళన జరిపేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 12,500 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే ఇప్పటికే దాదాపు 14వేల ఎకరాల వరకు వివిధ ఔషధ కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మంచి ధర చెల్లించేందుకు సిద్ధం కావడంతో ఇప్పటి వరకు భూ సేకరణకు వ్యతిరేకంగా పెద్దగా ఆందోళనలేమీ ఇక్కడ జరగలేదు. చిన్న స్థాయిలో కాంగ్రెస్ సాగించిన ఆందోళన మినహా రైతుల నుంచి పెద్దగా వ్యతిరేకత తలెత్తలేదు.
ఈ ఖరీఫ్ సీజన్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లాలో గత పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను సైతం పూర్తి చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి 96వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 87వేల ఎకరాల భూమిని సేకరించారు. భూ సేకరణకు దశాబ్దాల తరబడి సమయం పడుతుండడంతో జివో 123 తీసుకు వచ్చి సంప్రదింపుల ద్వారా భూ సేకరణ జరిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం చొరవ తీసుకునేట్టు చేయడం వల్ల వివాదాలు లేకుండా మహబూబ్‌నగర్‌లో భూ సేకరణ పూర్తి చేయగలిగినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల పథకం, మెదక్‌లో నిమ్జ్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉండే ఫార్మాసిటీ, సినిమా సిటీ, ఇతర ప్రాజెక్టులు వీటన్నిటి కోసం దాదాపు ఐదులక్షల ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం అయిందని, మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధర చెల్లిస్తున్నందున మల్లన్నసాగర్ మినహా ఎక్కడా వివాదాలు తలెత్తలేదని అధికారులు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూమిలో రెండు పంటలు పండడం, గ్రామస్తులకు మరో ఆధారం లేకపోవడం, చుట్టు పక్కల భూముల ధరలు ఒకేసారి విపరీతంగా పెరగడం వంటి సమస్యల వల్ల గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురైందని అధికారులు తెలిపారు. గ్రామస్తులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు జోక్యంతో గ్రామాస్తులు కొందరు భూమి ఇవ్వడానికి ముందుకు రాగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. మల్లన్నసాగర్ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని భూ సేకరణలో వివాదాలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నీటిపారుదల శాఖ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా భూ సేకరణపై చర్చిస్తారు. ప్రాజెక్టుల వారిగా భూ సేకరణ స్థితిగతులపై అధికారులతో సమీక్షిస్తారు.